• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అక్షరాలు రక్షగాఅభినయం!

By Staff
|

ఆ కుర్రాడి వయస్సు గట్టిగా ఆరేళ్ళుండదు. లోహితాస్యుడి వేషం కట్టి, డైలాగులూ పద్యాలు కంఠంతా పట్టి, గడగడా వప్పిస్తున్నాడు. అవతల సుప్రసిద్ధ నాటక రంగతార గూడూరు సావిత్రి చంద్రమతి వేషం వేస్తున్నారు. ఇక హరిశ్చంద్రుడెవరు ? ఇంకెవరు మన డీవీ సుబ్బారావుగారే! జాషువా రాసిన శ్మశానం పద్యాలనాయన (ప్రేక్షకుల) గుండెలు కరిగే రీతిలో ఆలపిస్తుండగా, ఈ లోహితాస్యుడు గూడూరు సావిత్రి భుజం మీద గుర్రుకొట్టి నిద్రలాగేశాడు. మళ్ళీ మెళుకువ తెప్పించడానికి పాపం ఆ ప్రముఖ నటులిద్దరూ పడరాని పాట్లు పడ్డారు. అలా హేమాహేమీల సాంగత్యంలో ఆ కుర్రాడి నాటకరంగ జీవితం మొదలయ్యింది. రెండు దశాబ్దాల తర్వాత అతగాడు ఒక నాటక రంగ ప్రతికకు సంపాదకుడు కావడంలో విడ్డూరమేమన్నా ఉందంటారా?

అతని పేరు పెద్ది రామారావు.

అతను సంపాదకుడుగా వెలువడుతున్న పత్రిక పేరు 'యవనిక'. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అనే కేంద్ర విశ్వవిద్యాలయంలో జూనియర్‌ రీసెర్చ్‌ఫెలోగా ఉంటూ పీహెచ్‌డీ కోసం పని చేస్తున్న రామారావు ఇతర రంగాల్లో సైతం 'కృషి' చేస్తున్నాడు. దూరదర్శన్‌లో చిరకాలంగా ప్రసారమవుతున్న మెగా డెయిలీ సీరియల్‌ ''రుతురాగాలు'' మాటల రచయితగా పెద్ది రామారావు పేరు తెలుగు ప్రేక్షకలోకానికి చిరపరిచితమైపోయింది.

నరసరావుపేటలో చదువుకునే రోజుల్లో రామారావు ఎస్‌ఎఫ్‌ఐ అనే వామపక్ష విద్యార్ధి సంస్థలో పని చేశాడు. రాజకీయంగా ఆ సంస్థ సన్నిహితంగా ఉండే సాంస్కృతిక సంస్థ ఆంధ్ర ప్రజానాట్య మండలి. నాటకరంగం మీద అభిరుచి ఉన్న రామారావు సహజంగానే ఆ సంస్థలో చేరి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఒక దశలో ప్రజానాట్య మండలికి పూర్తి కాలపు కార్యకర్తగా 'సేవ' చేయాలని కూడా అనుకున్నాడట. అయితే ఎమ్మేలో చేరే నాటికి రామారావు భావనా ప్రపంచం సరిహద్దులు విస్తృతమయ్యాయి. ''రాజకీయ పార్టీల సాంస్కృతిక కదలికలు చాలా పరిమితమయినవనిపించాయి. ఏ పార్టీ సంస్థలోనూ లేకుండా ఉంటేనే మంచిదనే కనువిప్పు కలిగింద''న్నాడు.

''రుతురాగాలు సీరియల్‌కి పని చేసే అవకాశం రావడం నా జీవితంలో పెద్ద మలుపు. మనకు ఎన్ని మంచి ఆలోచనలూ, ఆదర్శాలూ ఉన్నా, వీటికి వాస్తవరూపం ఇవ్వగలిగే అవకాశం కూడా దొరకాలి. రుతురాగాలు టీమ్‌లో చేరడం ద్వారా నాకది లభించినట్లయింద''న్నాడు రామారావు. ''కావాలనే ఈ సీరియల్‌ కథాక్రమంలో ప్రగాఢమైన భావావేశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. టెన్స్‌ మొమెంట్స్‌ను ట్యాప్‌ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను. అందుకోసం హ్యూమన్‌ బిహేవియర్‌ను అధ్యయనం చేస్తున్నాను. ఘన విజయం సాధించాననుకోవడం లేదు కానీ నాకు తృప్తికరంగానే ఉంది ఇంతవరకూ సాగిన ప్రయత్నం'' అన్నాడతను. ''ఈ అవకాశం ఫలితంగా నాకు స్వయంగా ఆర్ధికశక్తి ఏర్పడింది. దాని ఆసరాతోనే 'యవనిక' లాంటి ప్రయోగానికి తెగించగలిగాను. అలాగే నాటకరంగ దినోత్సవం నిర్వహణలోనూ, వర్క్‌షాప్స్‌ ఏర్పాటు చెయ్యడంలోనూ క్రియాశీలక పాత్ర వహించడం వెనక కూడా ఈ ఆర్ధికస్తోమత పని చేసిందనే అనుకుంటున్నా''నన్నాడు రామారావు.

