జగన్ ఆమె దుస్తులు విప్పేస్తున్నారు - సీఎంగా 3.5ఏళ్లు కష్టం - కాపాడేది ఆయనొక్కడే: ఎంపీ రఘురామ
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అనుకూలంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించడం రాజ్యాంగ విరుద్ధమని, ఏ వ్యవస్థకూ లేని ఇమ్యూనిటీని ఒక్క జ్యూడీషియరీకి మాత్రమే రాజ్యాంగం కల్పించిందని, అలాంటి వ్యవస్థను టార్గెట్ చేసిన జగన్ రాబోయే మూడున్నరేళ్లు పదవిలో ఉండటం కష్టమేనని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సొంత పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన మాటల్లోనే..
సీఎం జగన్ అసాధారణ అడుగు - జస్టిస్ ఎన్వీ రమణపై పోరు ఉధృతం - రాష్ట్రపతి, ప్రధాని వద్దకు..

న్యాయదేవత వస్త్రాపహరణం..
‘‘న్యాయ వ్యవస్థపై దాడిలో భాగంగానే సీఎం జగన్.. సీజేఐకి ఫిర్యాదు లేఖ రాశారు. ఇవాళ ఏపీలో తలెత్తింది మామూలు సమస్యకాదు. ఇది దేశం మొత్తానికి వర్తిస్తుంది. ప్రపంచం దృష్టిలో మన వ్యవస్థల ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారమిది. ఒక్కసారి న్యాయవ్యవస్థ కుప్పకూలితే ఈ దేశాన్ని ఎవరూ కాపాడలేరు. జగన్.. న్యాయదేవత దుస్తులు విప్పేస్తున్నారు.. ఈ వస్త్రాపహరణ ఘట్టంలో జగన్ కు మద్దతు ఇచ్చేవాళ్లకు భవిష్యత్తులో మనుగడ ఉండదు. నాడు ద్రౌపతి వస్త్రాలను విప్పేసిన కౌరవులు 100 మందైతే, ఇవాళ న్యాయదేవతను వివస్త్రగా చేస్తోన్న అభినవ కౌరవులైన వైసీపీ నేతల సంఖ్య 151 ప్లస్ ఎంపీలు. దురదృష్టవశాత్తూ ఆ కౌరవుల్లో నేనూ ఒకడిగా ఉన్నాను.
జడ్జిలపై ఫిర్యాదు: జగన్ కు భారీ షాక్ - సీఎంపై చర్యలకు సుప్రీంకోర్టులో పిటిషన్ -ఆర్టికల్ 121, 211

కాపాడేది ఆయనొక్కడే..
నాడు ద్రౌపతిని శ్రీకృష్ణుడు కాపాడినట్లు... ఇవాళ వైసీపీ కౌరవుల బారి నుంచి న్యాయదేవతను కాపాడే శక్తి ఒకే ఒక్కరికి ఉంది. ఆయనే మన కోవిందుడు. అత్యున్నత న్యాయస్థానం రికమెంట్ చేస్తే.. నాటి కృష్ణుడి పాత్రను నేటి కోవిందుడు(రాష్ట్రపతి) తీసుకుంటారు. అయ్యా రాష్ట్రపతిగారు.. ముఖ్యమంత్రి చేతిలో వివస్త్రకు గురవుతోన్న న్యాయవ్యవస్థను తక్షణమే కాపాడండి. దయచేసి ఎక్కువ ఆలస్యం చేయకండి. బరితెగించిన వాళ్లకు ఏ కోర్టూ, న్యాయమూర్తులు కనిపించడంలేదు. న్యాయదేవతను రక్షించండి..

ఇది ఆరంభం మాత్రమే..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 121, ఆర్టికల్ 211 ప్రకారం.. న్యాయమూర్తులపై పార్లమెంటులో అభిశంసన తప్ప మరో రకంగా వారిపై నిందలు మోపడం, తీర్పులపై విమర్శలు చేయడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమే అవుతుంది. అన్నిటికి అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్.. వాటిపై కోర్టులు సరైన తీర్పులిస్తే కడుపుమంట ప్రదర్శిస్తున్నారు. హైకోర్టులోని కొందరు జడ్జిలు, సుప్రీంకోర్టులోని ఒక జడ్జిపై ఆరోపణలు చేసిన జగన్.. రాబోయే రోజుల్లో అందరు జడ్జిలపైనా, అన్ని కోర్టులపైనా ఇదే తరహా దాడిని కొనసాగిస్తారు. వీళ్లను చూసి మిగతా నేరస్తులు కూడా న్యాయవ్యవస్థను అవమానించే పనికి పూనుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఆరంభం మాత్రమే..

సీఎంను కూడా సీబీఐ పరిధిలోకి..
ప్రభుత్వం చేపట్టిన పనికిమాలిన పథకాలపై కామెంట్లు చేసిన ఉద్యోగులను వేధించి, వధించారు. కానీ జడ్జిలపై అతి తీవ్ర వ్యాఖ్యలు చేసినవాళ్లపై చర్యలకు మాత్రం ఏపీ సీఐడీ భయపడుతోంది. దాని నిస్సహాయతను గుర్తించారు కాబట్టే.. జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసును కోర్టు సీబీఐ కి అప్పగించింది. అజయ్ కల్లాం ప్రెస్ మీట్ గానీ, అసెంబ్లీ స్పీకర్ నుంచి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కోర్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక ముఖ్యమంత్రి అంగీకారం కూడా ఉండి ఉంటుంది. అందుకే సీబీఐ దర్యాప్తు పరిధిలోకి ముఖ్యమంత్రిని కూడా చేర్చాలి. ఆయనను కూడా ప్రశ్నించాలి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.