Eluru: గుండె తరుక్కుపోతోంది: హెల్త్ ఎమర్జెన్సీ: ఆ డాక్టర్ బెస్ట్: జగన్‌కు రఘురామ లేఖ
ఏలూరు: అంతుచిక్కని వ్యాధి బారిన పడిన ఏలూరు విలవిల్లాడుతోంది. గంటగంటకూ దాని బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. మొదట్లో 25గా నమోదైన ఈ సంఖ్య ప్రస్తుతం 400లకు చేరుకుందంటే ఆ మిస్టీరియస్ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకరిని పొట్టనబెట్టుకుంది. పలువురి ఆరోగ్యం విషమించింది. వారంతా విజయవాడ సహా వేర్వేరు నగరాల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు డిశ్చార్జి అయ్యారు. ఈ వ్యాధి బారిన పడి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోన్న వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.

ఏలూరు ఘటన కలిచి వేస్తోంది..
ఈ ఘటన పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గ జిల్లా కేంద్రం ఈ దుస్థితిలో కొట్టుమిట్టాడటాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కలిచి వేస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. అంతుచిక్కని వ్యాధి గురించి ఆరా తీయడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో డాక్టర్లను రప్పించాలని, డిటాక్స్ మెడిసిన్‌ను తెప్పించాలని అన్నారు.

హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్
ఈ వ్యాధి ప్రబలుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని..ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తాన్నీ హెల్త్ ఎమర్జెన్సీ ప్రాంతంగా ప్రకటించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగానికి చెందిన నిపుణులు, మేధావుల సలహాలను తీసుకోవాలని సూచించారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు చెందిన డాక్టర్లను ఏలూరుకు పిలిపించాలని, వారితో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. ఇదివరకెప్పుడూ ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదని, దీనిపై విచారణ జరిపించాలని అన్నారు.

డాక్టర్ నాగేశ్వర రెడ్డి సేవలు వినియోగించుకోండి..
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ డాక్టర్‌గా గుర్తింపు పొందిన డీ నాగేశ్వర రెడ్డి సేవలను వినియోగించుకోవాలని రఘురామ.. వైఎస్ జగన్‌కు సూచించారు. డాక్టర్ డీ నాగేశ్వర రెడ్డి.. ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ గ్రూప్ ఆసుపత్రుల ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మంచి పేరున్న డాక్టర్ డీ నాగేశ్వర రెడ్డిని వెంటనే సంప్రదించాలని రఘురామ తన లేఖలో సూచించారు. ఏలూరు ఉదంతం పట్ల సరైన పరిష్కారాన్ని వీలైనంత త్వరగా కనుగొనాలని కోరారు. మానవ తప్పిదం ఉంటే.. దోషులెవరో తేల్చాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని రఘురామ డిమాండ్ చేశారు.

అంతకంతకూ పెరుగుతోన్న రోగుల సంఖ్య
కాగా- అంతుచిక్కని వ్యాధితో ఏలూరు అల్లకల్లోలమౌతోంది. స్థానికులు ఎక్కడికక్కడే నీరసంతో కుప్పకూలిపోతున్నారు. స్పృహ కోల్పోతున్నారు. రెండు రోజులుగా ఏలూరులో భీతావహ వాతావరణం నెలకొంది. కొత్తవారు ఏలూరులో అడుగు పెట్టడానికి సాహసించట్లేదు. వైఎస్ జగన్.. ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ వ్యాధికి గల కారణాలేమిటో కనుగొనాలని, సమగ్ర నివేదికను అందించాలని సూచించారు.