హ్యాట్సాఫ్ జస్టిస్ రాకేశ్-సిగ్గు రాదా? -పుష్కరాలపై జగన్ కుట్ర -కొత్తరకం దారి దోపిడీ: ఎంపీ రఘురామ
సొంత పార్టీపై, పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి మాటల దాడి చేశారు. సీఎంకు మతాన్ని అంటగడుతూ, తుంభద్ర పుష్కరాల సందర్భంలో జగన్ ఉద్దేశపూర్వకంగా హైందవ మతాన్ని అవమానిస్తున్నారని ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. రాజధాని అమరావతి అంశంలో హైకోర్టు జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తెలుగు జడ్జిలు, ప్రజల తీరుపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ముంబై నుంచి ఆయన మాట్లాడారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
దుబాయ్ రాజుగారి ఆరో భార్య గుట్టు రట్టు -బాడీగార్డుతో ప్రిన్సెస్ హాయా అఫైర్ -అందుకు రూ.12కోట్లు

నెలరోజుల్లో రిటైర్మెంట్..
‘‘ఆ మధ్య చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా నమోదైన కేసులకు సంబంధించి ఇటీవల రాష్ట్ర హైకోర్టులో విచారణ సందర్భంగా జస్టిస్ రాకేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలుచేశారు. చంద్రబాబు వైజాగ్ రావడాన్ని మతిలేని చర్యగా ప్రభుత్వ న్యాయవాది అభివర్ణిస్తే.. వేలకోట్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత రాజధానిని అమరావతి నుంచి తరలించడం మతిలేని చర్య కాదా? అని జస్టిస్ రాకేశ్ అన్నారు. సంబంధం లేని అంశాలు మాట్లాడొద్దని ప్రభుత్వ న్యాయవాది వారిస్తే.. చంద్రబాబు విశాఖ వెళ్లింది అమరావతి కోసమేనని జడ్జి గుర్తు చేశారు. జస్టిస్ రాకేశ్ కుమార్ ది బీహార్ రాష్ట్రం. మరో నెలరోజుల్లో ఆయన రిటైర్ కానున్నారు. ఇంతటి కీలక సమయంలో అమరావతి రైతల పక్షాన మాట్లాడిన ఆయనకు నిజంగా హ్యాట్సాఫ్. అయితే..
చంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రం

ఆంధ్రులారా.. సిగ్గు రాదా?
జస్టిస్ రాకేశ్ కుమార్ నిత్యం ఇంటి నుంచి హైకోర్టుకు వెళ్లే దారిలో.. అమరావతి రైతుల ఆక్రందనలు, వారికి జరుగుతోన్న అన్యాయాలను చూసి కలతచెంది ఇలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు మంచికి, మానవత్వానికి అద్దం పడుతున్నాయి. న్యాయం, ధర్మం అమరావతి రైతుల పక్షానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వానిది మతిలేని చర్య కాదా? అని జడ్జి రాకేశ్ ప్రశ్నించిన వైనం అమరావతి రైతుల్లో స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపింది. ఎక్కడో బీహార్ కు చెందిన రాకేశ్ కుమార్ మన రైతుల సమస్యలపై ఇలా స్పందించారు. మరి రాష్ట్రానికే చెందిన మిగతా వాళ్లకు హృదయం లేదా? సొంత ఇల్లు తగలబడుతున్నా నొప్పి లేదా? ఆంధ్రులారా.. అసలు మీకు సిగ్గు రాదా? కనీసం జడ్జి రాకేశ్ ను ఆదర్శంగా తీసుకునైనా అమరావతి ఉద్యమానికి మద్దుతు పలకండి. సీఎం జగన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకుని, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలి. రాష్ట్రంలో చోటుచేసుకున్న మరో ప్రధానాంశం..

తుంగభద్ర పుష్కరాల్లో పాపాలు..
12 ఏళ్లకు ఒకసారి నదులకు వచ్చే పుష్కరాలను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈసారి తుంగభద్ర పుష్కరాలను క్రైస్తవుడైన ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించడం మంచిదే. కానీ.. పుష్కర స్నానం సమయంలో తల్లిదండ్రులకు పిండాలు పెట్టడం హైందవ సాంప్రదాయం. దానికి విరుద్ధంగా జగన్ ప్రభుత్వం.. కరోనా కట్టడి పేరుతో నదిలోకి దిగినవాళ్లను దిగినట్లుగా అరెస్టులు చేస్తున్నారు. నది అవతలి ఒడ్డు(తెలంగాణ)లో కేసీఆర్ చాలా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కరోనా నెగటివ్ రిపోర్టులుంటే నదిలోకి వెళ్లనిస్తున్నారు లేదా థర్మల్ స్క్రీనింగ్ చేసి పంపుతున్నారు. అంతేతప్ప అరెస్టులకు పాల్పడటం లేదు. తనకు ఆప్తుడైన కేసీఆర్ నుంచి జగన్ కొన్నయినా హైందవ విలువలు నేర్చుకోవాలి. పుష్కర ఘాట్లలో ఎడాపెడా అరెస్టులు చేయడం, కదలాలంటే దీనికి ఇంతంటూ రేట్లు పెట్టడం హిందువుల మనోభావాలను గాయపరుస్తోంది. అంతేకాదు..

