rath yatra bjp somu veerraju ysrcp visakhapatnam రథయాత్ర బీజేపీ సోము వీర్రాజు అవంతి శ్రీనివాస్ విశాఖపట్నం politics
బీజేపీలో ఉంటేనే హిందువులుగా గుర్తిస్తారా?: వైఎస్ జగన్‌లో మోడీ తరహా నాయకత్వం: మంత్రి అవంతి
విశాఖపట్నం: రాష్ట్రంలో కొద్దిరోజుల కిందటి వరకూ వరుసగా చోటు చేసుకున్న ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసాలకు నిరసనగా రథయాత్రను నిర్వహించాలంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు తీర్మానించుకోవడం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరి కోసం, ఎవరికి రాజకీయ లబ్ది కలిగించడానికి ఈ రథయాత్రను నిర్వహించ తలపెట్టారని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక మైలేజీ కోసమే బీజేపీ నాయకులు తాపత్రయ పడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు.
రామతీర్థం చుట్టూ మరో వివాదం: జగన్ సర్కార్‌పై విమర్శలకు టీడీపీ మళ్లీ అవకాశం దొరికినట్టే

రాష్ట్ర ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా?
విగ్రహాల విధ్వంసకాండను వ్యతిరేకిస్తూ.. వచ్చేనెల 4వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు రథయాత్రను నిర్వహించే ఆలోచన ఉన్నట్లు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై త్వరలో ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని ఆయన తెలిపారు. రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఆయన చేసిన ప్రకటనను విశాఖపట్నానికి చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పు పట్టారు. బీజేపీ నాయకుల తీరు చూస్తోంటే.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేనట్టు కనిపిస్తోందని విమర్శించారు.

దాడులను అరికట్టడానికి అన్ని చర్యలు..
సోమవారం ఆయన విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రథయాత్రను ఎందుకు నిర్వహించ తలపెట్టారనేది బీజేపీ నాయకులకు కూడా అర్థం కావట్లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అయోధ్య సమస్య పరిష్కారమైందని, అలాగే- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో.. రాష్ట్రంలో దేవాలయాలు, విగ్రహాలపై చోటు చేసుకున్న దాడుల వెనుక ఎవరున్నారనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోందని అన్నారు. నరేంద్ర మోడీలోని నాయకత్వ లక్షణాలు వైఎస్ జగన్‌లో ఉన్నాయని చెప్పారు.

బీజేపీలో ఉన్నవాళ్లే హిందువులా?
బీజేపీలో ఉన్న వాళ్లు.. లేదా బీజేపీలో చేరిన వాళ్లనే హిందువులు అనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీలో ఉన్నవాళ్లు అన్యమతస్తులనే ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలను ప్రభుత్వమే అధికారికంగా తొలగించిందని, ధ్వంసానికి పాల్పడిందని గుర్తు చేశారు. ఆ సమయంలో బీజేపీ నాయకుడే దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారనే విషయాన్ని మరిచిపోతే ఎలా? అని ప్రశ్నించారు. అప్పుడు ప్రశ్నించని బీజేపీ నేతలు.. ఇప్పుడు విగ్రహాల విధ్వంసం గురించి ప్రస్తావిస్తుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కోసమే..
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కోసమే వారు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నారనేది స్పష్టమౌతోందని చెప్పారు. దేవాలయాల కూల్చే చంద్రబాబును బీజేపీ నేతలు దేవుడిగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. మతాలు, ప్రాంతాల మధ్య విధ్వేషాన్ని సృష్టించే చర్యలను ఎవ్వరు కూడా సమర్థించబోరని హితవు పలికారు. రెండు కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారని, వారంతా హిందువులు కాదా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినప్పటికీ.. బీజేపీ నేతలు వారిని అన్యమతస్తుల్లా చూస్తున్నారని ధ్వజమెత్తారు.