దారుణం.. దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారు... షాకింగ్ వీడియో..
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పందెం కోళ్లు దొంగిలించారన్న ఆరోపణలతో ఇద్దరు దళిత యువకులను కొంతమంది స్థానికులు చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా చితకబాదారు. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని టి.నరసాపురం మండలం జగ్గవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ ఆ యువకులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలి కాలంలో ఏపీలో దళితులపై వరుస దాడులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
అసలేం జరిగింది..
బాధితుల కథనం ప్రకారం... బంధంచర్ల గ్రామానికి చెందిన నలుగురు దళిత యువకులు ఈ నెల 18న సింగగూడెంలోని తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో గోర్తుపాడులోని ఓ షాపు వద్ద వాహనంలో పెట్రోల్ పోయించడం కోసం ఆగారు. ఇంతలో ఆ షాపులో ఉన్న మహిళ.. పెట్రోల్ దొంగతనానికి వచ్చారని వారిపై ఆరోపణలు చేసింది. గ్రామంలో కోడి పుంజులను కూడా వీరే ఎత్తుకెళ్తున్నారని ఆరోపించింది. దీంతో స్థానికులు అక్కడ గుమిగూడి వారిపై దాడి చేసేందుకు యత్నించగా ఇద్దరు యువకులు పారిపోయారు.

చెట్టుకు కట్టేసి కొట్టారు...
మిగతా ఇద్దరు యువకులను స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. కోళ్లను దొంగిలించింది తామేనని ఒప్పుకోవాలంటూ తమపై దాడికి పాల్పడ్డారని బాధితుల్లో ఒకరైన సంతోష్ అనే యువకుడు బీబీసీతో చెప్పాడు. దాడికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో తమ దృష్టికి వచ్చిందని చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. దాడిలో గాయపడ్డ యువకులు ప్రవీణ్,సంతోష్‌లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...
ఏటా సంక్రాంతి సీజన్లో ఉభయ గోదావరి జిల్లాలో కోళ్ల పందేలు సర్వ సాధారణం. ఇలా కోడి పందేల కోసం శిక్షణ ఇచ్చి సిద్దం చేసిన కోడి పుంజులను ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని గోర్తుపాడు వాసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామం మీదుగా వెళ్తున్న ఆ దళిత యువకులపై అనుమానంతో... వారే కోళ్లను దొంగిలించారని ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి.పందెం కోళ్ల దొంగతనం నెపంతో దళిత యువకులపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఏ ఆధారాలు,సాక్షాలు లేకుండా కేవలం అనుమానంతో వారిపై దాడి చేయడం అమానవీయమన్నారు.