వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్త్రీవాదంలో 'ప్రత్యేక' కథలు

By Staff
|
Google Oneindia TeluguNews

స్త్రీవాద కథారచయితల్లో గీతాంజలిది ప్రత్యేకమైన గొంతు. స్త్రీవాద రచయితలందరూ తమ తమ కథల్లో లైంగిక స్వేచ్ఛను, పట్నవాసం ప్రపంచంలో అసమానతలను, వైట్‌ కాలర్‌ ఉద్యోగాల్లో వేధింపులను తమ కథల్లో చిత్రికలు కడుతుంటే గీతాంజలి గ్రామీణ జీవితం నుంచి స్త్రీల జీవితాలను తన రచనల్లో విశ్లేంచే ప్రయత్నం చేస్తున్నారు. అదీ, అట్టడుగు వర్గాల స్త్రీల జీవితాలను తన కథల్లో ప్రతిబింబిస్తున్నారు. పల్లెల్లో జీవితాలు ధ్వంసమై పట్నం చేరిన అట్టడుగు స్త్రీల జీవితాలను ఆమె తన కథల్లో చిత్రీకరిస్తున్నారు. ఆమె ఇప్పటికి దాదాపు 20 కథలు రాసి వుంటారు. చాలా కథలు తెలంగాణ యాసలో నడుస్తాయి.

ఉదార, సరళీకృత ఆర్థిక విధానాల నేపధ్యంలో తెలంగాణ గ్రామ జీవితం విధ్వంసమవుతున్న తీరు గీతాంజలి కథల్లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పత్తిరైతుల ఆత్మహత్యలు, పల్లెలను పరిశ్రమలు కబ్జా చేయడం- వీటి పరిణామాలు ఆమె కథల్లో కనిపిస్తాయి. గీతాంజలి కథల్లో 'సంటిది' ఎన్నదగ్గ కథ. ఉన్న కొద్ది పొలం పత్తి వేసి, ఆ పత్తిని పురుగు కాటేస్తే, ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ రైతు కొడుకు, చిన్న కూతురు (సంటిది) పట్నం వచ్చేసి అతను కర్మాగారంలో రోజువారీ కూలిగానూ, ఆ సంటిది పది ఇళ్లల్లో బాసండ్లు తోమడం వంటి పాచి పనులు చేసే కూలిగానూ చేరుతారు. ఆ సంటిది పట్నంలో పడే యాతన, ఎదుర్కునే కష్టనష్టాలు ఈ కథలో చిత్రతమయ్యాయి. ఈ కథ చదువుతుంటే గుండె బరువెక్కుతుంది.

'కాటు' అట్టడుగు వర్గాల్లో కూడా స్త్రీపురుష అసమానతలు ఎలా వుంటాయో తెలియజేప్పే కథ. తాగుబోతు భర్త చేతిలో నానా హింసను అనుభవిస్తూ కూడా దాన్ని భరించే స్త్రీ కథ ఇది. వాడ్ని వదిలేయమని తల్లి ఎంత బతిమాలినా ఆ స్త్రీ వినకపోవడం కొంత ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. ఇది వాస్తవానికి దగ్గరగానూ వుంది.

ప్రయివేట్‌ పరిశ్రమలకు దేశం తలుపులు బార్లా తెరిచిన తర్వాత విచ్ఛిన్నమైన గ్రామం కథ 'కథ 2020'. అంతేకాదు, పట్టణ జీవితంలో చదువుకున్న వారు కెరీరజానికి వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకున్న తీరును కూడా గీతాంజలి ఈ కథలో చెప్పారు. నూతన పరిణామాలు ప్రజల జీవితాలను ధ్వంసం చేస్తున్న తీరుకు ఉత్తమ చిత్రీకరణ ఈ కథ.

'బిచ్చగాడు' కథ అమెరికా అప్పటి అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ హైదరాబాద్‌ సందర్శనను దృష్టిలో పెట్టుకుని రాసిన ప్రతీకాత్మకమైన కథ. రాష్ట్ర ప్రభుత్వం బిచ్చమెత్తుకుంటుందనే అభిప్రాయంతో రాసిన కథ. ఇది కూడా శక్తి వంతమైన కథ. ఒక స్త్రీ గ్రామంలో నీడనిచ్చే చెట్టును నరికేస్తుంటే ఆందోళన చెందే కథ 'నీడ'. పల్లెల్లో కూడా చెట్లను నరికేయడం మనం చూస్తూనే వున్నాం.

స్త్రీవాద దృక్కోణం నుండి ప్రస్తుత పరిణామాలను సమర్థవంతంగా గీతాంజలి లాగా రాసిన రచయితలు లేరనే చెప్పాలి. వైవిధ్యభరితమైన కథా వస్తువుతో స్త్రీ దృష్టి నుంచి రాసిన గీతాంజలి కథలు సమకాలీన పరిస్థితులను, పరిణామాలను తెలియజేస్తాయి. తెలంగాణలోని అట్టడుగు వర్గాల భాషను, యాసను, పలుబళ్లను పట్టుకుని శక్తివంతంగా కథలను మలిచారు గీతాంజలి. ఇంత వైవిధ్య భరితమైన జీవితాలను శిల్పనైపుణ్యంతో తీర్చి దిద్దడం చాలా అరుదైన విషయం. వృత్తిరీత్యా వైద్యరాలు అయిన గీతాంజలికి తన వద్దకు వచ్చే రోగులను పరిశీలించే గుణం స్వతహాగనే అబ్బి వుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X