బండి సంజయ్ వ్యూహం, భారీగా చేరికలతో మారుతున్న గ్రేటర్ వరంగల్ రాజకీయం .. టీఆర్ఎస్ లో భయం
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు చుక్కలు చూపించిన బిజెపి ఇప్పుడు గ్రేటర్ వరంగల్ లో టార్గెట్ చేస్తోంది. అందులో భాగంగా బండి సంజయ్ భారీ వ్యూహంతో గ్రేటర్ వరంగల్ లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు.
టీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ తర్వాత, అతి ముఖ్యమైన కార్పొరేషన్లలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. మరో మూడు నెలల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి వ్యూహాలతో ముందుకు వెళుతుంది.

గ్రేటర్ వరంగల్ పరిధిలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి
ఇప్పటికే భారతీయ జనతాపార్టీ గ్రేటర్ వరంగల్ పరిధిలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించగా, రేపు బండి సంజయ్ పర్యటన గ్రేటర్ వరంగల్ రాజకీయాలలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్ట బోతోంది.
తెలంగాణ రాష్ట్ర రథసారధిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గ్రేటర్ వరంగల్లో పర్యటించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన తర్వాత గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లో పై దృష్టిసారించిన బండి సంజయ్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.

రేపు బండి సంజయ్ పర్యటన .. టీఆర్ఎస్ లో కీలకంగా పని చేసిన నాయకుల బీజేపీ బాట
బండి సంజయ్ పర్యటన సందర్భంగా భారీగా స్వాగత ర్యాలీలు నిర్వహించి, విష్ణు ప్రియ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమంలో భారీ ఎత్తున బిజెపిలో చేరికలకు కూడా శ్రీకారం చుట్టారు. ఇటీవల వివిధ పార్టీల నుండి చాలామంది కీలక నాయకులు బిజెపి వైపు దృష్టి పెడుతున్న నేపథ్యంలో రేపటి చేరికలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు వెన్నుదన్నుగా నిలిచిన 37 వ డివిజన్ కార్పొరేటర్ కోరబోయిన సాంబయ్య టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు . టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు తగిన స్థానం లేదని అసహనం వ్యక్తం చేశారు . గత గ్రేటర్ ఎన్నికల సమయంలో మేయర్ ఆశావహుల జాబితాలో కోరబోయిన సాంబయ్య ఉన్నారు.

కాంగ్రెస్ నుండి కూడా .. మాజీ మేయర్ నరేందర్ కు గత గ్రేటర్ ఎన్నికల్లో టెన్షన్ పెట్టిన గంటా రవి చేరిక
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న, గత గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో మాజీ నగర మేయర్ నన్నపనేని నరేందర్ తో ఇండిపెండెంట్ గా తలపడిన గంటా రవికుమార్ అప్పుడే టీఆర్ఎస్ నాయకులకు వెన్నులో వణుకు పుట్టించారు .ఏకంగా మంత్రులే రంగంలోకి దిగి నరేందర్ గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది . ఆ తర్వాత గంటా రవి కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గ్రేటర్ వరంగల్ లో కీలకంగా ఉన్న పలువురు నేతలు, పార్టీలో ప్రాధాన్యత లేక సహనంతో ఉన్నవారు రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో తమ సత్తా చాటడం కోసం పార్టీలను ఎంచుకొనే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఇప్పుడు అందరి దృష్టి బిజెపి పైనే పడింది.

గ్రేటర్ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి పెట్టిన బీజేపీ .. బండి సంజయ్ పర్యటనతో టీఆర్ఎస్ కు టెన్షన్
ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్న బీజేపీ నేతలు, గ్రేటర్ వరంగల్ పరిధిలోని అనేక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఆందోళనలతో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఒకపక్క బండి సంజయ్ వ్యూహాలతో గ్రేటర్ వరంగల్ లో కూడా టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి సమాయత్తమవుతున్నారు. ఏది ఏమైనా గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేస్తున్న అడుగులు ఇప్పటి నుండే టీఆర్ఎస్ శ్రేణులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి.