రామతీర్ధంలో కుట్ర కోణం- ఛేదిస్తామన్న మంత్రి అవంతి-రెచ్చగొట్టొద్దని పార్టీలకు హితవు
విజయనగరం జిల్లా రామతీర్ఘంలో రాముడి విగ్రహం ధ్వంసంపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులు దీనిపై స్పందిస్తున్నారు. ఈ ఘటన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేయడం మాని విపక్షాలు రాజకీయాలు చేయడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో రామతీర్ధం ఘటనపై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్ ఇందులో కుట్ర కోణం ఉందన్నారు.
విజయనగరం జిల్లా రామతీర్ధంలో జరిగిన విగ్రహ ధ్వంసం ఘటనలో కుట్ర కోణం ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. దీన్ని తాము త్వరలోనే ఛేదిస్తామని మంత్రి అవంతి తెలిపారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. అయితే దీనిపై విపక్షాల వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్, డీజీపీ మతాల గురించి మాట్లాడటం తనకు ఆవేదన కలిగించిందన్నారు.

రాష్ట్రంలో ఇతర దేవాలయాల ఘటనలు జరిగినప్పుడు సందర్శించని చంద్రబాబు.. రామతీర్ధానికి మాత్రమే ఎందుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. సొంత జిల్లాలో ఉన్న తిరుమలకు వెళ్లి చంద్రబాబు ఎప్పుడైనా తలనీలాలు సమర్పించారా అని అవంతి ప్రశ్నించారు.
అలాగే బీజేపీ, జనసేన చేస్తున్న రాజకీయాలపైనా అవంతి మాట్లాడారు. ఈ రెండు పార్టీలకు ఎంత దైవభక్తి ఉందో తనకూ అంతే ఉందన్నారు. ఈ రెండు పార్టీలు గుళ్లపై రాజకీయాలు చేయడం మాని విభజన హామీల సాధన కోసం ప్రయత్నించాలని అవంతి సూచించారు. చంద్రబాబు ట్రాప్లో మాత్రం పడొద్దని బీజేపీ, జనసేన పార్టీలను అవంతి కోరారు. 90 శాతం హిందువులు ఉన్న వైసీపీపై క్రిస్టియన్ పార్టీ ముద్ర వేయాలని చూస్తున్నారని అవంతి తెలిపారు.