andhra pradesh vizianagaram odisha supreme court affidavit collector orders ap govt విజయనగరం ఒడిశా సుప్రీంకోర్టు కలెక్టర్ ఆదేశాలు ఏపీ ప్రభుత్వం
కొటియా పంచాయతీ- సుప్రీంలో జగన్ సర్కార్ అఫిడవిట్- ఒడిశా వివరణకు 4 వారాల గడువు
ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య సమస్యగా మారిన కొటియా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నానాటికీ వివాదాస్పదమవుతోంది. కొటియా గ్రామాల్లోని మూడు పంచాయతీల్లో ఏపీ నిర్వహించిన పంచాయతీ ఎన్నికలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వివాదాస్పద గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని వాదిస్తోంది. అయితే ఈ గ్రామాలన్నీ తమ భూభాగంలోనివే అంటూ విజయనగరం జిల్లా కలెక్టర్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఏపీ సర్కారు అఫిడవిట్‌పై వివరణ ఇవ్వాలని కోరుతూ నాలుగు వారాల గడువు ఇచ్చింది.

సుప్రీంకోర్టులో కొటియా పంచాయతీ
కొటియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించడం కలకలం రేపుతోంది. గతంలో కొటియా గ్రామాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేటస్ కో కు వ్యతిరేకంగా ఏపీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపిస్తున్న ఒడిశా సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోనూ కాక రేపుతోంది. ఏపీ ప్రభుత్వం వాదనను పరిగణనలోకి తీసుకుని అక్కడ ఎన్నికలు నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఇప్పుడు ఒడిశా పిటిషన్లో ప్రతివాదిగా మారారు. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు కొటియా గ్రామాల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.

ఒడిశా పిటిషన్‌పై ఏపీ కౌంటర్
తమ భూభాగంలోకి వచ్చే కొటియా గ్రామాల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో ఒడిశా సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మరోవైపు ఒడిశా పిటిషన్‌కు కౌంటర్‌గా విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఏపీ ప్రభుత్వం తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో కొటియా గ్రామాలు తమ రాష్ట్రంలో భాగమేనని, అందుకే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. గతంలోనూ ఇక్కడ ఎన్నికలు జరిపిన విషయాన్ని సుప్రీంకోర్టుకు గుర్తుచేశారు.

ఒడిశా వివరణకు నాలుగు వారాల గడువు
తమ పరిధిలో ఉన్నందునే కొటియా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఏపీ సర్కార్ దాఖలు చేసిన కౌంటర్ అఫిడివిట్‌పై స్పందన తెలిపేందుకు ఒడిశా ప్రభుత్వం నాలుగు వారాలు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది. దీంతో సుప్రీంకోర్టు కూడా ఒడిశా విజ్ఞప్తిని ఆమోదిస్తూ నాలుగు వారాల గడువు ఇచ్చింది. అంతవరకూ కొటియా గ్రామాలపై విచారణను వాయిదా వేసింది. అయితే ఈ నెల 21తో ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. నాలుగో విడత ఎన్నికలు కూడా జరిగిపోయాక ఒడిశా దాఖలు చేసే వివరణపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.