అమెరికాలో భారత సంతతి మహిళా రీసెర్చర్ దారుణ హత్య
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాగింగ్ చేస్తున్న వేళ భారత సంతతికి పరిశోధకురాలిని దుండగులు హత్య చేశారు. టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టెక్సాస్ రాష్ట్రంలోని ప్లానో నగరంలో నివసిస్తోన్న శర్మిష్ట సేన్(43)ను ఆగస్టు 1న
చిషోల్మర్ ట్రైల్ పార్క్ ఆవరణంలో జాగింగ్ చేస్తుండగా.. దుండగులు ఆమెపై దాడి చేసి హతమార్చారు. లెగసీ డ్రైవ్, మార్చ్మ్యాన్ సమీపంలోని క్రీక్ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
కాగా, మాలిక్యూలర్ బయోలజీ చదివిన శర్మిష్ట.. ఫార్మసిస్ట్, రీసెర్చర్‌గా కొనసాగుతున్నారు. ఆమె క్యాన్సర్ రోగుల కోసం పనిచేస్తున్నారు. శర్మిష్టకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
శర్మిష్ట హత్య ఘటనపై కేసు నమోదు పోలీసులు.. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని 29ఏళ్ల బకారి అభియోనా మోన్ క్రీప్గా గుర్తించారు. ప్రస్తుతం అతడు కొల్లీన్ కౌంటీ జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని విచారిస్తున్నట్లు చెప్పారు.

శర్మిష్ట సేన్ హత్య జరిగిన సమయంలోనే.. మైఖేల్ డ్రైవ్‌లోని 3400 బ్లాక్‌లోని ఓ ఇంటిలోకి ఎవరో దుండగులు చొరబడ్డారని పోలీసులు తెలిపారు. బకారిని కూడా దోపిడీ నేరం కింద అరెస్ట్ చేశారు. శర్మిష్ట హత్యతో అతడికి సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
శర్మిష్ట అథ్లెట్ కావడంతో ప్రతిరోజూ తన కుమారులు లేవడానికి ముందే జాగింగ్ చేయడానికి వచ్చేదని పోలీసులు తెలిపారు. శర్మిష్ట మరణంతో ఆమె కుటుంబంలో పెను విషాదం నెలకొంది. శర్మిష్ట చాలా మంచిదని, ఎవరినైనా చిరునవ్వుతో పలకరిస్తుందని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు చెబుతున్నారు.
ఒక గొప్ప మనిషిని తాము కోల్పోయామని శర్మిష్ట స్నేహితురాలు మారియో మేజర్ అన్నారు. గొప్పవారికే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతాయో అర్థం కావడం లేదని అన్నారు. ఒక మంచి కుటుంబం ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని మరో స్నేహితురాలు అనీశా చింతల ఆవేదన వ్యక్తం చేశారు.