andhra pradesh visakhapatnam vizag Visakhapatnam Steel Plant ys jagan plan tdp ap govt ap news ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రైవేటీకరణ టీడీపీ ఏపీ ప్రభుత్వం politics
జగన్ ప్లాన్ బ్యాక్ ఫైర్- భూములమ్మి స్టీల్ ప్లాంట్ కాపాడతారా ? సర్వత్రా విమర్శల వెల్లువ
ఎన్నో పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం, విపక్షాలతో పాటు కార్మిక సంఘాలు సైతం ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడటం కోసం సీఎం జగన్ తాజాగా ప్రధానికి రాసిన లేఖతో పాటు కార్మిక సంఘాల భేటీలోనూ ఓ ప్రతిపాదన చేశారు. స్లీల్ ప్లాంట్ భూముల్లో 7 వేల ఎకరాలు అమ్మడం ద్వారా కర్మాగారాన్ని కాపాడుకోవచ్చని ప్రతిపాదించారు. అయితే విపక్షాలతో పాటు కార్మికసంఘాలు, స్ధానికులు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం దుమారం
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అడ్డుకోవాలంటే ఏదో ఒకటి చేయక తప్పని పరిస్ధితుల్లో వైసీపీ సర్కారు చేసిన ఓ ప్రతిపాదన రాష్ట్రంలో దుమారం రేపుతోంది. స్టీల్ ప్లాంట్‌కు ఉన్న భూముల్లో 7 వేల ఎకరాలను అమ్మడం ద్వారా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవచ్చని సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో ప్రతిపాదించారు. అలాగే తాజాగా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో జరిగిన భేటీలోనూ ఇదే విషయం చెప్పారు. అయితే దీనికి అంగీకరించాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే. కానీ ఆ లోపే ఈ ప్రతిపాదనపై రాష్ట్రంలో విపక్షాలు, కార్మిక సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

విరాళంగా వచ్చిన భూముల అమ్మకమా ?
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అప్పట్లో కురుపాం జమీందార్ల కుటుంబం 6 వేల ఎకరాల భూమిని ఉచితంగా ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే పేరుతో భూముల్ని అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది. భూములమ్మి ప్లాంట్ కాపాడాలన్న ఆలోచనే సరికాదని మేధావులు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణను ఆపేందుకు వాటి భూములు అమ్ముకుంటూ పోతే ఇక వాటికి మిగిలేదేమీ ఉండదనే వాదన వినిపిస్తోంది.

భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కర్మాగారానికి చెందిన 7 వేల ఎకరాల భూములు అమ్మాలన్న సీఎం జగన్ ప్రతిపాదనకు విపక్షాల నుంచి సైతం తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం దాతలు ఇచ్చిన భూముల్ని అమ్మడం ద్వారా ప్లాంట్‌ను కాపాడాలని ప్రభుత్వం భావించడం సరికాదని విపక్షాలు చెబుతున్నాయి. చేతనైతే ప్రభుత్వం నేరుగా వాటాల కొనుగోలు ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి ప్రయత్నిస్తే న్యాయపోరాటం చేసేందుకూ సిద్ధమని తేల్చి చెప్తున్నాయి.

జగన్ ప్లాన్ బ్యాక్‌ఫైర్ అయిందా ?
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు వైసీపీ సర్కార్ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్ధితి నెలకొంది. ఓవైపు ఎన్నికలను ఎదుర్కొంటున్న వేళ విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తే తప్ప కార్మికసంఘాలు, స్ధానికుల నుంచి వస్తున్న వ్యతిరేకతను అధిగమించడం సాధ్యం కాదు. సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లోనే స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకాన్ని జగన్ తెరపైకి తెచ్చారు. అయితే అసలే స్టీల్ ప్లాంట్‌ను సెంటిమెంట్‌గా భావించే విశాఖ స్ధానికులతో పాటు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో జగన్ ప్రతిపాదనకు ఎదురుదెబ్బ తప్పడం లేదు.