హిందూత్వపై కోపంతోనే..
తుంగభద్ర పుష్కరాలకు కొద్దిరోజుల ముందు.. జగన్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా 10 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున కార్యక్రమాలు చేశారు. కేవలం 10 శాతం మందే స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తే, మిగిలిన 90 శాతం మందిని ప్రభుత్వ పథకాలు పోతాయని భయపెట్టి బలవంతంగా తీసుకొచ్చారు. వాళ్లలో డ్వాక్రా మహిళలు కూడా ఉన్నారు. మొత్తంగా లక్షల మంది మాస్కులు లేకుండా రోడ్లమీదికొస్తే వ్యాపించని కరోనా.. కేవలం పుష్కరాల్లో మాత్రమే స్ప్రెడ్ అవుతుందా? అసలు నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని శాస్త్రీయంగా నిరూపణ అయిందా? సోషల్ డిస్టెన్స్ పద్ధతిలో ఏర్పాట్లు చేసుంటే పుష్కరాలు సజావుగా సాగేవి. కేవలం హిందూ మతం మీదున్న కోపంతోనే జగన్ ఆ తరహా ఏర్పాట్లు చేయలేదు. హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసంలో సముద్ర స్నానాలు చేయనీయకుండా ఎక్కడిక్కడ తీరాల్లో ముళ్ల కంచెలు వేసి అడ్డుకుంటున్నారు. కరోనాతో సహజీవనం చేయాలన్న జగనే హిందూ పండుగల విషయంలో కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. పుష్కరాల్లో మిగిలిన ఏడు రోజులైనా ప్రజల హృదయాల్ని గాయపర్చకుండా వ్యవహరించండి. ఇక,

జగనన్న రహదారి దోపిడీ..
ఏపీలో ప్రజలందరూ భయంగా ఎదురు చూస్తోన్న మరో పథకం.. జగనన్న రహదారి కానుక త్వరలోనే ప్రారంభం కానున్నట్లు వినికిడి. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ పెట్టి భారీగా వసూళ్లకు దిగబోతున్నారు. దేశంలో ఇలాంటి విధానం ఎక్కడా లేదు. ఇప్పటిదాకా జాతీయ హైవేలు.. అవి కూడా కొత్తగా నిర్మించినవాటిపైనే టోల్ వసూలు చేస్తున్నారు. ఏపీలో ఇప్పటికే రోడ్ల పేరుతో పెట్రోల్, డీజిల్ పై రూ.2 అదనపు పన్ను వసూలు చేస్తున్నారు. కొత్తగా అన్ని రోడ్లపై 30 కిలోమీటర్లకు ఓసారి ట్యాక్స్ వసూలు చేస్తామనడం ఏంటి? రోజుకు 100 కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తులు రూ.90 చెల్లించుకోవాలా? అసలు రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయా? కొత్త రోడ్లు వేయకుండా ట్యాక్సులు బాదడమేంటి? ముందుగా మంచి రోడ్లు వేసి.. ఆ తర్వాత ప్రజలకు ఆదా అయ్యే పెట్రోల్, ఇతర ఖర్చుల్ని కావాలంటే మీరే(ప్రభుత్వం) మింగేయండి. రోడ్లపై గుంతలు పూడ్చకపోతే ఆందోళనకు దిగుతానని స్వయంగా గురజాల వైసీపీ ఎమ్మెల్యేనే వార్నింగ్ ఇచ్చారు. కొత్త పథకాన్ని ‘జగనన్న రహదారి దోపిడీ'అని జనం అనుకుంటున్నారు. ఎప్పుడో వేసిన రోడ్లకు ఇప్పుడు పన్ను తీసుకోవడం తప్పు. ధరలు పెంచితే మద్యపానం తగ్గుతుందని జగన్ గతంలో చెప్పారు.. అదే పద్ధతిలో ఇప్పుడు రోడ్ ట్యాక్సులు పెంచితే జనం ఇంటి పట్టునే ఉంటారని ఆయన భావిస్తుండొచ్చు. దయచేసి పన్నుల బాదుడును మానేసి, రోడ్లను బాగుచేసే పని చూడండి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.