వీళ్ళ పేకాట పిచ్చి పాడుగానూ ..ఏర్లు, నదులు కేంద్రంగా నయా దందా !!
సప్త వ్యసనాలలో పేకాట ఒకటి. జూద ప్రియులు ఎవరెన్ని చెప్పిన, ఇల్లు, ఒళ్ళు గుల్ల అవుతున్నా పేకాట మాత్రం విడిచిపెట్టరు. పోలీసులు పట్టుకుంటారని తెలిసినా దొంగచాటుగా పేకాట ఆడుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఉభయగోదావరి జిల్లాల్లో పేకాట రాయుళ్లు శివారు ప్రాంతాల్లోని తోటలలో గతంలో పేకాట ఆడేవారు. పోలీసులు పేకాటరాయుళ్ల పని పట్టడానికి ఇటీవల కాలంలో శివారు ప్రాంతాల్లో ఉన్న తోటలపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడంతో పేకాట రాయుళ్లు రూటు మార్చారు. పోలీసులకు దొరక్కుండా నయా దందాకు తెరతీశారు.
పేకాట వ్యసనం.. డబ్బుల్లేక భార్యను.. స్నేహితులతో ఆ పని..!

ఎవరికీ దొరక్కుండా నయా పేకాట స్థావరాలు
కొత్త పద్ధతుల్లో ఎవరికీ దొరక్కుండా ఉండటం కోసం మొబైల్ పేకాట స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. జూద ప్రియులు సాధారణంగా ఏ క్లబ్బులకో వెళ్లి తమ వాంఛను తీర్చుకుంటుంటారు. కానీ ఉభయగోదావరి జిల్లాలలో క్లబ్బులు మూట పడ్డాయి. ఇక బయట ఎక్కడ ఆడినా పోలీసులు పట్టుకుంటున్నారు. అందుకే పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఏర్లు, నదులను పేకాట స్థావరాలుగా మార్చేశారు పేకాట రాయుళ్లు.

భీమవరంలో నీళ్ళలో నయా పేకాట దందా
భీమవరం పరిసర ప్రాంతాల్లో సాగుతున్న నయా దందా విషయానికి వస్తే పరిసర మండలాల నుంచి మొగల్తూరు వరకు విస్తరించిన ఉప్పుటేరులో చిన్న చిన్న మర పడవల్లో ప్రయాణిస్తూ, పేకాట రాయుళ్లు జూదం ఆడుతున్నారు. జిల్లాలోని క్లబ్బులు మూతపడడంతో, తోటలలో పేకాట సాగిస్తే పోలీసులకు పట్టుబడుతుండటంతో ఏర్లు, నది పాయలలో బోట్ల పై వెళుతూ పేకాట ఆడుతున్నారు అంటే ఆ వ్యసనం వారిని ఎంతగా మార్చేసింది అనేది అర్థం చేసుకోవచ్చు.

ఏరు మధ్యలోనే పడవలలో పేకాట ... మందు, విందు అన్నీ అక్కడే
పడవలపై షికారుకు వెళ్ళినట్లుగా ఏటి లోపలికి వెళ్లడం రోజంతా ఏటి మధ్యలోనే ఉంటూ జూదం ఆడటం చేస్తున్నారు. అంతేకాదు బోటు యజమానులతో ముందుగానే ఒప్పందం చేసుకుని, ఆహారం, మద్యం సరఫరా చేయించుకుంటున్నారు. ఇక ఇలా ఇక్కడ పేకాట ఆడేందుకు ఇతర జిల్లాల నుంచి కూడా పేకాటరాయుళ్ల వస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి భీమవరానికి వస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ.

రోజుకో చోట నీళ్ళలోనే దందా..
నిత్యం ఒకే ప్రాంతంలో ఉండి పేకాట ఆడకుండా, అవకాశాన్ని బట్టి తెలివిగా రోజుకో చోట ఉంటూ నీళ్ల మధ్యలోనే పేకాట దందా సాగిస్తున్నారు. ముఖ్యంగా కాళ్ళ మండలంలో ఉన్న మొగదిండి స్ట్రెయిట్ కట్ తో పాటు, భీమవరం సమీపంలోని ఏరు జూదం ఆడడానికి అనువుగా ఉన్నాయని గుర్తించినవారు ఎంచక్కా తమ పేకాట దందాను యధేచ్చగా నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల మొగదిండి కాలువలో పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు.

మొగదిండి కాలువలో పట్టుబడిన పేకాట రాయుళ్ళు .. తీగ లాగితే కదిలిన డొంక
ఇక పట్టుబడ్డ వారిలో అధికార పార్టీ నాయకులు, గతంలో పేకాట స్థావరాలపై నిర్వహించినవారు, పెద్ద పెద్ద వాళ్లే ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. ఏర్లు, నదులు స్థావరాలుగా పేకాట రాయుళ్లు తమ దందా కొనసాగిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు తీరం వెంబడి గస్తీ పెంచారు. నిత్యం కాలువలు, ఏరుల్లోకి వెళ్లే బోట్లను తనిఖీలు చేస్తున్నారు. వాటర్ లో సాగుతున్న మొబైల్ పేకాట దందాకు చెక్ పెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా పేకాట ఆడడానికి ఏర్లు, నదులను స్థావరాలుగా మార్చుకున్న పేకాటరాయుళ్ల తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ దొరికితే ఇంకా దొరక్కుండా వేరే ప్రత్యామ్నాయం లేకపోతుందా అని వారు అనుకుంటున్నారట .
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!