డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కుమార్తె పేరు ఇదే: వైఎస్ కుటుంబంపై అలా అభిమానం
విజయనగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె ప్రసవించారు. పుష్ప శ్రీవాణికి ఇదే తొలి కాన్పు. ఆ బిడ్డకు నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ చిన్నారికి యశ్విత శ్రీజగతిగా పేరు పెట్టారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం
చినమేరంగిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ, పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై ఉన్న అభిమానాన్ని పుష్ప శ్రీవాణి-శతృచర్చ పరీక్షిత్ రాజు మరోసారి చాటుకున్నారు. వై అనే అక్షరం కలిసి వచ్చేలా యశస్వి.. ఎస్ అనే అక్షరం వచ్చేలా శ్రీజగతి అని ఆ చిన్నారికి పేరు పెట్టారు. అలాగే- వైస్ జగన్, ఆయన భార్య భారతి పేర్లు కలిసి వచ్చేలా జగతి అని నామకరణం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడేనికి చెందిన పుష్పా శ్రీవాణికి 2014లో వివాహమైంది. ఆమె భర్త శతృచర్ల పరీక్షిత్ రాజు. ఆయన వైఎస్సార్పీపీ అరకు లోక్సభ నియోజకవర్గం సమన్వయకుడిగా వ్యవహరిస్తున్నారు. వివాహం అనంతరం ఆమె విజయనగరం జిల్లాలోని జియమ్మవలస మండలంలోని చినమేరంగిలో స్థిరపడ్డారు. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.

పుష్ప శ్రీవాణి-పరీక్షిత్ రాజు దంపతులకు ఆడబిడ్డ జన్మించడం పట్ల వారి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు ఆ దంపతులకు ఫోన్ చేసి, విషెష్ చెప్పారు. ఇదివరకు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా పుష్ప శ్రీవాణి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

