వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్జాతీయ వేదికపై తెలుగ కవిత

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
కొత్త ఏడాది ప్రయాణాలతో మొదలయ్యింది!

ఆస్టిన్ నించి లాస్ ఏంజెల్స్ కి విమాన ప్రయాణం చాలా సరదాగా వుంటుంది. విమానం లాస్ ఏంజెల్స్ చేరబోతుండగా, రెక్కల కింద నించి చూస్తే, ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ చూసినట్టే వుంటుంది నేలంతా. ఆ క్షణాన ఎందుకో సంజీవ్ దేవ్ గుర్తొచ్చారు నాకు. ప్రకృతీ, కొండల చుట్టూ సంజీవ దేవ్ పెయింటింగులు వరసాగ్గా చూస్తూ పోతున్నట్టు వుంది కింద నేలన.

లాస్ ఏంజెల్స్ లో దక్షిణాసియా సాహిత్య సదస్సుకి ఆరునెలల క్రితం ఆహ్వానం వచ్చింది. మాడరన్ లాంగ్వేజ్ అసోసియషన్ (ఎం‌ఎల్‌ఏ) కి అనుబంధంగా జరిగే సదస్సు ఇది. మామూలుగా ఇలాంటి సదస్సులలో ఏ సల్మాన్ రష్దీ గురించో, అరుంధతి రాయ్ గురించో, మహా అయితే టాగూర్ దాకానో పరిమితమవుతాయి చర్చనీయాంశాలు. సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్ గురించి కొన్ని వందల మంది మాట్లాడతారు. సాధారణంగా ఇంగ్లీషు సాహిత్యం పరిధి దాటి ఎవరూ రారు. ఈ చర్చని మరో వైపు తిప్పాలని నా ఆలోచన. భాషా సాహిత్యాల వైపు మళ్ళితే తప్ప ప్రపంచ సాహిత్యం అంతు పట్టదని మొదటి నించీ నా ఘోష. పైగా, నా తెలుగు పక్షపాతం! ఈ మధ్య జూపాక సుబద్ర కవిత “కొంగు" గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నాను.

ఆ కవిత గురించే మాట్లాడితే సరిపోదా అనుకుని, ముందు ఆ కవితని అనువాదం చెయ్యడం మొదలు పెట్టాను. ఈ లోగా మిత్రుడు పురుషోత్తమ్ ఈ కవితని అనువదించినట్టు ఎవరో చెప్పారు. సరే, ఆ అనువాదం కూడా చేతికొచ్చింది. ఈ కవిత మీరు ఇప్పటి దాకా చదివి వుండకపోతే, ఇప్పుడు చదవండి. పురుషోత్తం అనువాదం కూడా చాలా బాగుందనిపించింది. తెలుగు నించి ఇంగ్లీషులోకి కవిత్వ అనువాదం అంత తేలిక కాదు, కానీ, పురుషోత్తం అనువాద సామర్ధ్యం అంతా ఈ కవిత లో తెలుస్తుంది.

సరే, ఈ కవితని ఎక్కడో లాస్ ఏంజెల్స్ లో అసలు తెలుగు అనే వొక భాష వుందని కూడా తెలియని సమూహాల మధ్య, ఒక అంతర్జాతీయ వేదిక మీద చర్చకి ఎలా తీసుకురావాలన్నది ఇప్పుడు ప్రశ్న. అదెలా చేశామో తరవాత చెప్తాను. అదేమిటి, ఏక వచనంలో ప్రారంభించి ఇలా బహువచనంలోకి వచ్చానేమిటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ప్రయాణం ఏర్పాట్లలో భాగంగా – ఈ సదస్సు గురించి నేను వొక అమెరికన్ మిత్రురాలికి చెప్పాను. ఆమె జెండర్ స్టడీస్ ప్రొఫెసర్. పేరు బానీ జైర్. మాడిసన్ విస్కాన్సిన్ లో కొన్నాళ్ళ క్రితం నా దగ్గిర హిందీ-ఉర్దూ నేర్చుకుంది. అప్పటి నించీ మా పరిచయం. కవిత్వం మా ఇద్దరి మధ్యా వంతెన. మాటల సందర్భంలో నేను సుబద్ర కవిత విషయం చెప్పగానే బానీ చాలా ఆసక్తి చూపించింది.

