సంక్రాంతికి ముందు బ్యాంకు ఖాతాల్లో ఊహించని డబ్బు .. పండుగ చేసుకుంటున్న జనం , ఎంత డబ్బంటే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో శివరాంపురం గ్రామంలో ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. అదేంటి సంక్రాంతి రాకముందే పండుగ చేసుకోవడం ఏంటీ అని ఆలోచిస్తున్నారా.. ఈ గ్రామంలోని ప్రజల ఖాతాల్లోకి ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు కానీ డబ్బు వచ్చి పడడంతో తెగ సంబర పడిపోతున్నారు. అందుకే ఊర్లో ప్రస్తుతం పండుగ వాతావరణం కొనసాగుతుంది.
ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం .. సముద్రంలో నుండి కొట్టుకొస్తుందని ఎగబడ్డ జనం

200 మంది ఖాతాలలో 13,500 రూపాయల నుండి 16 వేల వరకు నగదు
అసలేం జరిగిందంటే విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో ఉన్న గ్రామస్తులకు 200 మంది ఖాతాలలో 13,500 రూపాయల నుండి 16 వేల వరకు నగదు వచ్చిపడింది. 607కుటుంబాలున్న ఆ గ్రామంలో వివిధ బ్యాంకుల్లో ఉన్న గ్రామస్తుల ఖాతాలకు నగదు వచ్చి పడింది . మీ ఖాతాలో డబ్బు పడిందని బ్యాంకుల నుండి నగదు జమ అయినట్లు మెసేజ్ లు రావడంతో ఆశ్చర్యానికి గురైన గ్రామస్తులు ఖాతాలను చెక్ చేసుకున్నారు.

భూమి లేనికి వారికి కూడా ... రైతు భరోసా కూడా కాదు .. నగదుపై గందరగోళం
నిజంగానే నగదు జమ కావడంపై గందరగోళానికి గురవుతున్నారు. కొందరు డబ్బు చూసి ఎగిరి గంతెస్తుంటే , మరికొందరు ఎక్కడి నుండి ఈ నగదు వచ్చింది అని ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండటంతో, అది ఎక్కడి నుంచి వచ్చిన నగదు అనేది మాత్రం అర్థం కావడం లేదు. రైతు భరోసా కు చెందిన డబ్బులు అనుకుందామంటే భూమిలేని వారికి కూడా నగదు జమ అయింది .

విత్ డ్రా చేసి ఎంచక్కా వాడుకుంటూ పండగ చేసుకుంటున్న కొందరు
చాలా మంది ఖాతాదారులు బ్యాంకు ఖాతాలలో నగదు జమ అయిన ప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా విత్ డ్రా చేసి ఎంచక్కా వాడుకుంటూ పండగ చేసుకుంటున్నారు. అధికారులను ఈ డబ్బు పై ప్రశ్నించినా వారి వద్ద సమాధానం శూన్యం. తమకు తెలియదని అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం బ్యాంకు ఖాతా నెంబర్ తో ఆధార్ లింక్ చేసి ఉన్నందున తప్పుగా డబ్బులు పడే అవకాశం లేదని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఇక దీని పై ఆరా తీస్తున్నామని కూడా చెబుతున్నారు.

పొరబాటు జరిగిందా ? కావాలనే ఎవరైనా వేశారా
ప్రకాశం జిల్లా శివరాంపురం పురానికి చెందిన డబ్బులు పొరపాటున విజయనగరం జిల్లా శివరాంపురం వ్యక్తులకు జమ అయ్యాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కొందరు తమ బ్యాంకు ఖాతాలో జమ అయిన నగదును విత్ డ్రా చేసి మరీ సంక్రాంతి పండుగ రాకముందే పండుగ చేసుకుంటున్నారు. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వీరి బ్యాంకు ఖాతాలో పడింది అన్నదానిపై అధికార యంత్రాంగం దృష్టి సారించారు.
ఇది పొరబాటా.. లేక కావాలనే ఎవరైనా వేశారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.