రైల్వే ట్రాక్ పై పాత బ్యాగ్ లో ఏముందో చూసి షాకైన స్థానికులు!!
ఏ తల్లుల కన్న బిడ్డలో లోకం తెలియకముందే చెత్త బుట్టల పాలవుతున్నారు. రైల్వే ట్రాక్ ల మీద దర్శనమిస్తున్నారు. పుట్టీ పుట్టగానే గుట్టు చప్పుడు కాకుండా కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే, మరికొందరు అమ్మకాల బారిన పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే ట్రాక్ పై ఓ పాత బ్యాగ్‌లో శిశువును పెట్టి వదిలి వెళ్లిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
అసలే మండుటెండ కాలం.. ఇలాంటి ఎండలో విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. రైలు పట్టాల పైన ఒక పాత బ్యాగ్ లో ఒక మగ శిశువు పడేసి వెళ్ళారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక ఈ విషయాన్ని గుర్తించారు స్థానికులు. శిశువు బతికి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.ఎస్.రావు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవలస రైల్వేస్టేషన్లోఒక పాత బ్యాగ్ లో పసికందు లభ్యమైంది. రైల్వే ట్రాక్‌పై బ్యాగులో ఉన్న శిశువును అక్కడ దగ్గరలో పండ్ల వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తి చూశాడు.

పసివాడి ఏడుపు విని అక్కడికి వెళ్లి చూసిన పండ్ల వ్యాపారి అందులో ఉంది మగ శిశువు అని గుర్తించాడు. శిశువు బ్రతికే ఉన్నాడని గుర్తించారు. వెంటనే తమకు సమాచారం అందించడంతో తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఐపీసీ సెక్షన్ 317 కింద కేసు నమోదు చేసామని వెల్లడించారు. శిశువును ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ICDS)కి అప్పగించామని తెలిపారు. మొదట, శిశువును సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించామని, టీకాలు వేయించామని పోలీసులు తెలిపారు.
రైల్వేస్టేషన్ దగ్గర పట్టాలపై పసికందు కనిపించిందన్న సమాచారం అందిన వెంటనే అధికారులు పసికందును ఐసీడీఎస్ పరిధిలోని శిశు గృహ కు తీసుకెళ్లినట్టు కొత్తవలస ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత తెలిపారు. శిశువు ఇప్పుడు ఐసిడిఎస్ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. శిశువు తాలూకు ఎవరైనా మనసు మార్చుకుంటే తమ వద్దకు ఆధారాలతో రావాలని సూచిస్తున్నారు.