వీడియో: ఏ3గా కళా వెంకట్రావ్: విడుదల: అరెస్ట్‌కు కారణం వెల్లడించిన విజయనగరం ఎస్పీ
విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కళా వెంకట్రావ్ విడుదల అయ్యారు. ఆయనను అరెస్ట్ చేసిన అనంతరం సుమారు మూడు గంటల పాటు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆయన నుంచి కొంత సమాచారాన్ని సేకరించిన తరువాత విడుదల చేశారు. ఆయనను అరెస్ట్ చేయడానికి, ఆ వెంటనే విడుదల చేయడానికి గల కారణాలను విజయనగరం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాజకుమారి వెల్లడించారు. అరెస్టుపై వివరణ ఇచ్చారు.

విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో ప్రమేయం ఉందనే కారణంతో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆయనను విజయనగరం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనను విచారించిన అనంతరం వెంటనే విడుదల చేశారు.

ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులు అదుపులోకి
కారులో ప్రయాణిస్తోన్న తనపై చెప్పులు విసిరిన ఘటనలో నిందితులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలంటూ ఇదివరకు విజయసాయి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ3గా కళా వెంకట్రావ్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించినంత వరకు ఆయన చెప్పే వివరాలను తెలుసుకోవడానికి మాత్రమే కళా వెంకట్రావ్‌ను అరెస్ట్ చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి చెప్పారు. ఈ ఘటనలో ఆయన పాత్ర ఎంత వరకు ఉంది?, ఆయన ఇచ్చే సమాచారం ద్వారా ముందుకు వెళ్లడానికే అదుపులోకి తీసుకున్నామని, అనంతరం విడుదల చేశామని ఎస్పీ చెప్పారు.
రామతీర్థం వెళ్లినప్పుడు..
శ్రీరామచంద్రమూర్తి విగ్రహం విధ్వంసానికి గురైన విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు కొందరు అనుమానిత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయసాయి రెడ్డి ప్రయాణిస్తోన్న కారుపై చెప్పులు విసిరారు. దీనిపై ఆయన నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొందరి పేర్లను ఆయన ఈ ఫిర్యాదులో చేర్చారు. ఈ కేసులో కళా వెంకట్రావ్ పేరును ఏ3గా నమోదు చేశారు. ఈ విషయంలోనే విచారించడానికి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విడిచిపెట్టారు.

అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్త నిరసనలు..
కళా వెంకట్రావ్ అరెస్ట్ పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన వెనుకబడిన వర్గానికి చెందిన నేతను అరెస్ట్ చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దురహంకారానికి నిదర్శనం అంటూ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్రశాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వంటి నేతలు అప్పటికప్పుడు స్పందించారు. అరెస్టయిన వెంటనే కళా వెంకట్రావ్‌ను విడుదల చేయడంతో.. నిరసలను నిర్వహించడంపై అస్పష్టత ఏర్పడింది.