విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింహాచలం మాన్యాలు అన్యాక్రాంతం: దుర్యోధనుడి కంటే దారుణం: సర్కార్ వైఖరిపై టీడీపీ ఎంపీ అసంతృప్తి

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వేళ.. ఆపద్ధర్మంలో ఉన్న సమయంలో.. చంద్రబాబు ప్రభుత్వం అత్యంత సున్నితమైన భూ వివాదాంశంలో జోక్యం చేసుకుంది. చాలాకాలంగా వివాదాలు, న్యాయస్థానాల్లో నానుతోన్న సింహాచలం దేవస్థానం భూముల క్రమబద్దీకరణపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన మాన్యాలను క్రమబద్దీకరించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది.

సింహాచలం ఆలయానికి చెందిన మాన్యాలను క్రమబద్దీకరించడానికి ప్రభుత్వానికి హక్కు ఏముందంటూ ప్రశ్నల జడివాన కురుస్తోంది. పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో పట్ల స్వయంగా తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడే అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేశారంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 547 ఎకరాల విలువైన సింహాచలం ఆలయ భూములను బయటి వ్యక్తులు ఆక్రమించుకోగా.. వాటిని క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Tridandi Chinajeeyar fire on chandrababu government for temple land distribution

సింహాచలం ఆలయ భూములకు చెందిన పంచగ్రామాల భూవివాదాన్ని పరిష్కరిస్తామని.. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చేర్చింది. అయిదేళ్ల పాటు కాలయాపన చేసింది. తీరా.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత హడావుడీగా జీవో నంబర్ 229ను జారీ చేసింది. పంచగ్రామాల భూములను ఆక్రమించుకుని, కట్టడాలను నిర్మించుకున్న ఆక్రమణదారులకు అనుకూలంగా ఈ జీవో వెలువడింది. వారికి భూములను క్రమబద్దీకరించుకోవడానికి అవకాశాన్ని కల్పించింది. దీనిపై పీఠాధిపతులు మండిపడుతున్నారు. ఆలయ మాన్యాలను ఆక్రమించుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, భూములను క్రమబద్దీకరించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

దేవుడి భూములను పంచే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి, శ్రీ త్రిదండి అహోబిలం రామానుజ జీయర్‌స్వామి స్పష్టం చేసారు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో కృష్ణాపురంలోని నృసింహవనంలో ఏర్పాటైన శ్రీ సుదర్శన నారసింహ మహా యజ్ఞంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఉపన్యసించారు. దేవస్థానం ఆధీనంలోని పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్, జీవోలను తప్పుబట్టారు. ఉన్నత లక్ష్యాలతో దేవాలయాల మనుగడకు, భగవంతుడి కైంకర్యాలకు దానంగా ఇచ్చిన ఆస్తులను ఇతరులకు పంచే హక్కు ప్రభుత్వాలకు లేదని చినజీయర్‌స్వామి పునరుద్ఘాటించారు.

దేవుడి ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. ఆలయ ధర్మకర్త, అధికారులతో పాటు ప్రభుత్వంపై ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం టీడీపీ లోక్ సభ సభ్యుడు అశోకగజపతిరాజు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్‌లకు చినజీయర్‌స్వామి హితబోధ చేశారు. సింహాచలం భూములను ఆక్రమించిన వారే అనుభవించేలా అర్డినెన్స్ చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇది సరైన విధానం కాదని అన్నారు. దేవుడిని మోసం చేయడమేనంటూ చినజీయర్‌ స్వామి వ్యాఖ్యానించారు.

Tridandi Chinajeeyar fire on chandrababu government for temple land distribution

ఈవో సహా ఉద్యోగులు, అర్చకులు తమకు అప్పగించిన బాధ్యతలను ఇష్టానుసారం వినియోగించుకునే అధికారం ఉంటుందా? అంటూ జీయర్‌స్వామి ప్రశ్నించారు. దేవుడికి సంబందించిన ఆస్తులు నయాపైసా కూడా ముట్టుకోవడానికి వీలులేదని ఆయన హెచ్చరించారు. అది మీరైనా, ప్రభుత్వమైనా సరే అంటూ చినజీయర్‌స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుడికి, దైవానికి ఉన్న ఆస్తులను తప్ప మిగిలిన వాటిని మనం శాసించవచ్చనంటూ మహా భారతంలోని దుర్యోధనుడి అంశాన్ని జీయర్ ప్రస్తావించారు. దుర్యోధనుడి కంటే దారుణంగా తయారయ్యారని విమర్శించారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాల వల్ల మనిషిలో నైతిక విలువలు పెరుగుతాయని, తద్వారా సమాజం బాగుపడుందనే ఉద్దేశంతో ఆ నాడు వేలాది ఎకరాలను దానంగా ఇచ్చారని జీయర్ గుర్తు చేసారు. పాలకులకు నిజంగా పేదవాళ్లపై ప్రేమ పొంగి పొర్లితే దేవుడి ఆస్తులు ముట్టుకోకుండా ప్రభుత్వ భూములు పంచిపెట్టుకోవాలని, అప్పుడు ఎవరూ ప్రశ్నించరంటూ జీయర్ సూచించారు. దేవాలయాల వ్యవస్థను పరిరక్షించుకోగలిగితే సమాజం సస్యశ్యామలమవుతుందని ఆయన ప్రబోధించారు.

అర్థం పర్థం లేని జీవో: అశోక్

పంచగ్రామాల భూములను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో అర్థం పర్థం లేదని సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ఉద్దేశంతో ఈ జీవో జారీ చేశారోనని ఆయన అసహనాన్ని వెలిబుచ్చారు. దీనిపై తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతానని అన్నారు.

English summary
Spiritual leaders in Andhra Pradesh Tridandi Chinajeeyar Swamy and Ahobilam Ramanuja Jeeyar Swamy critics on Government of Andhra Pradesh and Chief Minister of AP Chandrababu Naidu for regularization of land grabbing of famous Simhachalam Lakshmi Narasimha Swamy Temple at Simhachalam in Visakhapatnam district. Telugu Desam Party Lok Sabha member from Vizayanagaram who is hereditary of the temple also critics on GO released by TDP Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X