బండి సంజయ్ ఛలో జనగామ.. ఏరియా ఆస్పత్రి వద్దకు బీజేపీ శ్రేణులు .. భారీగా పోలీసులతో టెన్షన్
జనగామ బిజెపి పట్టణ అధ్యక్షులు పవన్ శర్మ పై, అలాగే బిజెపి కార్యకర్తలపై లాఠీఛార్జి చేసిన ఘటనకు నిరసనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చలో జనగామ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో జనగామ పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. లాఠీ ఛార్జ్ చేసిన సిఐ మల్లేష్ పై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డెడ్ లైన్ పెట్టిన బండి సంజయ్, చర్యలు తీసుకోకుంటే డిజిపి కార్యాలయాన్ని సైతం ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
కేసీఆర్ తోపుగాడు ఏం కాదు, బడా చోర్ సీఎం .. భద్రకాళీ ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా ? బండి సంజయ్ సవాల్

ఫ్లెక్సీలు తొలగింపు రగడ .. బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్
ఇక ఈ రోజు ఛలో జనగామ కార్యక్రమం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జనగామలో పోలీసులు అలర్ట్ అయ్యారు. బిజెపి నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో చోటుచేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. తమ ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని కమిషనర్ చాంబర్ ముందు ధర్నా చేస్తున్న బిజెపి నేతలపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

లాఠీ చార్జ్ లో గాయపడిన వారిని పరామర్శించేందుకు బండి సంజయ్ పర్యటన
పోలీసుల తీరుపై పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కొనసాగింది .ఆ తర్వాత అనేక పరిణామాల మధ్య కమీషనర్ క్షమాపణ చెప్పి ఫిర్యాదును ఉపసంహరించుకున్నా ఈ ఘటనపై బిజెపి నాయకులు ఫైర్ అవుతున్నారు. ఘటనపై ఘాటుగా స్పందించిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు . పోలీసుల లాఠీ చార్జ్ లో గాయపడిన వారిని పరామర్శించటానికి ఈ రోజు చలో జనగామ కార్యక్రమాన్ని చేపట్టడంతో టెన్షన్ మరింత పెరిగింది.

జనగామ ఏరియా ఆస్పత్రి వద్ద భారీగా బీజేపీ నేతలు , పోలీసు బలగాలు
ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి చలో జనగామ కార్యక్రమంలో పాల్గొనడం కోసం పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు జనగామ కు చేరుకుంటున్నాయి. జనగామ ఏరియా ఆస్పత్రిలో బీజేపీ కార్యకర్తలు చికిత్స పొందుతున్నారు. వారిని బండి సంజయ్ పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వటానికి వస్తున్న నేపధ్యంలో ఏరియా హాస్పిటల్ దగ్గర భారీగా బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. దాంతో ఏరియా హాస్పిటల్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఛలో జనగామలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్
ఎలాంటి గందరగోళం చోటు చేసుకోకుండా శాంతిభద్రతలను పరిరక్షించటం కోసం భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. బండి సంజయ్ జనగామ పర్యటన నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
బీజేపీ శ్రేణులు మాత్రం బండి సంజయ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా టీఆర్ఎస్ పార్టీని ప్రజా క్షేత్రంలో ఎండగట్టే పనిలో ఉన్నారు బండి సంజయ్ . ఈ రోజు జనగామలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ వ్యక్తం అవుతుంది .