ఓరుగల్లులో కదం తొక్కిన తెలంగాణా కాషాయ దళపతి బండి సంజయ్ .. భారీ ర్యాలీ తో పాటు కీలకనేతల చేరికలు
తెలంగాణ కాషాయ దళపతి బండి సంజయ్ పర్యటన ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లాలో కొనసాగింది. అడుగడుగునా పోలీసులు బండి సంజయ్ పర్యటనకు అడ్డుతగిలినప్పటికీ, రెట్టించిన ఉత్సాహంతో వరంగల్ అర్బన్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ముందే, భారీ ఎన్నికల ర్యాలీలా, అధికార టీఆర్ఎస్ కు గుండెల్లో గుబులు పుట్టించేలా బండి సంజయ్ పర్యటన కొనసాగింది.
పవన్ కరివేపాకు , బండి సంజయ్ లో లెవల్ .. చంద్రబాబువి పగటి కలలు : కేఏ పాల్ సంచలనం
వరంగల్ అర్బన్ జిల్లాలో బండి సంజయ్ పర్యటన
దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన తర్వాత మొట్టమొదటిసారిగా వరంగల్ అర్బన్ జిల్లాకి వచ్చిన బండి సంజయ్ కు వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కాజీపేట కడిపికొండ బ్రిడ్జి వద్ద ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాకు సంబంధించిన నాయకులు మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఈరోజు వరంగల్ జిల్లాలో జరిగిన భారీ ర్యాలీ లో పాల్గొన్నారు. వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు .

వరంగల్ ట్రై సిటీస్ లో కొనసాగిన రోడ్ షో ,.. అడ్డుకునే యత్నం చేసిన పోలీసులు
కాజీపేట నుండి హనుమకొండ మీదుగా వరంగల్ వరకు బండి సంజయ్ రోడ్ షో కొనసాగింది.
బండి సంజయ్ రోడ్ షో ను అడ్డుకోవడం కోసం పోలీసులు ప్రయత్నం చేసినట్లుగా బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమరవీరుల స్తూపం వద్ద రోడ్ షోలో పాల్గొంటున్న వాహనాలను దారి మళ్లించారు పోలీసులు. దీంతో బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ తర్వాత ములుగు రోడ్డు మీదుగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బండి సంజయ్ భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ కూడా సాయిబాబా ఆలయంలోకి వెళ్లకూడదని హైడ్రామా కొనసాగింది . అయినప్పటికీ ఆయన సాయిబాబా దర్శనం చేసుకుని వచ్చారు .

ఓరుగల్లులో ఎన్నికలకు ముందు పార్టీలో కీలక నేతల చేరికలు
వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రెట్టించిన ఉత్సాహంతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలతో నగరమంతా కాషాయ జెండాలతో అప్పుడే ఎన్నికలా అన్న అభిప్రాయం కలిగేలా ర్యాలీ కొనసాగింది.
అనంతరం విష్ణు ప్రియ గార్డెన్లో బిజెపి పార్టీ శ్రేణులతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో టిఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ 37 వ డివిజన్ కు చెందిన కోర బోయిన సాంబయ్య, గంట రవి కుమార్, గైనేని రాజన్ లు కాషాయ కండువా కప్పుకున్నారు.
గ్రేటర్ వరంగల్ లో టీఆర్ఎస్ శ్రేణులకు టెన్షన్ పుట్టించేలా కమల వికాసం
వీరితో పాటు వందలాదిగా కార్యకర్తలు బీజేపీలో చేరారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ జిల్లాలోని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అందులో భాగంగానే బిజెపిలోకి చేరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వచ్చే గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ కి చెమటలు పట్టించడానికి ఇప్పటినుండే శ్రీకారం చుట్టినట్లు గా ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లాలో బండి సంజయ్ పర్యటన ద్వారా అర్థమవుతుంది.
ఓరుగల్లులో కదం తొక్కిన తెలంగాణా కాషాయ దళపతి బండి సంజయ్ .. భారీ ర్యాలీ తో పాటు కీలకనేతల చేరికలు#Bandisanjay #Warangal pic.twitter.com/YTtwQYaTp1
— oneindiatelugu (@oneindiatelugu) January 5, 2021