పేకాట క్వీన్స్ ... ఏపీలో పేకాడుతూ పట్టుబడిన మహిళలు.. షాక్ అయిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు క్యాసినో లను మించి సాగుతున్న పేకాట కేంద్రాలు ఏపీ రాజకీయాలను సైతం కుదిపేస్తున్నాయి. ఇక పురుషులకు దీటుగా మహిళలు సైతం తాము ఏమాత్రం తగ్గమంటూ విచ్చలవిడిగా పేకాట ఆడటం ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.

పోలీస్ రైడ్స్ లో పట్టుబడిన పేకాట ఆడుతున్న మహిళలు
ఒకపక్క ఏపీ ప్రభుత్వం పేకాట ఆడుతున్న వారిపై కొరడా ఝుళిపించడానికి టీమ్స్ ను రంగంలోకి దింపింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పేకాట స్థావరాలపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. అయినా సరే.. మూడుముక్కలాట వ్యసనం మగువలను గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడేలా మార్చేసింది.
పక్కా సమాచారంతో విజయనగరం వుమెన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నేతృత్వంలో రైడ్ చేసిన పోలీసులు విజయనగరంలోని ఉల్లివీదిలో పేకాట ఆడుతున్న మహిళలను పట్టుకుని వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు.

తొమ్మిది మంది మహిళల అరెస్ట్ ..30,300రూపాయలు స్వాధీనం
రమ్మీ ఆడుతున్న తొమ్మిది మంది మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 30 వేల మూడు వందల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న మహిళల పై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం ఈ కేసును వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
విచ్చలవిడిగా పేకాట స్థావరాలపై కొనసాగుతున్నాయని, మంత్రుల అండదండలతోనే అవి సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో పేకాట క్వీన్స్ ఎలాంటి భయమూ లేకుండా పేకాట ఆడుతుండడం గమనార్హం .

ఏపీలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న పేకాట డెన్ లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న పేకాట స్థావరాలపై ఉపాధి మోపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా, ఎలాంటి భయం లేకుండా మహిళలు పేకాట ఆడుతున్నారు అంటే, ఇక పురుషుల సంగతి వేరే చెప్పనవసరం లేదు.
ఇక పేకాట డెన్ లు నిర్వహించే వారు కూడా పక్కా ప్లాన్ ప్రకారం రోజుకో స్థావరానికి అడ్డాలు మారుస్తూ , పోలీసులకు దొరక్కుండా , అక్కడ అసలు నగదు పెట్టకుండా టోకెన్ సిస్టం ద్వారా పేకాట నిర్వహిస్తున్నారు .

ఏపీ సర్కార్ కు తలనొప్పిగా పేకాట రాయుళ్ళు మాత్రమే కాదు పేకాట పాపమ్మలు కూడా
సప్త వ్యసనాలలో పేకాట ఒకటి. జూద ప్రియులు ఎవరెన్ని చెప్పిన, ఇల్లు, ఒళ్ళు గుల్ల అవుతున్నా పేకాట మాత్రం విడిచిపెట్టరు. పోలీసులు పట్టుకుంటారని తెలిసినా దొంగచాటుగా పేకాట ఆడుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేకాట రాయుళ్లు శివారు ప్రాంతాల్లోని తోటలలో, చెరువు గట్ల వద్ద, నదుల్లో బోట్లలో ప్రయాణం చేస్తూ పేకాట ఆడుతూ ఎవరికీ దొర్కక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ఇప్పుడు పేకాట రాయుళ్ళు మాత్రమే కాదు పేకాట పాపమ్మలు కూడా ఏపీ సర్కార్ కు టెన్షన్ పుట్టిస్తున్నారు.