మంత్రి వల్లే మీకు చెడ్డపేరు..వెల్లంపల్లి శ్రీనివాస్ ను టార్గెట్ చేసి జగన్ కు ఎంపీ రఘురామ మరోలేఖ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు.ఈసారి ఏపీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రఘురామ కృష్ణంరాజు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను టార్గెట్ చేశారు .

వెల్లంపల్లి శ్రీనివాస్ ను టార్గెట్ చేసిన రఘురామ
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని రాష్ట్రంలో అనేకమంది స్వామీజీలు,హిందూ మత పెద్దలు, పలు ధార్మిక సంస్థలు, హిందువులు తనకు ఫోన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు. మంత్రి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని పేర్కొన్న రఘురామ మంత్రి తీసుకున్న నిర్ణయం హిందూ సమాజాన్ని అవమానించడమే అంటూ పేర్కొన్నారు.

హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి ,.. అందుకే ఈ లేఖ
హిందూ మత పెద్దలు ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తప్పని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వల్ల మీకు,మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, బాధ్యతగల ఎంపీగా హిందూ ప్రజల మనోభావాలను మీ దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అంటూ రఘు రామ సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు గా చెబుతున్నా కరోనా నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవడంలో తప్పులేదని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.

శుభకార్యాలకు ఇచ్చినట్టు నిబంధనలతో వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వండి
రాష్ట్రంలో వివాహాలు, ఇతర శుభకార్యాలకీ నిబంధనలతో కూడిన అనుమతులను ఇచ్చినట్లుగానే,వినాయక చవితి వేడుకలకు కూడా నిబంధనలతో కూడిన అనుమతి ఇవ్వాలని, గణేషన్ మండపాల అనుమతి విషయంలో హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి పునరాలోచించాలని కోరుతున్నానని రఘురామ కృష్ణంరాజు ఆ లేఖలో పేర్కొన్నారు.
వినాయక చవితి కి సంబంధించి కరోనా తీవ్రత ఉన్న కారణంగా ఇళ్లలోనే పండుగను జరుపుకోవాలని ప్రభుత్వం పేర్కొంది .

గణేశ మండపాలు, భారీ విగ్రహాలు పెట్టొద్దని ఏపీలో ఆంక్షలు .. లేఖలో రఘురామ అసహనం
బహిరంగ ప్రదేశాలలో కాకుండా ఇళ్లల్లో పూజలు చేసుకోవాలని సూచించింది .వినాయక మండపాలు ,భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు అడుగుల కంటే ఎత్తైన విగ్రహాలు పెట్టకూడదని, ఎక్కడ విగ్రహాలు అక్కడే నిమజ్జనం చేసుకోవాలని ఆంక్షలు విధించింది. ఇక ఈ విషయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రకటించారు. దీంతో ఏపీలో హిందూ మత పెద్దలు, స్వామీజీలు, హిందూ ధర్మ సంస్థలు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని రఘురామ కృష్ణం రాజు తన లేఖ ద్వారా సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళారు.