ప.గో జిల్లాలో మళ్లీ వింత వ్యాధి.. 10 మందికి అనారోగ్యం, గతనెలలో వందలాది మంది..
పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి వింత వ్యాధి కలకలం రేపింది. భీమడోలు మండలం పూళ్లలో వింత వ్యాధి వచ్చింది. ఏలూరు తరహా వ్యాధి లక్షణాలతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా 10 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొందరికి మూర్చ లక్షణాలు కూడా కనిపించాయి. ఉన్నట్టు ఉంది బాధితులు కింద పడిపోతున్నారు. అయితే వారికి ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. కానీ పరీక్ష చేశాక నిజ నిజాలు తెలిసే అవకాశం ఉంది.

గతనెలలో కూడా వింత వ్యాధి..
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో డిసెంబర్లో వింత వ్యాధి కలకలం రేగింది. ఇటీవల అంతుచిక్కని వ్యాధి వణికించింది. పలు ప్రాంతాల నుంచి 615 మంది బాధితులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించి శాంపిల్స్ సేకరించారు. స్థానికంగా పండుతున్న ఆహారం, పాలు, కూరగాయలు, తాగునీటితో పాటు బాధితుల నుంచి రక్తం, యూరిన్ వంటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. పరీక్షల్లో బాధితుల శరీరం నుంచి సేకరించిన రక్తంలో లెడ్, నికెల్, పురుగు మందుల అవశేషాలున్నాయని నిర్ధారించాయి.

వందల కేసులు నమోదు..
డిసెంబర్ 4 నుంచి 12 వరకు వందల్లో కేసులు నమోదు కాగా తర్వాత తగ్గుముఖం పట్టాయి. సహజ వనరులు కలుషితం కావడం వల్లే ఇలా జరిగినట్లు అభిప్రాయపడుతున్నారు. పంటలు, నీటి శుద్ధిలో రసాయనాల వినియోగం తగ్గిస్తే ఇలాంటి సమస్యలు రావని సూచిస్తున్నారు. అస్వస్థతకు కచ్చితంగా ఇదీ కారణం అని బయటపడకపోయినా సాగు, త్రాగునీటితోపాటు కల్తీ ఆహారం ప్రజల ప్రాణాల మీదకి తెస్తుందని ప్రాక్టికల్‌గా ప్రూవ్ అయింది. క్యాన్సర్ కారకాలు బయటపడటం, భూగర్భ జలాల్లో కూడా ఈ-కొలి బ్యాక్టీరియా అనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మరి ఈ సారి..
మళ్లీ సరిగ్గా నెలరోజుల తర్వాత భీమడోలు మండలంలో అలాంటి వ్యాధి బయటపడింది. పది మంది వరకు అనారోగ్యానికి గురయ్యారు. వీరికి ఏం జరిగిందనే ఆందోళన నెలకొంది. గతంలో మాదిరిగా వాటర్ ప్రాబ్లమా..? ఇతర సమస్య ఉందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోసారి నీరు, రక్తం, ఆహారం పరీక్షించే ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది.