జులై 4 నుంచి తానా మహాసభలు
తిరుమల : జులై 4,5,6 తేదీల్లో తానా 22వ మహాసభలు నిర్వహించాలని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నిర్ణయించింది. ఈసారి అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సంబురాలు జరుపుకోవాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తానా అధ్యక్షుడు సతీశ్ వేమన ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రెసిడెంట్ ట్రంప్‌కు ఆహ్వానం
మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగే తానా మహా సభలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు సతీశ్ చెప్పారు. దేశంలో ఇతర ప్రముఖులను సైతం ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 2007 తర్వాత మళ్లీ ఈ ఏడాది వాషింగ్టన్ డీసీలో తానా సభలు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు.

తానా వేదికపై శ్రీవారి కల్యాణం
ఈసారి తానా వేదికపై టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. తాళ్లపాకలో 600 మంది కళాకారులతో నిర్వహించిన ఎప్పటికీ అన్నమయ్య కార్యక్రమం విజయవంతమైంది. అదే స్ఫూర్తితో అమెరికాలోని అన్ని నగరాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సతీశ్ వివరించారు.