ఎంఆర్ కాలేజీ: తండ్రి, తాతల పేరు చెడగొడతారా? సంచైతపై ఊర్మిళ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు
విజయనగరం: మాన్సాస్ ట్రస్ ఆధ్వర్యంలోని మహారాజ(ఎంఆర్) కళాశాలను ప్రైవేటు పరం చేయడంపై ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వ్యతిరేకతను వ్యక్తం చేయగా, తాజాగా, ఈ విషయంపై ఆనంద గజపతిరాజు మరో కుమార్తె పూసపాటి ఊర్మిళ కూడా స్పందించారు.

సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం ఏడాదిగా..
మంగళవారం పూసపాటి ఊర్మిళ మీడియాతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నానని, ఇప్పటికీ దొరకలేదని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన మహారాజా కళశాలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు ఊర్మిళ.

తాత, తండ్రి పేరును చెడగొట్టేలా...
తన తాత, తండ్రి పేరును చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుత ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజుపై ఆమె మండిపడ్డారు. ఎంఆర్ కళాశాలలో చదువుకున్నవారు దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని ఊర్మిళ తెలిపారు. ఇలాంటి విద్యాసంస్థను ప్రైవేటుపరం చేయడాన్ని తాము ఒప్పుకోమని తేల్చి చెప్పారు. ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని ఊర్మిళ ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

కాలేజీకి ఘన చరిత్ర.. వంశ చరిత్రనీ మంటగలిపే దిశగా..
సోషల్ మీడియా వేదికగానూ ఊర్మిళ స్పందించారు. ‘ఎంఆర్ డిగ్రీ కాలేజ్ 1879 లో నా పూర్వీకులైన మహారాజ విజయరామ గజపతి రాజు గారిచే విజయనగరంలో స్థాపించబడిన మొదటి కాలేజ్. ఈ కాలేజ్ చరిత్ర విజయనగరం చరిత్ర ఒకదానికొకటి ఎంతగానో అల్లుకుపోయాయి. అతి తక్కువ ఫీజు తో లేదా అస్సలు ఫీజు లేకుండా విద్యార్థులందరికీ చదువుకునే అవకాశం కల్పించింది ఈ కాలేజ్. అంతేకాక అందులో పనిచేసే వారికీ ఉద్యోగ భద్రత కల్పించడం అనేది మాన్సాస్ ట్రస్ట్ యొక్క ముఖ్యఉద్దేశం. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కాలేజీని ప్రైవేటు పరం చేయతలపెట్టిన మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుత చైర్ పర్సన్... ఆ చర్య ద్వారా మా తాతగారైన పీవీజీ రాజుగారు మా తండ్రిగారైన ఆనంద గజపతి రాజుగారి వారసత్వాన్నీ వంశ చరిత్రనీ మంటగలిపే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. మా వంశ చరిత్రనీ గౌరవాన్నీ వారసత్వాన్నీ పరిరక్షించడానికి అంటూనే ఆ చరిత్రని పాడుచేసే ఎన్నో చర్యలను ఆమె తలపెట్టడం ఎంతో బాధాకరం. నా తండ్రిగారు ఏ ఆశయం కోసం నిలబడ్డారో వాటికి ఈమె చర్యలు విరుద్ధంగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు' అని ఊర్మిళ వ్యాఖ్యానించారు.

కాలేజీని గాంధీ, నెహ్రూ, సర్వేపల్లి, సరోజినీ నాయుడు సందర్శించారు..
‘ఎంఆర్ కాలేజీలో చదివిన ఎంతో మంది మంచి పదవుల్లో ఉండి దేశానికీ పేరు తెచ్చారు.. తెస్తున్నారు. వారిలో రాజకీయవేత్తలు హైకోర్టు జడ్జిలు అధికారులు కవులుగా పేరుతెచ్చుకున్నారు. గాంధీజీ, నెహ్రూజీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ సరోజినీ నాయుడు వంటి ఎందరో గొప్పవారు ఈ కాలేజీని సందర్శించారు. విద్యపై అందరికీ సమాన హక్కువుంటుంది. ఆ హక్కుని కాలరాచి పేదవారికి చదువునిదూరం చేసే వీరి ఆలోచనని నేనూ నా తల్లిగారు ఖండిస్తున్నాము. విజయనగర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాము' అని ఊర్మిళ పేర్కొన్నారు. కాగా, మాన్సాస్ ట్రస్ ఛైర్ పర్సన్ సంచయిత ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయనగరంలో ప్రసిద్ధి చెందిన ఎంఆర్ కాలేజీ(మహారాజ కళాశాల) ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించారు. ఎయిడెడ్ నుంచి అన్ఎయిడెడకు మార్చాలంటూ మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ ఏపీ సర్కారుకు లేఖ రాశారు.