టీడీపీ నేతల్లో వాట్సాప్ గుబులు ... అసలు ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టిడిపి నేతలకు వాట్సాప్ భయం పట్టుకుందా? ముఖ్యంగా టిడిపి నేతల వాట్సాప్ ఖాతాలనే వాట్సాప్ కంపెనీ ఎందుకు తొలగిస్తుంది? నిబంధనలు ఉల్లంఘించారంటూ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇప్పటికి ముగ్గురి అకౌంట్స్ ను వాట్సాప్ కంపెనీ ఎందుకు తొలగించింది ? సోషల్ నెట్వర్కింగ్ లో వాట్సాప్ మెసెంజర్ అత్యంత కీలకంగా మారిన నేటి రోజుల్లో ఏపీలోని ఎంపీలు, ముఖ్య నేతల అకౌంట్లు తొలగించడం వెనుక రహస్యం ఏమైనా ఉందా? అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

వాట్సాప్ ఖాతాల తొలగింపుతో టీడీపీ నేతల్లో టెన్షన్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు ఊహించని విధంగా ఏపీ టీడీపీ నేతల వాట్సాప్ ఖాతాలు తొలగించబడుతున్నాయి. మన జీవితంలో ప్రస్తుత తరుణంలో కీలక భూమిక పోషిస్తున్న వాట్సాప్ మెసెంజర్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేతల వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేస్తుంది. దీంతో టిడిపి నేతల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. అసలు తమ ఖాతాలు ఎందుకు తొలగిస్తున్నారో అర్థం కాక నేతల్లో గుబులు మొదలైంది టిడిపి నేతలను టార్గెట్ గా చేసుకుని వాట్సాప్ కంపెనీకి ఫిర్యాదు చేసింది ఎవరు? ఇంతకీ తమపై ఏమని ఫిర్యాదు చేశారు? నిబంధనలు ఉల్లంఘించామని చెప్పడానికి వాట్సాప్ యాజమాన్యం దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే అవి ఎలాంటి ఆధారాలు... అందులో వ్యక్తిగత గోప్యత అంశాలు ఉన్నాయా? లేక పార్టీ పరమైనటువంటి అంశాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలు మదిలో మెదులుతుంటే టిడిపి నేతలు టెన్షన్ పడుతున్నారు. వాట్సాప్ లో సైతం పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాలు చర్చించకూడదని నిర్ణయించుకున్నారు టిడిపి నేతలు. తమ వాట్సాప్ ఖాతాలు సైతం బ్లాక్ చేస్తారేమోనని భయపడుతున్నారు.

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ ఖాతా తొలగింపు.. నిబంధనల ఉల్లంఘన కారణం
వాట్సప్ ఖాతా తొలగింపు విషయంలో తొలి బాధితుడు టిడిపి ఎంపీ సీఎం రమేష్. టీడీపీ నేత రాజ్యసభ సభ్యుడు అయిన సీఎం రమేష్ కు వాట్సాప్ ఖాతాను నిలిపివేస్తూ ఆ సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా బిజీగా ఉండే ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ ను ఎక్కువగా వినియోగించే వారు. అయితే నిబంధనలు ఉల్లంఘించారంటూ, వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారంటూ సీరియస్ నిర్ణయాన్ని తీసుకున్న వాట్సప్ సంస్థ సీఎం రమేష్ వాట్సాప్ ఖాతా పై వేటు వేసింది. కొద్దిరోజులుగా సీఎం రమేష్ వాట్సాప్ ఖాతా పనిచేయడం లేదు. ఈ వ్యవహారాన్ని కేంద్రం కుట్ర గా భావించిన సీఎం రమేష్ దీనిపై ఆయన వివరణ కోరుతూ వాట్సాప్ సంస్థకు లేఖ రాశారు. అందుకు బదులుగా ఆ సంస్థ నిబంధనలు ఉల్లంఘించారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు అందాయని వాట్సాప్ సంస్థ పేర్కొంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీ టిడిపి వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

ఆ ఇద్దరు టీడీపీ నేతల వాట్సాప్ బ్లాక్ ... ఎందుకంటే
తాజాగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ కుమార్ రెడ్డి వాట్సాప్ అకౌంట్ కూడా తొలగించబడింది. గత ఐదు రోజులుగా పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వాట్సాప్ పని చేయకుండా నిలిపివేశారని చెప్తున్నారు. వీళ్లిద్దరే కాదు రాజకీయ నేతల్లో మూడో వ్యక్తి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వాట్సాప్‌ను బ్లాక్ చేసింది వాట్సాప్ సంస్థ. కేవలం టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ అకౌంట్లను తొలగించే కుట్ర చేస్తుందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. నిన్నటి వరకు వాట్సాప్ లో వ్యక్తిగత సమాచారం సీక్రెట్ గా ఉంటుందని భావించిన టీడీపీ నేతలు వాట్సాప్ నిఘానేత్రం తమ ఖాతాలపై ఉంటుందని తెలిసిన తర్వాత ఎప్పుడు ఎవరి వాట్సాప్ తొలగింపుకు గురవుతుందో అని టెన్షన్ పడుతున్నారు.
కేవలం టీడీపీ ముఖ్య నాయకుల ఖాతాలే బ్లాక్ చేస్తుండటంతో కేంద్రం కుట్రగా భావిస్తున్నారు.

వాట్సాప్ ఖాతా తొలగింపు ఆషామాషీ అంశం కాదంటున్న నిపుణులు
మానవ జీవనంలో వాట్సాప్ అనేది నిత్యావసర మాధ్యమంగా మారింది. ప్రతి ఒక్కరు వాట్సాప్ ను రకరకాలుగా వినియోగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దుర్వినియోగం అవుతున్నా వాట్సాప్ ఖాతాలపై ఏ మాత్రం నియంత్రణ లేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. అలాంటి చోట రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఒక కీలకమైన రాజకీయ నాయకుడి వాట్సాప్ నిలిపి వేయాలంటే ఆషామాషీ విషయం కాదు. సీఎం రమేష్ ఒక్కరిదే కాదు మరికొందరి కీలక నేతలు వాట్సాప్ ఖాతాలు కూడా వరుసగా తొలగించబడుతుంది. అయితే దీని వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయని, బలమైన ఆధారాలు సంస్థ ప్రతినిధులు వద్ద నమోదై ఉంటాయని, లేకుంటే వాట్సాప్ మెసెంజర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సంస్థ ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని సాంకేతిక నిపుణుల అభిప్రాయం.
మరి అంతగా వాట్సాప్ లో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారో అన్నది తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆసక్తి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!