నిర్మలమ్మ ప్రకటన చిచ్చు: మండుతోన్న విశాఖ: వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనల సెగ: రాత్రంతా
విశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించి తీరుతామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తాజాగా లోక్‌సభలో చేసిన ప్రకటన.. అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. సుదీర్ఘకాలం పాటు ప్రదర్శనలు, రాష్ట్రవ్యాప్త బంద్‌ను నిర్వహిస్తూ తమ నిరసనను తెలియజేస్తోన్నప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం వైఖరిలో ఎలాంటి మార్పూ రాకపోవడం పట్ల ఉద్యమకారుల్ల అసహనం మరింత పెరిగింది. నిర్మలా సీతారామన్ ప్రకటన వెలువడినప్పటి నుంచి తమ ఆందోళనలను వారు తీవ్రతరం చేశారు. అర్ధరాత్రి దాటేంత వరకూ రహదారులపై బైఠాయించారు.

స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయింపు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. వందశాతం మేర పెట్టుబడులను ఉపసంహరిస్తామని ఆమె పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ లేదని తేల్చేశారు. ఈ ప్రకటన వెలువడిన తరువాత.. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఆ వెంటనే స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద బైఠాయించాయి. అర్ధరాత్రి దాటేంత వరకూ వారి ఆందోళన కొనసాగింది. ఫలితంగా- కూర్మన్నపాలెం నుంచి విమానాశ్రయం వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి.
వైసీపీ ఎమ్మెల్యేలకు సెగ..
నిరసనలు కొనసాగుతోన్న సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి (గాజువాక), కన్నబాబు రాజు (యలమంచిలి) అటుగా రావడంతో ప్రదర్శనకారులు వారి వాహనాలను అడ్డుకున్నారు. ఘెరావ్ చేశారు. కన్నబాబు రాజును చుట్టుముట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై స్పష్టత ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ప్రైవేటీకరణను విరమించుకునేలా మోడీ సర్కార్‌పై ఒత్తిడిని తీసుకుని రాలేకపోయారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటీకరణను నిలుపుదల చేయడానికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిస్తోందని స్పష్టం చేశారు.
మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
కూర్మన్నపాలెం జంక్షన్లో కార్మిక సంఘాల ప్రతినిధులు రాస్తారోకో నిర్వహించారు. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవట్లేదని వారు విమర్శించారు. ఇంత జరుగుతున్నా వెనక్కి తగ్గకపోవడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా కలిసి బీజేపీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, బంద్‌లు జరుగుతుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడిస్తామని అన్నారు.