కందుకూరి వీరేశలింగం ఆధునిక నాటకరంగానికి మూల పురుషుడు. ఆయన జన్మదినం - ఏప్రిల్‌ 16 - తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రకటించి జరిపించాలని అనేకమంది గతంలో సూచించారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ ఆ విషయం అందరిదృష్టికీ తీసుకురావడానికి మేం ప్రయత్నిస్తున్నాం. ఈ సంవత్సరం వినూత్నపద్ధతిలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి తెలుగు నాటకరంగ దినోత్సవం నిర్వహించాం. ఎనిమిదిచోట్ల ఇలా నాటకరంగ దినోత్సవాలు జరిగినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో రెండురోజుల వ్యవధిలో ఇరవై ప్రముఖ నాటకాల నుంచి ఒక్కో సన్నివేశం ప్రదర్శింపచేశాం. ఈ కార్యక్రమానికి మంచి ప్రతిస్పందన లభించింది. ఈ కృషిలో 'యవనిక' ప్రధాన పాత్ర నిర్వర్తించింది. మాకు అక్షరాలా మూడున్నర లక్షల రూపాయలు మాత్రమే ఖర్చయ్యా''యని నవ్వుతూ చెప్పాడు రామారావు.

''త్వరలో జాతీయస్థాయి నాటకోత్సవాలు ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా నాటకరంగంలో వస్తున్న మార్పులు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మా ఉద్దేశ''మని తెలిపాడు రామారావు. 'అందరూ నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాకి వెళ్ళలేరు కదా! దాన్నే హైదరాబాద్‌కి తరలించి తీసుకురావాలన్నది మా కోరిక'' అన్నాడతను. ''ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పాలి. నాటకరంగంమీద, దాన్ని అదుపు చేసే పెత్తందార్లమీదా, ప్రభుత్వ వ్యవస్థల మీదా ఎడతెగని ఫిర్యాదులు చేయడం కేవలం నిరర్ధకం. ఈ రంగానికి ఘోరమైన అన్యాయం జరిగిన వాస్తవం అందరికీ తెలుసు. చేతనైనంతలో దాన్ని సరిచెయ్యడానికి క్రియాశీలకంగా నిర్మాణాత్మకంగా పని చేయాలి తప్ప దుమ్మెత్తి పోయడం దండ''గంటాడు రామారావు.

''మా వరకు మేం 'యవనిక'లాంటి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాం. పేరిట ఒక వెబ్‌సైట్‌ కూడా ప్రారంభిస్తున్నాం. 600 చందాలు పోగుచేశాం. యవనిక పునాదిగా ప్రత్యామ్నాయ నాటక ఉద్యమాన్ని నిర్మించాలని ఆకాంక్షిస్తున్నా''మన్నాడతను.

''ఇదే పనిగా పెట్టుకుని పని చేస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చు కదా అంటున్నారు మిత్రులు కొందరు. అది నిజమే కానీ దానివల్ల చివరికి మిగిలేది అసంతృప్తి మాత్రమేనన్నది నా అభిప్రాయం. అలాంటి నిర్ణయం తీసుకోవడమంటే ప్రస్తుతం నాకు అందుబాటులోకి వచ్చిన ఆర్ధిక పుష్టిని కోల్పోవడానికి సిద్ధపడడమే. దానికి నేను తయారుగా లేను. యవనిక సంపాదకత్వంగానీ, నాటక రంగ కార్యకలాపాలు గానీ నాకు పూర్తి కాలపు వ్యాపకాలు కావు. అవి నా ప్రవృత్తిలో భాగమే కానీ వృత్తి కాబోవు. "Passion with Caution" అన్నది నా నినాదం. నా కెరియర్‌ రచన మాత్రమే''నని స్పష్టం చేశాడు రామారావు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more