రఘురామరాజు ఆస్తులపై సీబీఐ దాడులు-పీఎన్బీ స్కాంలో రూ.826 కోట్ల ఎగవేతపై...
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆస్తులపై ఇవాళ సీబీఐ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియానికి రూ.826 కోట్ల రుణాల ఎగవేత వ్యవహారంలో సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఢిల్లీ, హైదరాబాద్కు చెందిన సీబీఐ బృందాలు ఈ దాడుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎంపీలు ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరిన నేపథ్యంలో సీబీఐ దాడుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
మాన్సాస్ ఛైర్మన్గా మళ్లీ అశోక్ ? దోపిడీ కోసమే సంచైత- రఘురామరాజు సంచలనం..

రుణాల ఎగవేతలో రఘురామ...
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇండ్-భారత్ ధర్మల్ పవర్ కంపెనీ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి గతంలో రూ.826 కోట్ల మేర రుణాలు పొందింది. ఈ రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో ఇండ్-భారత్ సంస్ధతో పాటు డైరెక్టర్లుగా ఉన్న రఘురామకృష్ణంరాజు, ఆయన సతీమణి రమాదేవి, కుమార్తె కోటగిరి ఇందిరా ప్రియదర్శిని, బొప్పన సౌజన్య, వడ్లమాని సత్యనారాయణరావు, విస్రాప్రగడ పేర్రాజు, గోపాలన్ మనోహరన్, కె.సీతారామ, భాగవతుల ప్రసాద్, నంబూరి కుమారస్వామిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. నిందితులు కర్నాటకలో పవర్ ప్లాంట్ పెడతామని రుణం తీసుకుని ఆ తర్వాత దాన్ని తమిళనాడులోని ట్యుటికోరిన్కు మార్చినట్లు సీబీఐ గుర్తించింది.

రఘురామ, ఇతరుల ఇళ్లపై సీబీఐ దాడులు..
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియంలో స్టేట్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుతో పాటు పీఎన్బీ కూడా ఉన్నాయి. ఊ కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘురామరాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇతర డైరెక్టర్లపై సీబీఐ తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో మోసం, నిధుల దుర్వినియోగంతో పాటు ఇతర సెక్షన్ల కింద సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ముంబై, సికింద్రాబాద్లోని రఘురామరాజుతో పాటు ఇతర నిందితుల నివాసాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చిన బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి.

మరో భారీ ఎగవేతపైనా సీబీఐ దృష్టి...
రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలోని భారత్ పవర్ లిమిటెడ్ సంస్ధ తరఫున తీసుకున్న రూ.2226 కోట్ల రుణంలో రూ.926 కోట్లు ఎగవేసిన వ్యవహారంపైనా సీబీఐ గతేడాది ఏప్రిల్లో దాడులు చేసింది. ఈ వ్యవహారంపైనా సీబీఐ దర్యాప్తు వివిధ దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులోనూ రఘురామరాజు పాత్ర నిరూపితమైతే ఆయనకు కష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పటికే సొంత పార్టీ వైసీపీతో విభేదిస్తూ బీజేపీకి దగ్గరయ్యేందుకు రఘురామరాజు చేస్తున్న ప్రయత్నాల వెనుక ఈ మోసాల చిట్టా ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ పంచన చేరడం ద్వారా ఆయా కేసుల నుంచి ఊరట పొందాలని రఘురామరాజు ప్రయత్నిస్తున్నారు. గతేడాది తొలిసారి ఎంపీగా గెలిచిన రఘురామరాజు.. ఇప్పుడు తన పరపతిని వాడుకుంటూ బీజేపీకి చేరువకావాలని ప్రయత్నిస్తున్నా భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ ఆయన్ను చేరదీసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

దాడులు జరగలేదన్న రఘురామ..
రూ.826 కోట్ల రుణాల ఎగవేత వ్యవహారంలో సీబీఐ బృందాలు హైదరాబాద్, ముంబైలోని ఇండ్-భారత్ సంస్ద డైరెక్టర్ల నివాసాలపై దాడులు జరుపుతున్నా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ మాత్రం ఈ వార్తల్ని తోసిపుచ్చారు. తన ఇళ్లపై దాడుల వ్యవహారం టీవీల్లో మాత్రమే చూశానని, అలాంటి దాడులేవీ జరగడం లేదని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో ఈ దాడులు జరుగుతున్న విషయం రఘురామకు ఎందుకు తెలియదనే మరో చర్చ కూడా సాగుతోంది. సీబీఐ బృందాలు గుట్టుగా దాడులు చేస్తున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.