ఇక కవిత గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. స్త్రీవాద కవిత్వంలో సుబద్ర కవిత ఒక మంచి మలుపు అని నా అభిప్రాయం. ఈ కవిత జయప్రభ “పైటని తగల్లెయాలి" కవితకి ప్రతివాదం. అస్తిత్వాన్ని నిర్దిష్టంగా చెప్పాలన్న తెలుగు కవిత్వ ప్రయాణంలో సుబద్ర 'కొంగు" తప్పనిసరిగా ఒక మజిలీ. స్త్రీకి కేవలం స్త్రీ అస్తిత్వమే వుండదని, ఆ స్త్రీ ఏ వర్గం నించి, ఏ కులం నించి వచ్చిందన్నది అస్తిత్వంలోనూ, కవిత్వ వ్యక్తీకరణలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుందని నా వాదన. ఆ రకంగా జయప్రభ “పైట" కవిత ఒక నిర్దిష్టమయిన వర్గ వ్యక్తీకరణ అయితే, సుబద్ర “కొంగు" దానికి కౌంటర్.

నా వాదన బానీకి బాగా నచ్చింది. అంతే, ఈ విషయం ఇద్దరం కలిసే మాట్లాడదాం అని అనుకున్నాం. అప్పటి దాకా తను వొక వేరే టాపిక్ అనుకుంది, మా చర్చల తరవాత అది తెలుగు వైపు, సుబద్ర కవిత వైపు మళ్ళింది. ఈ ప్రసంగానికి వచ్చిన ప్రతిస్పందన మాకు ఎంత ఉత్సాహం కలిగించిందంటే, దీనిని వొక పెద్ద వ్యాసంగా మార్చే పనిలో పడ్డాం ఇప్పుడు! (అప్పటికప్పుడు ఈ వ్యాసం “సౌత్ ఆసియా రెవ్యూ" లో ప్రచురిస్తామని ఆ పత్రిక ఎడిటర్లు కూడా మాటిచ్చారు, అలా ప్రచురించడానికి తగ్గట్టుగా రాయడానికి ఇంకా చాలా పని వుంది అనుకోండి!) భాషా సాహిత్యాలలో ఈ విధమయిన సృజనాత్మక సాహిత్యం వస్తోందా అని కొందరు ఆశ్చర్యపోయారు; తెలుగు ఎక్కడి భాష, ఆ కవిత లో కొన్ని భాగాలు తెలుగులో చదవగలరా అని కొందరు అడిగారు; తెలుగులో కొన్ని పంక్తులు చదివి వినిపించినప్పుడు తెలుగులో వున్న సహజ మాధుర్యానికి కొందరు ముగ్ధులయ్యారు. ఇది ఎంత దూరం పోయిందంటే, ఆ రోజు సాయంత్రం నా కవిత్వ పఠనం జరిగినప్పుడు వొకటి రెండు కవితలు తెలుగులో చదివి తీరాలని చాలా మంది పట్టుబట్టారు, వేదిక కింద నించి “తెలుగు చదవండి...తెలుగు చదవండి" అని కేకలు వేశారు.

ఇక్కడ కవిత్వ పఠనం కూడా గొప్ప అనుభవం. ప్రసిద్ధ రచయిత్రి ఫౌజియా అఫ్జల్ ఖాన్ ఇటీవలి తన కొత్త అనుభవాలూ-జ్నాపకాల పుస్తకం నించి కొన్ని భాగాలు చదివారు. తరవాత నా కవిత్వ పఠనం జరిగింది. అక్కడ వున్న వారి కోరిక మేరకు నేను కొన్ని తెలుగు కవితలు చదివినా, ఎక్కువగా ఇంగ్లీషు కవితలకే పరిమితమయ్యాను. తెలుగు కవిత్వం అనువాదంలో వున్న సమస్యలే, “అనువాద" పఠనంలోనూ వున్నాయి. సందర్భ వివరణ, పాద సూచికలు ఇవ్వడంలో చాలా సమయం పోతుంది, ఈ లోపు శ్రోతలలో కవిత్వం వినాలన్న ఆసక్తి చచ్చిపోతుందేమో! ఈ కారణంగా ఇక్కడి సదస్సులలో ఎక్కువ ఇంగ్లీషు పద్యాలకే పరిమితమవుతున్నా.

దాదాపు గంట సేపు జరిగిన పఠనం ఆసక్తికరంగా సాగింది. ఆ తరవాత ప్రశ్నలూ-జవాబులూ! అనేక రకాల మనుషులూ, అనేక రకాల అభిరుచులూ, అన్వేషనలూ, అనేక రకాల ఆహార పదార్థాలూ, ప్రదేశాల పరిభ్రమణంలో మంచి అనుభూతి ఈ మూడు రోజుల సాహిత్య సదస్సు! - అఫ్సర్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X