బొత్స రాజకీయ గురువు పెన్మెత్స సాంబశివరాజు కన్నుమూత- విజయనగరంలో విషాదఛాయలు
విజయనగరం : సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి పెన్మెత్స సాంబశివరాజు ఇవాళ విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్న పెన్మెత్స మృతితో విజయనగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విజయనగరంతో పాటు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పెన్మెత్స సాంబశివరాజుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు మంత్రిగా, 8 సార్లు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. 1968లోనే తొలిసారి గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సాంబశివరాజు... ఆ తర్వాత కూడా గజపతినగరం, సతివాడ స్ధానాల నుంచి 8 సార్లు ఏకధాటిగా గెలుపొందారు. 1989-94లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ కు అండగా నిలిచారు.

ప్రస్తుత ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పెన్మెత్స.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. ప్రత్యేకంగా బొత్స సత్యనారాయణకు రాజకీయ గురువుగా పేరు తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీలోకి కూడా బొత్స కంటే ముందే చేరిన ఆయనకు తగిన గౌరవం దక్కలేదు. వయసు మీద పడటం గతంలోలా కేడర్ నుంచి సహకారం లభించకపోవడం, ఇతరత్రా కారణాలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా ఆయన అనారోగ్యంతో విశాఖ ఆస్పత్రిలో చేరారు. పరిస్ధితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.