• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో తెలుగు పాటల కోయిల.. స్వాతి

|

వాషింగ్టన్: అమెరికాలోని అట్లాంటాలో అన్నమయ్య, త్యాగయ్య, శ్రీరామదాసు, పురందరదాసు, ముత్తుస్వామి దీక్షితార్, సదాశివ బ్రహ్మం వంటి వాగ్గేయకారలు, కీర్తనలు రుచిచూపిస్తూ ఆబాలగోపాలన్ని అలరిస్తూ అత్మానందమేగాక ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేస్తున్న శ్రీమతి స్వాతి. కరి అభినందనీయురాలు.

అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడిన స్వాతి, శ్రీకాంత్ కరి దంపతులు తెలుగు మూలాలను మరవలేదు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను వీడలేదు. హైదరాబాద్ విద్యానగర్ కు చెందిన స్వాతి, అమెరికాలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగం సాధించారు.

 singer swati kari program in svbc channel

శ్రీకాంత్ కరిని వివాహం చేసుకుని, ఉద్యోగంలో బిజీగా ఉన్నా ఎక్కడో అసంతృప్తి వెంటాడుతుండేది. డబ్బు సంపాదన ఒక్కటే జీవత పరమార్థం కాదని, అంతకుమించి సాధించాల్సింది మరింకేదో ఉందని అనిపించింది.

అట్లాంటాలోని తెలుగువారు వారాంతాల్లో విధిగా ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని కలుస్తుంటారు. స్వాతి శ్రీకాంత్ దంపతులు కూడా ఈ గెట్ టు గెదర్ లలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇలాంటి సమావేశాలలోనే వాగ్గేయకారుల కృతులను స్వాతి పాడి వినిపించేవారు. వాటిని విన్న తెలుగువారికి ప్రాణం లేచివచ్చినట్లనిపించేది. సొంతనేలపై ఉన్నామన్న భావన కలిగేది. మిగతా వారు కూడా ఒకటి రెండు పాటలను వినిపించేవారు. స్వాతి వారికి మెలుకువల గురించి వివరించేవారు.

ఆ సమయంలోనే హైదరాబాద్ లోని ప్రతిమా శశిధర్ గారి దగ్గర తీసుకున్న కర్ణాటక సంగీత శిక్షణ కూడా వృథా కాకూడదని స్వాతి భావించారు. తమ పిల్లలకూ సంగీతంలో శిక్షణ ఇవ్వండని తల్లిదండ్రులు ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.

అమెరికాలో ఉద్యోగాలు చేసే ప్రతివారూ వారం రోజుల పాటు ఎంతో ఒత్తిడికీ ప్రయాసకూ లోనవుతారు. పాతిక, ముప్పై మైళ్ల దూరంలోని ఆఫీసులకు స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి వస్తారు. ఆఫీసులో పని ఒత్తిడితో పాటు ఇంటికి రాగానే పిల్లల ఆలనా పాలనా బాధ్యతలు చూసుకోక తప్పదు. ఇలా క్షణం తీరుబడి లేకుండా యాంత్రికంగా గడిపేస్తున్న తెలుగువారు, వారంతపు గెట్ టు గెదర్ లలో సంగీతం ద్వారా మానసిక ప్రశాంతత, ఉపశమనం పొందుతున్న విషయాన్ని స్వాతి గ్రహించారు.

సంగీతానికి విస్తృత వేదిక కల్పించడం ద్వారా సాటి తెలుగు వారికి ఎంతో కొంత ఊరట కల్పించవచ్చునని భావించారు. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల పట్ల ఎనలేని అభిమానం ఉన్న ఆమె మన సంగీతాన్ని నేర్పించడం ద్వారా తెలుగు బాలబాలికల్లో భారతీయ విలువలను పాదుగొల్పవచ్చునని భావించారు.

2013లో సరస్వతీ మ్యూజిక్ అకాడమీని నెలకొల్పి తెలుగు బాలబాలికలకు,ఆసక్తి ఉన్న మహిళలకు స్వచ్చందంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. అమెరికాలోనే జన్మించి ఆ సంస్కృతీ సంప్రదాయాల్లో కొనసాగుతున్న పిల్లలు ఇంట్లో తెలుగు మాట్లాడగలరు కానీ చదవలేరు. దీంతో ఎంతో శ్రమకోర్చి వారికి నేర్పించే కృతుల పూర్వాపరాలను వాటి భావాలను, వాటిని సృష్టికర్తల ప్రాముఖ్యాన్ని ఇంగ్లీషులోనే వారికి అర్థమయ్యేలా వివరంగా నెమ్మదిగా సాధన చేయించసాగారు.

శ్రీమతి స్వాతి, శ్రీకాంత్ దంపతు శ్రమ వృథా కాలేదు. తెలుగులో పట్టులేకున్నా, ఆ పిల్లలు తొందరగానే సంగీతంలో పట్టు సాధించగలిగారు. ఇప్పటివరకూ వివిధ వయసుల్లోని 400మందికి స్వాతి దిగ్విజయంగా శిక్షణ ఇచ్చారు. తాను తీర్చిదిద్దిన శిష్యులతో కలిసి వివిధ వేదికల నుంచి గళార్చనలను నిర్వహిస్తూ బృందగానాలను ప్రోత్సహించారు. తానా, ఆటా, నాటా వంటి సంస్థల కార్యక్రమాలు, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా వంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో సంగీత ప్రదర్శనలను నిర్వహించి పలువురి ప్రశంసలను చూరగొన్నారు.

ప్రముఖ వాగ్గేయకారుల కీర్తనలతో పాటు తాతగారు వడ్డమాను వేంకటరామారావు గారు, శ్రీరామునిపై కట్టిన బాణీలనూ శ్రోతలకు వినిపిస్తున్నారు. తన సారథ్యంలోని సరస్వతి మ్యూజిక్ అకాడమీకి సిలికానాంధ్రకు చెందిన 'సంపద' సంస్థ గుర్తింపునూ పొందగలిగారు. హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న 'సంపద' ద్వారా విద్యార్థులకు అర్హత సర్టిఫికెట్టు అందిస్తున్నారు. ఈ రూపేణా తాను అందిస్తున్న శిక్షణకు ఒక ప్రామాణికతనూ చేకూర్చారు.

ఒక పక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో క్షణం తీరుబడి లేకున్నా భర్త శ్రీకాంత్ తో సహాయ సహాకారాల వల్లే సంగీత రంగంలోను కృషి చేయగలుగుతున్నానని శ్రీమతి స్వాతి కరి చెప్పారు. కుటుంబ సహాయ సహకారాలతో ప్రశాంతంగా తెలుగువారికి సంగీతం నేర్పించగలుగుతున్నారు.

తన ఈ కృషిల్లో అత్తమామలు కీ.శె.శ్రీమతి కరి పుష్పవల్లి, కీ.శె.డా.కరి వెంకటరత్నం పంతులు-తల్లిదండ్రులు శ్రీమతి సుబ్బలక్ష్మి, వడ్డమాను హనుమంతరావు గారితో పాటు సోదరుడు రవికిరణ్ దంపతులు, అండగా నిలిచారని స్వాతి చెప్పారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా యాజమాన్యం, తమ బావ గారు, తోడి కోడలు శ్రీమతి అరుణ మరియు రవి కరి ఇతర శ్రేయోభిలాషుల తోడ్పాటు మరువజాలమని అన్నారు.

ఎన్.వి.బి.సిలో అవకాశం:

స్వాతి సాగిస్తున్న ఈ నిర్విరామ కృషికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రోత్సహాం కూడా లభించింది. టీటీడీ వారి శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్.వి.బి.సి)లో నాద నీరాజనం కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం లభించింది. వాగ్గేయకార వైభవం పేరిట 11మంది సంగీత విద్వాంసుల కృతులను శ్రీమతి స్వాతితో కలిసి 25మంది ఆలపిస్తున్నారు. వీరిలో 17మంది బాలబాలికలు ఉన్నారు.

2017జులై 12వ తేదీ సాయంత్రం 6గం. ఎస్.వి.బి.సిలో ఈ కచేరీ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం కోసం వ్యయ ప్రయాసాల కోర్చి 18కుటుంబాలు అట్లాంటా నుంచి తెలుగు నేలకు తరలివచ్చాయి. కొన్ని నెలల ముందు నుంచే ఈ కుటుంబాలు వారిని సంప్రదిస్తూ వారి ప్రయాణ ఏర్పాట్ల దగ్గరినుంచి ప్రతీ విషయంపై శ్రద్దపెట్టి అమలుచేశారు శ్రీమతి స్వాతి.

సాక్షాత్తు ఏడుకొండల స్వామి ముంగిట పాడే మహద్భాగ్యం దక్కటం ఎంతో ఆనందం కలిగిస్తోందని స్వాతి చెప్పారు. భవిష్యత్తులో కూడా తెలుగువారి సహకారంతో సంగీతపరంగా మరిన్ని ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

సంప్రదించాల్సిన నంబరు: 9441811187

వడ్డమాను హనుమంతరావు

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Srimati Kari Swati, who is working as a software engineer in America, same time she is performing well as singer also
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more