కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటనతో పార్టీలో జోష్ .. గ్రేటర్ వరంగల్ ఎన్నికలే లక్ష్యంగా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణులలో జోష్ నింపింది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జోరు పెంచిన బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించింది. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల పై దృష్టిసారించిన బిజెపి అధినాయకత్వం కీలక నేతల పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది.
తెలంగాణా బీజేపీకి కలిసొచ్చిన 2020: బండి సంజయ్ సారధ్యంలో బలమైన రాజకీయ పార్టీగా ముద్ర

కేంద్ర నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి
ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించారు . కేంద్ర నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బిజెపి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు, గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు సమాయత్తం చేయడానికి దిశానిర్దేశం చేశారు. కిషన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బిజెపి జిల్లా నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, జీహెచ్ఎంసి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

భద్రకాళి అమ్మవారి దర్శనం .. ఆపై సీఎం కేసీఆర్ పై ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం పై కెసిఆర్ నిరంకుశ విధానాలతో ప్రజలు విసిగిపోయారని మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో వరంగల్ వాసులు కూడా ఇస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పిన కిషన్ రెడ్డి వ్యవసాయ చట్టాలను పంజాబ్ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతులు వ్యతిరేకించడం లేదని, కొన్ని రాజకీయ పార్టీలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.

వరంగల్ కు కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిని ఇచ్చింది కేంద్రం : కిషన్ రెడ్డి
పర్యటనలో భాగంగా కాకతీయ మెడికల్ కళాశాలలో పి ఎం ఎస్ ఎస్ వై కింద 150 కోట్ల తో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి వరంగల్ కు కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిని కేంద్రం ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో నే ఆసుపత్రి ప్రారంభం కాలేదని తెలిపారు. ఆసుపత్రిని ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆక్షేపించారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

స్మార్ట్ సిటీ, హృదయ్ పథకాలపై అధికారులతో రివ్యూ.. పార్టీ నేతలతో సమావేశం
ఆ తర్వాత రైల్వే అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. స్మార్ట్ సిటీ, హృదయ్ పథకాలపై అధికారులతో రివ్యూ చేశారు.
గ్రేటర్ వరంగల్లో కాషాయ జెండా రెపరెపలాడాలి అని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న కిషన్ రెడ్డి ఈ రోజు పర్యటనలో భాగంగా టీవిఆర్ గార్డెన్ లో నిర్వహిస్తున్న పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు హాజరై భవిష్యత్తులో జరగనున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఉత్సాహాన్ని కనబర్చారు. ప్రస్తుతం టీవీ ఆర్ గార్డెన్ లో పార్టీ శ్రేణులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. కిషన్ రెడ్డి పర్యటన ఆద్యంతం పార్టీ శ్రేణుల హడావిడితో ఆసక్తికరంగా సాగుతోంది .