డల్లాస్లో భోగి మంటలు
అమెరికా లో దీపావళి మందులు కాల్చడం, భోగి మంటలు వేయడం అనేక అనుమతులు, ముందు జాగ్రత్తలతో కూడుకున్న విషయం. చాలా ప్రాంతాలలో నిషిద్దం, కష్టం. అయితే ఈ కష్టాలను లక్ష్యపెట్టకుండా, డల్లాస్ లో ఈసారి భోగి పండుగ చేసుకోవాలని సంకల్పించి, డల్లాస్ కు చెందిన బొర్రా సోదరులు విజయ్, రవి తమ సొంత ఫార్మ్ లో భోగి మంటలను, ఆంధ్ర షడ్రుచుల వంటలను ఏర్పాటు చేసి వారిఊరికి సంక్రాంతి శోభను కలిగించారు.
దాదాపు 100 తెలుగు కుటుంబాలు డల్లాస్ సమీపంలోని మేలిస్సా లో గల బొర్రా ఫార్మ్స్లో శనివారం వేకువ జామున, చలిని లెక్క చేయకుండా, పొగమంచు చాటున సమావేశమై, నిలువెత్తు భోగి మంటను వెలిగించారు.
ఎప్పుడో తమ చిన్నప్పుడు పల్లెటూళ్ళలో, వీధుల్లో స్నేహితులందరితో కలిసి చేసుకున్న పండుగను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దలతోపాటు శీతాకాలం తెల్లవారుఝాము చలిలో భోగిమంటల మజా మొదటి సారి చవిచూసిన పిల్లలు ఈ కార్యక్రమం లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు.
గారెలు, అరిశెలు, పులిహోర, మొదలైన అనేక తెలుగు వంటకాలతో విందులు, మగువలు తీర్చిదిద్దిన వన్నెవన్నెల రంగవల్లులు, సంక్రాంతిపాటలు ఆటలు వినోదాలతో ఎంతో ఆహ్లాదంగా సాగిన ఈవేడుకను ఏర్పాటు చేసిన బొర్రా బ్రదర్స్ కు అందరూ అభినందనలు తెలియజేశారు.