ap bandh cpi narayana ycp ap government ys jagan center withdrawal tdp chandrababu cpm vishakhapatnam ప్రైవేటీకరణ వైసిపి ఏపీ ప్రభుత్వం వైఎస్ జగన్ కేంద్రం ఉపసంహరణ టిడిపి చంద్రబాబు సిపిఎం విశాఖపట్నం Visakhapatnam Steel Plant politics
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .. మార్చి 5న ఏపీ బంద్ కు పిలుపు ,తెలంగాణాలోనూ ఉద్యమం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి అఖిలపక్ష పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మరోపక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో ఆందోళన కొనసాగుతుంది .
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ..ఇరుక్కున్న ఏపీ బీజేపీ..రాజీనామాల డిమాండ్

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీలో రాజకీయ దుమారం
ఇక టీడీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం ప్రస్తుత ప్రభుత్వానిది అని విమర్శలు గుప్పిస్తుంటే , వైసిపి టిడిపి హయాంలోనే ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయని ఆ పాపం చంద్రబాబుదే అని తేల్చి చెబుతోంది.
ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో హైకమాండ్ స్టాండ్ నే రాష్ట్ర శాఖ అనుసరిస్తోందని, హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని రాష్ట్ర బీజేపీ స్పష్టం చేస్తోంది. మరోవైపు టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఏకంగా తన పదవికి రాజీనామా చేసి, అందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేసే పోరాటం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రైవేటీకరణకు పడుతున్న అడుగులు.. రాజకీయ నాయకుల అష్టకష్టాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా గంటా శ్రీనివాస్ 25 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. అయినప్పటికీ ప్రైవేటీకరణ దిశగానే మోడీ అడుగులు పడుతున్నట్లుగా ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమైంది. దీంతో ఒక పార్టీపై మరో పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించుకుంటూ తాము కార్మిక పక్షాన పోరాటం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి . ఏది ఏమైనా అన్ని రాజకీయ పార్టీలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం మారదని తెలిసినా తాము కార్మిక పక్షం అని చెప్పుకుంటున్నాయి.

ఆందోళన ఉధృతం చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణా కమిటీ ..మార్చి 5న ఏపీ బంద్
ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఆందోళన బాట పట్టిన కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఆందోళనను ఉదృతం చేయాలని నిర్ణయించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ మార్చి 5వ తేదీన ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మద్దతుగా వర్తక ,వాణిజ్య, విద్యా సంస్థలు, థియేటర్లు, పరిశ్రమలు, రాజకీయ పార్టీలతో సహా అన్ని వర్గాలు సహకరించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరాయి .

విశాఖ ఉక్కు కోసం తెలంగాణాలోనూ ఉద్యమం చెయ్యాలన్న సీపీఐ నారాయణ
ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు కోసం అప్పట్లో తెలంగాణ పౌరులు కూడా ఆత్మ త్యాగం చేశారని దానిని కాపాడుకోవడం కోసం తెలంగాణాలోనూ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలని ఆయన కోరారు. అప్పుడు విశాఖ ఉక్కు కోసం ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు సిపిఐ నారాయణ.

వామపక్షాల ఆధ్వర్యంలో తెలంగాణాలోనూ విశాఖ ఉద్యమం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ప్రధానికి లేఖ రాయాలని సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి పేర్కొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా విశాఖ ఉక్కు కోసం పోరాటం చేస్తామన్నారు.
ఏది ఏమైనా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి రంగం సిద్ధం చేస్తోంది.
అందులో భాగంగానే ఈనెల 5 న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది .