భావి ప్రధాని రాహుల్.. ఏడేళ్లలో ఇబ్బందులు, ఉత్తమ్, దామోదర్ రెడ్డి ఫైర్
ఆశేష జనవాహినితో రైతు సంఘర్షణ సభ పోటెత్తింది. తొలుత నేతలు మాట్లాడారు. కాసేపటి క్రితం రాహుల్ గాంధీ స్టేజీ మీద.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో మాట్లాడారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనను ఏకీపారేశారు.
భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని నేతలు అన్నారు. రైతు సంఘర్షణ సభ ద్వారా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పింది.. ఏడేళ్ళలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని వివరించారు. దేశంలో రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని చెప్పారు.

క్రాప్ ఇన్స్యూరెన్ లేని రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పార్లమెంట్లో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేది వరంగల్ సభే అన్నారు. ఎనిమిదేళ్ళలో ముస్లిం సోదరులను మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. 2023లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి ఘోరీ కడతామన్నారు.
భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంభోదించారు. వచ్చే ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. దేశంలో ప్రగతి పథంలో నడిపించింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఉచిత కరెంట్ అందించామని గుర్తుచేశారు. సబ్సిడీ ఇవ్వకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తుచేశారు.పంట అమ్ముకోలేక పోతున్నారని గుర్తుచేశారు. 1960 రూపాయల ఎంఎస్ పీ ధర వుంటే 1300, 1400 వందలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.