అమరావతే ఏపీ రాజధాని: అజయ్ భల్లాతో రఘురామ కృష్ణరాజు భేటీ, వైసీపీకి సవాల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని 'అమరావతి'యేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఓ వైపు మూడు రాజధానులపై ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఈ ఎంపీ ఈ విధంగా వ్యాఖ్యానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లాతో భేటీ..
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అంశంపై చర్చించారు. ఆ తర్వాత మీడియాతో రఘురామ కృష్ణరాజు మాట్లాడారు. పరిపాలన ఎక్కడ ఉంటే దాన్నే రాజధాని అంటారని అన్నారు. హైకోర్టు ఉంటే న్యాయ రాజధాని అని, శాసనసభ ఉంటే శాసనరాజధాని అనరని వ్యాఖ్యానించారు.

అమరావతే రాజధాని..
ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనని, దీనిపై తనకు పూర్తి నమ్మకం ఉందని రఘురామ అన్నారు. రాజధానిని తరలించడమే లక్ష్యంగా పాలనా వికేంద్రీకరణ అనే పేరు తీసుకొచ్చారని విమర్శించారు. అమరావతి రైతుల ఆందోళన, వారికి ఇచ్చిన హామీలు, వారి త్యాగాలను పరిగణలోకి తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శిని కోరారు. కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్లో అవేవీ పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు.

ఆ నమ్మకం ఉందంటూ రఘురామ
అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ న్యాయ సలహాతో అఫిడవిట్లు వేయాలని హోంశాఖ కార్యదర్శికి చెప్పినట్లు తెలిపారు. అజయ్ భల్లా సానుకూలంగా స్పందించారని, అన్ని అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అమరావతి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. ఈ భేటీతో తనకు అమరావతే ఏకైక రాజధాని అన్న నమ్మకం పెరిగిందన్నారు.

వైసీపీకి రఘురామ కృష్ణరాజు సవాల్
వైసీపీ సమీక్ష సమావేశంపై ఎంపీ రఘురామ స్పందిస్తూ.. తనను పిలిచినట్లే పిలిచి, అంతలోనే వద్దని చెప్పారని తెలిపారు. ఈ చర్యతో తనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లే భావిస్తున్నానని చెప్పారు. అయితే, రాజీనామా చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని చెప్పి మాట తప్పిన వారే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక, తనకు విప్ కూడా జారీ చేసే అవకాశముందన్నారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి.. ఇప్పుడు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. మాట తప్పినవారే రాజీనీమా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ నేతలకు రఘురామ సవాల్ విసిరారు. ఇది ఇలావుండగా, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ప్రధానికి ఆ ప్రాంత రైతులు లేఖ రారు.