మూడు ముక్కలాట..ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ..రీజన్ ఇదేనా !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమవుతాయేమో అని,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని సూచనప్రాయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో ప్రకటన చేశారు. ఇక దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.

వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండీ రాజధానిపై నీలినీడలు
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏపీ రాజధాని మారుస్తున్నారని, దొనకొండ కు దానిని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజధానిగా అమరావతి అనుకూల ప్రాంతం కాదని, వరదలు వస్తే ముంపునకు గురవుతుందని ఇలా రకరకాలుగా రాజధాని అమరావతి పై నీలినీడలు అలుముకున్నాయి.

అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు రాజధానుల ఫార్ములా
గత ఆరు నెలల కాలంగా రాజధాని అమరావతి పై జోరందుకున్న వివాదానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన ప్రకటనతో తెరదించినట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా తరహాలో ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని స్పష్టం చేసిన జగన్ మోహన్ రెడ్డి దక్షిణ ఆఫ్రికా ఫార్ములాను ప్రస్తావించారు. దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని అధికార వికేంద్రీకరణ అవసరమని పేర్కొన్నారు. ఇక అంతే కాదు ప్రస్తుతం వున్న అమరావతిని లిజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తామన్న హింట్ ఇచ్చిన ఆయన ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసే యోచన .. స్వాగతించిన గంటా
సీఎం జగన్ ప్రకటనతో విశాఖ వాసులలో సంతోషం వ్యక్తమవుతోంది. తమ ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల విశాఖ వాసులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఏకంగా టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, విశాఖ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ చేయడానికి కావలసిన బ్రహ్మాండమైన మౌలిక వసతులు వున్న విషయాన్ని గుర్తు చేశారు. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పారు.

పరిపాలనా సౌలభ్యం ఉన్న ప్రాంతం , మెట్రో రైలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
పరిపాలనకు కావలసిన ప్రభుత్వ భూములు, పాలన వ్యవహారాలకు అనువైన వాతావరణం, ఉద్యోగులందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాలు సైతం విశాఖలో ఉండటం వల్లే వైసీపీ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సభలో సీఎం కూడా ఒక్క మెట్రో రైల్ తప్పితే పరిపాలనకు కావలసిన అన్ని వసతులు ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విశాఖ మెట్రో రైలు ఏర్పాటుకు కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే ఆలోచనపై కోస్తాంధ్ర వాసుల ఆనందం
ఇక ఈ నేపథ్యంలోనే నిపుణుల కమిటీ నివేదిక అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా నిర్ణయం తీసుకోనున్నారు.ఇప్పటికే సూచనప్రాయంగా సీఎం జగన్ చేసిన ప్రకటనతో కచ్చితంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధాని గా మార్చే ఆలోచన ఉందని అర్థమవుతోంది. ఒకవేళ ఇదే జరిగితే సెక్రటేరియేట్‌ను అమరావతి నుంచి తరలించడమే కాకుండా ఇకపై పరిపాలనా వ్యవహారాలన్నీ కూడా విశాఖ నుంచే కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో కోస్తాంధ్ర వాసుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జగన్ తీసుకున్న నిర్ణయం సమంజసమైన నిర్ణయమని, సాహసోపేతమయిన నిర్ణయమని పలువురు రాజకీయ నేతలు సైతం ప్రశంసిస్తున్న పరిస్థితి ఉంది.