వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లా .. మహాశివరాత్రి వేడుకలతో సర్వం శివోహం

|
Google Oneindia TeluguNews

మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శైవం పరిఢవిల్లింది. కాకతీయ రాజులు ముఖ్యంగా శివారాధకులు . ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రాల నిర్మాణం జరిగింది. కాకతీయ రాజులు ఏక, ద్వి, త్రికూట మరియు పంచకూట ఆలయాలను నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక వేయి స్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, కటాక్షాపూర్ లోని శివాలయం, ఓరుగల్లు కోటలోని కాశీ విశ్వేశ్వరాలయం తో పాటుగా, అయినవోలు, కురవి వంటి శైవక్షేత్రాలలోనూ ఓంకార నాదం ప్రతిధ్వనిస్తోంది. హర హర మహాదేవ శంభో అంటూ భక్తజనం ఆ పరమశివుని కరుణాకటాక్ష వీక్షణాల కోసం శైవ క్షేత్రాల్లో బారులుతీరారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన అభిషేకాలను చేస్తూ భక్తజనం మహాశివరాత్రి వేడుకలు జరుపుకుంటోంది.

వెయ్యి స్తంభాల రుద్రేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు

వెయ్యి స్తంభాల రుద్రేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు

హన్మకొండలోని రుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాలగుడి చార్రిత్రకంగా సుప్రసిద్ధమైంది. చారిత్రక వేయిస్తంభాల దేవాలయం లో రుద్రేశ్వర స్వామి కి తెల్లవారుజాము నుండే మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేస్తున్నారు. భక్తజనంతో వేయిస్తంభాల దేవాలయం పోటెత్తుతోంది. కాకతీయ మహారాజు రుద్రదేవమహారాజు క్రీ.శ 1084లో దీనిని నిర్మించాడు. ఇది నిజానికి త్రికూటలాయం. ఒకే వేదిక మీద మూడు దిక్కుల మూడు ఆలయాలను నిర్మించారు. అవి శ్రీ రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవాలయాలు. ప్రస్తుతం రుద్రేశ్వరస్వామి గా పూజలందుకుంటున్న ఆ పరమ శివుని దర్శనానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.భక్తుల శివరాత్రి జాగారాలతో దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.

రామప్ప దేవాలయంగా ఘనంగా శివరాత్రి

రామప్ప దేవాలయంగా ఘనంగా శివరాత్రి

ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయంలో సైతం మహాశివరాత్రి పర్వదినాన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామలింగేశ్వరస్వామి కి ఈరోజు తెల్లవారుజాము నుండే పూజాదికాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం రామప్ప అనే శిల్పి నిర్మాణం చేయడం వల్ల రామప్ప దేవాలయం గా ప్రసిద్ధి గాంచింది. మహా శివరాత్రి వేడుకల తో పాటు జాగరణ చేసే భక్తుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ మహాశివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేశారు అధికారులు.

కాకతీయులు నిర్మించిన అతి పురాతాహన శైవ క్షేత్రాలు

కాకతీయులు నిర్మించిన అతి పురాతాహన శైవ క్షేత్రాలు

హన్మకొండకు 27కిలోమీటర్ల దూరంలోని కటాక్షపురంలో శివకేశవాలయాలున్నాయి. ఇవి రెండు త్రికూటాలయాలు. కాకతీయ సామంతులు వీటిని నిర్మించినట్టు చెబుతారు. విశాలమైన స్థలంలో 7 అడుగుల ఎత్తున వేదికపై వీటిని నిర్మించారు. లోపల నృత్యమండపం, మూడు వైపుల మూడు ఆలయాలు ఉన్నాయి. చేర్యాల మండల కేంద్రంలోని ఆకునూరు గ్రామంలో శివాలయం ఉంది. ఇది కూడా కాకతీయుల కాలంలో నిర్మితమైందే. కాకతి రుద్రదేవుడు ఈ ఆలయాన్ని దర్శించి కొన్ని దానాలు చేసినట్టు రాష్ట్ర కూటుల నాటి శాసనంలో ఉంది.ఆత్మకూరు గ్రామంలో పంచకూట ఆలయం ఉంది. ఈ ఆలయం. క్రీశ.1250నాటి కంఠాత్మకూరు శాసనంలో దీనిని భీమదేవర ఆలయంగా పేర్కొన్నారు. ‘యు' ఆకారంలో ఉన్న ఈ ఆలయం మధ్యలో ఉన్న ప్రధాన శివాలయానికి కుడి దిక్కున రెండు, ఎడమ దిక్కున రెండు శివలింగాలున్న గర్భాలయాలున్నాయి. విశేమేమిటంటే ఇందులోని శివలింగాలన్నీ ఏ మాత్రం తేడా లేకుండా ఒకే విధంగా ఉన్నాయి. ఇందులో ప్రధాన ఆలయంలో ఉండాల్సిన శివలింగం ప్రస్తుతం లేదు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి జాతర

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి జాతర

వరంగల్‌ కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం కూడా కాకతీయు కాలం నాటిదే. కాకతీయులలో చివరి వాడైన ప్రతాపరుద్ర చక్రవర్తి దీనిని నిర్మించాడు.కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయం,బచ్చన్నపేట మండలం కొడవటూరులోని సిద్ధేశ్వరాలయం, చేర్యాల మండలంలోని కొమురవెల్ళి మల్లికార్జున స్వామి ఆలయం, ఐనవోలు మల్లికార్జున స్వామీ దేవాలయం ,పాలకుర్తిలోని సోమేశ్వరాలయం, మెట్టుగుట్టపై ఉన్న రామలింగేశ్వరాలయాలే కాదు ఇలా ఒకటి కాదు రెండు కాదు లెక్కకు మిక్కిలి శైవ క్షేత్రాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఈ శైవ క్షేత్రాలలో ను శివరాత్రి పర్వదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అందుకే ఓరుగల్లు ఖిల్లా శైవ క్షేత్రాల జిల్లాగా ప్రసిద్ధి పొందింది. హరహర మహాదేవ శంభో అంటూ ఏక కంఠంతో నినదిస్తోంది.

English summary
During the Maha Shivaratri, all the historical siva temples became rush with devotees. The 'SHAIVAM' grew up in Oragallu because of the Kakatiya kings. As the Kakatiya kings became particularly Shiva devotees and the construction of famous Shiva temples was done during the Kakatiya period throughout the Warangal district. During the Maha Shivaratri, pilgrims throughout the district are worshiping the Shiva in temples.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X