ఆ దేవుడి దయతో అని చెప్తే సరిపోతుందా జగన్ .. మాన్యాలపై ఉన్న శ్రద్ధ దేవుడిపై లేదా : అచ్చెన్నాయుడు ధ్వజం
నూతన సంవత్సరం తొలి రోజే వైసీపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న రామతీర్థం ఘటన మరువకముందే తాజాగా రాజమండ్రిలో విఘ్నేశ్వర ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి చేతులు విరగ్గొట్టిన ఘటన, ఇదే సమయంలో విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ లోని కోమాలమ్మ అమ్మవారి పాదాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు .
ఏపీలో రంగుల రచ్చ..పోలీస్ వాహనాలు వైసీపీ ప్రచార రథాలా?:అచ్చెన్నాయుడు, లోకేష్ ఫైర్

దేవుళ్లకు జరుగుతున్న అవమానాల పై జగన్ రెడ్డి మాట్లాడాలన్న అచ్చెన్నాయుడు
వరుస ఆలయాలపై దాడులపై టీడీపీ ఏపీ ప్రభుత్వాన్ని , సీఎం జగన్ ను టార్గెట్ చేస్తుంది. ఈ ఘటనలపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . సీఎం జగన్ మోహన్ రెడ్డి టీవీల ముందు, ప్రజల ముందు, ఆ దేవుని దయతో అంటూ మొదలు పెడతారని, అలా చెప్పడం మాత్రమే దేవుడిపై భక్తి ఉన్నట్టు కాదని, దేవుళ్లకు జరుగుతున్న అవమానాల పై జగన్ రెడ్డి మాట్లాడాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు . రామతీర్థం ఘటన మరువక ముందే ఇప్పుడు రాజమండ్రిలో, విశాఖలో విగ్రహ విధ్వంసం కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు .

జగన్ పాలనలో ప్రజలకే కాదు దేవుళ్ళకు కూడా రక్షణ లేదు
సీఎం జగన్ అహంకారాన్ని వీడకపోతే ఆ దేవుడే తమ మదాన్ని అణగదొక్కుతారని అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి లేదని, వైసిపి పాలనలో ఈ సంస్కృతి పెరిగిపోతుంది అంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖా మంత్రి ఉన్నాడో లేడో కూడా అర్థంకాని పరిస్థితి ఉందని మండిపడిన అచ్చెన్నాయుడు జగన్ పాలనలో ప్రజలకే కాదు దేవుళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.

అలసత్వం వీడకుంటే రాష్ట్ర వ్యాప్తం ఆందోళన .. అచ్చెన్న అల్టిమేటం
దేవుడి మాన్యాల పై ఉన్న శ్రద్ధ ఇప్పుడు దేవుడుకు జరుగుతున్న అవమానాలపై , ఆలయాలపై దాడులపై ఎందుకు లేదంటూ ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. ప్రభుత్వ అలసత్వం వీడకపోతే, ఆలయాలపై దాడులు ఘటనలపై తీవ్ర చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని అచ్చెన్నాయుడు ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ధార్మిక సంఘాల నుండి, హిందూ సంఘాల నుండి ఆలయాలపై దాడులు, విగ్రహ ధ్వంస ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది .