వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్ధాంతాలు అన్నీమానవతకు మించినవి కావు

By Staff
|
Google Oneindia TeluguNews

బి.యస్‌. రాములు తాత్విక, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక రచనలు అనేకం చేశారు. కథలు, నవలలు రాశారు. సాహిత్య విమర్శ చేశారు. ఆయన విభిన్న పార్శ్వాలను, సేవలను అందించే ఆయన ఇంటర్వ్యూ-

మీ రచనా వ్యాసంగాన్ని ప్రభావితం చేసిన నేపథ్యం ఏమిటి?
బాల్యంలో చాలా కథలు వినేవాడిని. గ్రామీణ కళారూపాలు, అమ్మ చెప్పే కథలు సాహిత్యంపై ఆసక్తిని పెంచేవి. సుమారు 5వ తరగతి నుండి స్కూల్‌లో ఆటలపోటీలు, క్లాసు డెకొరేషన్‌ మొదలైనవాటిల్లో బహుమతులు వచ్చేవి. 'చందమామ', 'బాలమిత్ర' చదవడం ద్వారా ఒక గొప్ప ఊహాలోకం దృశ్యమానం అయ్యేది. మహాకవి భారవి గురించిన కత 'చందమామ'లో చదివిన తర్వాత రచనకు గొప్ప శక్తి ఉంటుందని, మనిషిని మారుస్తుందని ఒక విశ్వాసం కలిగింది. 9వ తరగతిలో పద్యలక్షణాలు విన్న తర్వాత పద్యరచన ప్రారంభించాను. ఇలా 1964లో 13,14 ఏళ్ల వయసులో నా రచన ప్రారంభమైంది. విద్యార్థిగా ఉన్నప్పుడే స్కూల్‌ మ్యాగజైన్‌లో, ఆనాటి పత్రికల్లో కొన్ని రచనలు అచ్చయ్యాయి. ముఖ్యంగా హైస్కూల్‌లో ఉపన్యాసాల పోటీల్లో, వ్యాసరచన పోటీల్లో బహుమతులు నన్ను ఆత్మవిశ్వాసంతో నిలబెట్టాయి. కాని ఆధునిక సాహిత్యంలో, ఆధునిక ప్రక్రియలను చేపట్టడానికి ఉపాధ్యాయుల శక్తి పరిమితం కావడం వల్ల, నేను స్వయంగా వాటిని నేర్చుకోవలసి వచ్చింది. అలా 1968లో మొదటి కథ 'బాలమిత్ర'లో అచ్చయింది.

మీ తాత్విక దృక్పథంతో వచ్చిన పరిణామాలను ఏయే చారిత్రక ఘటనలు, సన్నివేశాలు ప్రభావితం చేశాయి?
నేను మొదట ఆరెస్సెస్‌ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌)లో పని చేశాను. 1964 నుండి అందులో పాల్గొనేవాణ్ని. 1967 నుండి 1972 వరకు ముఖ్యశిక్షక్‌గా పనిచేశాను. మా మేనమామ బొంబాయి మిల్లు కార్మికునిగా పనిచేసి, ఇల్లు చేరాడు. ఆయన ఇంట్లో పురాణాలు మొదలైన గ్రంథాలు ఉండేవి. మా పెదనాన్న మిట్టపెల్లి రాజయ్య అచలతత్వయోగిగా పలు ప్రాంతాలు తిరిగేవాడు. ఆధ్యాత్మిక చర్చలు మా ఇళ్లలో కొన్ని పండుగల్లో గంటల తరబడి జరిగేవి. ముఖ్యంగా శుక్రవారం పూజ, చనిపోయిన తర్వాత చేసే కర్మల సందర్భాలలో ఇలాంటి చర్చలు జరిగేవి. 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వ్యాపారశాస్త్రం, అర్థశాస్త్రం, పౌరనీతి శాస్త్రం ఆప్షనల్స్‌గా చదివాను. 1964 నుంచి 1975 వరకు కొన్ని వేల గ్రంథాలు అన్ని ప్రక్రియల్లో చదివాను. 1964 నుండి పాఠ్యపుస్తకాల్లో అర్థశాస్త్రంలో మార్క్సిజం సమసమాజాన్ని కోరినట్లుగా ఉన్న పాఠాలు ఎంతో ప్రభావం చూపాయి. 1974లో మా తోడళ్లుడు కల్లూరి నారాయణ సాంగత్యం వల్ల ఆచరణాత్మకంగా వామపక్ష భావజాలంలోకి మారడం జరిగింది.

1977 నుండి విప్లవ ప్రజాసంఘాలలో, అంబేడ్కర్‌ సంఘాలలో, పౌర హక్కుల సంఘాలలో, విప్లవ రచయితల సంఘంలో ఏకకాలంలో పనిచేశాను. ఆ క్రమంలో 1984లో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తికాలం కార్యకర్తగా నక్సలైట్‌ సంస్థల్లో పని చేశాను. రాడికల్‌ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాను. అలా ఆచరణలో తిరిగి కులవివక్షత, కులసమస్య పరిష్కారం కోసం ఎదురైంది. ఇందువల్ల భగత్‌సింగ్‌లాగే అంబేడ్కర్‌ను సొంతం చేసుకొని కులసమస్యపై కూడా పని చేయాలని పార్టీని కోరాను. అప్పుడు పార్టీ నిరాకరించింది.

1990 ఏప్రిల్‌లో బహిరంగ జీవితంలోకి వచ్చాను. ప్రభుత్వం తిరిగి పాత ఉద్యోగం ఇచ్చింది. బహిరంగ జీవితంలోకి వచ్చాక నా అనుభవాలను, అధ్యయనాన్ని సమన్వయించి తాత్త్విక రంగంలో కృషి చేశాను. అలా గతితర్క తత్త్వదర్శన భూమిక, గతితర్కం - అంబేడ్కరిజం - మార్క్సిజం, బహుజనతత్వం, బిసిలు ఏం చేయాలి?, ప్రేమ అంటే ఏమిటి, భౌతికవాద ప్రాపంచిక దృక్పథం, జ్ఞానం పుట్టుక మొదలైన తాత్త్విక గ్రంథాలు రాశాను. భారతీయ సమాజం 'నేటి రాజకీయ, సామాజిక పరిణామాలు' పేరుతో భారతీయ, రాజకీయ, సామాజిక వ్యవస్థ పరిణామాలను గ్రంథస్తం చేశాను. 'సాహితీచరిత్రను కొత్తచూపుతో తిరగరాయాలి' అని యువకథకులు నాలాగా గైడెన్స్‌ లేకుండా ఉండకూడదని, వారి కోసం కథలబడి, కథాసాహిత్య అలంకారశాస్త్రం రాశాను. వందలాది సాహిత్య, సైద్ధాంతిక వ్యాసాలు, వేల ప్రసంగాలు చేశాను. అయితే అదంతా తెలుగుభాషకు పరిమితం కావడం బావిలో కప్పలా భావాలు ప్రపంచానికి చేరకుండా మిగిలిపోవడం బాధ కలిగిస్తున్నది. ఇంగ్లీషులోకి అనువాదమై, ప్రపంచ భావజాలంతో సంభాషించాలని ఉంది. ఇప్పటికీ ఆ కోరిక నెరవేరడం లేదు. నా రచనలు ఇంగ్లీషులోకి వచ్చినప్పుడే ప్రపంచం వాటి అవసరాన్ని గుర్తిస్తుందని భావిస్తున్నాను.

ఇలా నేను భాష కారణంగా, ప్రాంతం కారణంగా, మతం కారణంగా సర్వమానవ శ్రేయోభిలాషి నుండి హిందూవాదంలోకి, అటు తర్వాత పీడిత, పేదవర్గాల భావజాలంలోకి, అటు తర్వాత 'పేద కులాల శ్రేయస్సు అనే దృక్పథంలోకి పయనిస్తూ, అట్టడుగు ప్రజలను చేరుకొని సర్వమానవాళి అభివృద్ధికి ఇదే సరైన పునాది అని భావించడం జరిగింది. ఇలా తాత్త్విక దృక్పథాలు మారడంలో వ్యక్తిగత జీవితంలో ఆయా సంస్థల నుండి ఎదురైన చేదు అనుభవాలు కూడా కలిసి వున్నాయి. అలాంటి చేదు అనుభవాలు లేకపోయి ఉంటే, ఒక సంస్థ నుండి మరో సంస్థకు మారవలసిన అవసరం ఏర్పడకపోవచ్చు. అందువల్ల నా తాత్త్విక పరిణామంలో వ్యక్తిగత అనుభవాలు కూడా ప్రధాన పాత్ర వహించాయి. ఇవి కేవలం వ్యక్తిగత అనుభవాలు కావు. సత్యాన్వేషణలో భాగంగా సామాజిక చరిత్ర, పరిణామాల్లో భాగంగా జరిగిన పరిణామాలివి.

ఒక వైపు దళిత ఉద్యమంలోనూ, మరోవైపు తెలంగాణ అస్తిత్వ చైతన్యంలోను మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా, వీటి పట్ల మీ వైఖరి ఏమిటి?
నాకు మొదటి నుండి పేదల పక్షాన, పీడితుల పక్షాన ఆలోచించడం అలవాటైంది. స్వయంగా నేను కూడా పేదరికంలో పుట్టి పెరిగినవాణ్ని. బొంబాయి బట్టల మిల్లు కార్మికుడుగా పనిచేసిన మా నాన్న నా ఆరో ఏట చనిపోయాడు. అమ్మ జగిత్యాలలో బీడీలు చేసి మమ్ములను పెంచి పోషించింది. కనుక పేదల పక్షాన ఆలోచించడం జన్మతః అలవడింది. నా జీవితమంతా ఆ ఆచరణకే అంకితమైంది. విరసం నుండి 92లో వైదొలిగాను. దళిత ఉద్యమాన్ని, దాని భావజాలాన్ని విస్తరించడంలో భాగంగా దళిత రచయితల మేధావుల ఐక్యవేదికను 1992లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరి ఐక్యవేదిక. దీనికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇది రాష్ట్రంలో సాహిత్య చరిత్రను, సామాజిక ఉద్యమాల భావజాలాన్ని మలుపు తిప్పింది.

అలాగే తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో సంస్కృతి, సాహిత్య వికాసంలో ప్రత్యేక రాష్ట్రంగా ఉండటం అవసరమని గుర్తించడం జరిగింది. 1921లో మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వల్ల అపార్థాలు తొలగి అందరూ పోటీపడి అభివృద్ధి చెందడం సాధ్యపడుతుంది.

నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది - దూరంగా నిలబడ్డ తత్త్వవేత్తలాగా ఆయా విషయాల పట్ల ఎందుకు డిటాచ్‌మెంట్‌తో మాట్లాడలేకపోతున్నానని! బుద్ధునిలాగా, ఆచార్య నాగార్జునుడిలాగా నేను మధ్యేమార్గాన్ని ఎన్నుకొని తటస్థవాదిగా ఎందుకు చెప్పడం సాధ్యం కావడం లేదు అని బాధపడుతుంటాను. ఎక్కడ సమస్య వుంటే అక్కడ వారిలో ఒకడిగా కలిసిపోయే తత్త్వం అబ్బడం వల్ల, సామాజిక కార్యకర్తగా కూడా పనిచేయడం వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటున్నాను. దీనివల్ల నేను దళితవాదం గురించి మాట్లాడితే దళితుడ్ని అనుకుంటున్నారు. తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణవాదిని అనుకుంటున్నారు.

ఒక తత్త్వవేత్తపట్ల ఇలా ఆలోచించడం సరైంది కాదని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధాన మంత్రి అందరి సభలకు వెళ్తారు. వారి సమస్యల్ని పరిష్కరించడానికి హామీ ఇస్తారు. వారికి మద్దతు కూడా తెలుపుతారు. అయినంత మాత్రాన అతడు అందరి ప్రతినిధి కాకుండా పోతాడా? తత్త్వవేత్త కూడా సర్వమానవ శ్రేయస్సు కోరే మానవతావాదంలో భాగం కాని ఆయా ఉద్యమాలలో వాదాలను పట్టించుకొని మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మార్గదర్శనం చేయడం జరుగుతుంది. నా జీవితం అనుభవాలన్ని ఈ అంతస్సూత్రంతో ముడిపడి ఉన్నాయి.

వాదాలు, సిద్ధాంతాలు అన్నీ వాటికవే స్వతంత్రమైనవి కావు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం, ముందుకు సాగే క్రమంలో వారికి అందుబాటులో ఉన్న వాదాలను, సిద్ధాంతాలను స్వీకరిస్తారు. అనగా ఈ వాదాలు, సిద్ధాంతాలు ప్రజలు తొడుక్కునే డ్రెస్‌ల వంటివి. కాని వాటి ఆధారంగా సంస్థలు నిర్మించేవారు ప్రజలకు అవి ప్రాణం అని చెబుతున్నారు. ప్రాణశక్తి మనిషిలోనే ఉంది. అందువల్ల వాదాలు, సిద్ధాంతాలు అన్నీ మానవతకు మించినవి కావు. మానవతావాదిగా మాత్రమే నేను ఆయా సమస్యలను, సిద్ధాంతాలను చర్చిస్తున్నాను.

అభివృద్ధి, అధికారం, స్వేచ్ఛాసమానత్వం అందినవారికి,న అది అందాల్సినవారికి మధ్య వుండే అంతరం లేదా వైరుధ్యమే అన్నిటిలో కీలకాంశం. అదే పలు రూపాల్లోకి, ఉద్యమంలోకి, సిద్ధాంతంలోకి మారుతుంది. ఆధిపత్యంలో ఉన్నవాళ్లు ప్రేమపూరితంగా మొత్తం సమాజానికి అందించే కృషి చేస్తే సమాజం శాంతియుతంగా, ప్రేమపూరితంగా, కరుణార్ద్రంగా పరిణామం చెందుతుంది. ఈ క్రమాన్ని నిరాకరిస్తే ఘర్షణ, పోరాటం తలెత్తుతాయి. ఎలాగైనా అంతరాలు ఎప్పటికప్పుడు తొలగిస్తూ మెజారిటీ ప్రజలకు అభివృద్ధి, అధికారం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, చేయూత అందించకతప్పదు. భారత రాజ్యాంగం దీన్ని అనుమతిస్తున్నది. తన మౌలిక లక్ష్యం ఎప్పుడో ప్రకటించుకున్నది. అందువల్ల బుద్ధుడు చెప్పిన ప్రేమ, కరుణ, శాంతి, స్వేచ్ఛ, సమానత్వం విలువ ద్వారా శాంతియుత పరివర్తన సాధ్యమవుతుంది. అమెరికా, ఐరోపా దేశాల్లాగా, జపాన్‌లాగా భారతదేశం ప్రపంచంలో ఒక సంపన్న రాజ్యంగా ఎదుగుతుంది.

మీరు దళితోద్యమంలో విశాల ప్రాతిపదికతో పనిచేస్తున్నారని అంటారు. కాని పద్మశాలీలకు సంబంధించిన సమస్యలను మీరు పూర్తిగా పట్టించుకోలేదని కొందరి భావన. ఏమంటారు?
మన దేశంలోని కులవ్యవస్థవల్ల ఏదో ఒక కులంలో పుట్టక తప్పదు. అయితే ఆ కులస్వభావం వదులుకొని, మానవులుగా ఎదగడం ద్వారానే భారతదేశం ఒక సమష్టి సమాజంగా సామాజిక అసమానతలు లేని సమాజంగా ఎదగడం సాధ్యపడుతుంది. వామపక్ష భావజాలంతో ఉండటం వల్ల నేను పుట్టిన 'పద్మశాలి' కులం గురించి రాస్తే నన్ను కులతత్వవాదిగా ప్రచారం చేస్తారేమోననే సంకోచం ఉండేది. ఇప్పటికీ ఉంది. అయినప్పటికీ మీరు పేద పద్మశాలి కులంలో పుట్టి పేదకులస్థుల గురించి, వారి సంస్కృతిగురించి, అభ్యున్నతి గురించి మీరు రాయపోతే ఎవరు రాస్తారు, ఈ కులం గురించి తెలిసినవాళ్లు రాయకపోతే ఎవరు రాస్తారు, ఈ కులంలో పుట్టిన మేధావిగా, రచయితగా మిమ్ములను చూసి మేమెందుకు గర్వించాలి, గౌరవించాలి, ఈ పద్మశాలి సమాజానికి మీరు సాహిత్య, సైద్ధాంతిక రంగంలో ఇచ్చే మద్దతు ఏమీ లేనప్పుడు మీరు ఈ కులంలో పుట్టి ఏం ప్రయోజనం? అని సీరియస్‌గా చాలా చోట్ల చాలామంది నన్ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు జవాబులు నా దగ్గర లేవు. జవాబుగా కొన్ని కథలు, వ్యాసాలు రాశాను. అలా రాసిన తర్వాత నన్ను కులతత్త్వంలో కూరుకుపోయడాని అన్నవాళ్లు కూడా ఉన్నారు.

మీరు విశాల సాహిత్య సంస్థాపకులు. కథా శిక్షణాశిబిరాలు నిర్వహించారు. సాహితీ కథా పురస్కారాలను కూడా ఇచ్చారు. మీ పుస్తకాలను, ఇతరుల పుస్తకాలను ఎంతో అందంగా అచ్చు వేస్తున్నారు. వీటన్నింటికీ అవసరమయ్యే నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటున్నారు? నేను సుమారు 65 పుస్తకాల వరకు అచ్చేశాను. ఇందుంలో నేను రాసినవి 20 మాత్రమే. పాలు - సదువు, స్మృతి, మమతలు - మానవసంబంధాలు, వేపచెట్టు, తేనెటీగలు కథాసంపుటాలు వెలువరించాను. బతుకుపోరు నవల మూడవ ముద్రణ ఇటీవల వెలువడింది. పాలు - సదువు కథల సంపుటి దళితుల జీవితాల్లో గత నలబై యేళ్లలో విద్యవల్ల, ఉద్యమాల వల్ల వచ్చిన పరిణామాలను, వాళ్లు ఎదిగినతీరును, ఎదగలేకపోతున్న తీరు - ఒక సామాజిక చరిత్రను అందిస్తుంది. అలాగే స్మృతి కథల సంపుటి తెలంగాణలోని ముప్పై ఏళ్ల సామాజిక చరిత్రను, సంస్కృతిని, ఉద్యమాలను, వాటిని పరిణామాలను తెలుపుతుంది. మమతలు - మానవ సంబంధాలు కథల సంపుటి తెలంగాణలోని నూరేళ్ల సామాజిక సంబంధాలను, మానవ సంబంధాలను, కుటుంబ సంబంధాలను అవి మారుతున్న తీరును చిత్రించింది. వేపచెట్టు కథల సంపుటి గ్లోబలైజేషన్‌ వల్ల కలుగుతున్న లాభనష్టాలను కథల రూపంగా సామాజిక పరిణామాల రూపంలో చిత్రించింది. తేనెటీగలు కథల సంపుటి విప్లవ పోరాటాలు, వాటి పరిణామాలు, నిర్బంధాలు, మారుతున్న సమాజాన్ని చిత్రించింది. బతుకు పయనం కథల సంపుటిని చేనేత కులాల జీవిత పరిణామాలను ఒక క్రమపద్ధతిలో తెలిపే విధంగా తీసుకురావాలని వుంది.

తెలంగాణ వేల ఏళ్ల చరిత్ర గురించి తెలంగాణ తల్లి ఎరుక గ్రంథాన్ని వెలువరించాను. 50వ జన్మదినం సందర్భంగా వెలువరించాల్సిన సావనీర్‌ను 56వ జన్మదినం సంందర్భంగా ఇటీవల వెలువరించారు. సావనీర్‌లకు భిన్నంగా ఇందులో ఎలాంటి వ్యాపార ప్రకటనలు లేకుండా తీసుకురావడం జరిగింది. 50వ జన్మదినం నుండి పెద్ద ఎత్తున సాహిత్య సదస్సులు నిర్వహిస్తున్నాను. కరీంనగర్‌ జిల్లాలో యువరచయితలకు స్ఫూర్తినివ్వడానికి ప్రారంభమైన ఈ సదస్సులు రాష్ట్రవ్యాప్తంగా స్ఫూర్తినివ్వడం సంతోషాన్ని కలిగించింది.

దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్య వేదిక తరఫున చేయాలనుకున్న కార్యక్రమాలు దాని నిర్మాణరూపం రీత్యా చేయలేకపోయాను. అందువల్ల 1990లో ప్రచురణ సంస్థగా ప్రారంభమైన విశాలసాహితిని 1995 నుండి సాహిత్య సంస్థగా విస్తరించాను. కష్టనష్టాలకు ఓర్చి పుస్తకాలను తీసుకురావడం, సభలు, సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మా పెద్దబ్బాయి అమెరికా వెళ్లడం వల్ల పిల్లల చదువులకు అతనే ఖర్చు పెడుతున్నాడు. దాంతో నేను నా జీతాన్ని సభలకు, పుస్తకాలకు ఖర్చు పెట్టాను. అతను "నేను కష్టపడి పంపిస్తే ఇలా ఖర్చు చేస్తారా?' అని పంపడం మానేశాడు. ఆ తర్వాత నేను 'నా ఆస్తుల మీద ఆశపడకండి' అని పిల్లలకు చెప్పాను. అలా నా ఆస్తులను అమ్మేసి ఆ వచ్చిన డబ్బును ఖర్చు పెడుతూ వస్తున్నాను. అయితే ఈ విషయం తెలియనివాళ్లు ' ఆయనకేం కొడుకు పంపిస్తున్నాడు' అని అంటుంటారు. పరోపకారం చేయలేని వాళ్లు దానిని చేసేవారిని భరించడం కూడా కష్టమైన కాలంలోకి వచ్చేశబుూం. ఏ స్వార్థం లేకపోతే ఎందుకు చేస్తారు? అనేది వారి ప్రశ్న. ఆ ప్రశ్న వారి స్వార్థాన్ని, సంకుచిత స్వభావాన్ని తెలియజేస్తుంది. నాకు సాహిత్య వైతాళికులైన ప్రేమ్‌చంద్‌, గోర్కి, వట్టికోట ఆళ్వారుస్వామి ఆదర్శం. యువతరానికి చేయూతనీయడమే వారి నుంచి పొందిన స్ఫూర్తి. పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? ఎవరైనా పోయేటప్పుడు ఏం తీసుకుపోతారు? ఇక్కడ బూడిద కావడం తప్ప.

ఈ బతుకు పొద్దు పడమటికి వంగిపోయింది. జీవిత చరమాంకం ఇంకా ఎంతో దూరంలో లేదు. ఆరోగ్యం బాగున్నప్పుడే చేతనైనంత చేయాలని సంకల్పం. అయితే అమ్మడానికి ఇప్పుడు ఆస్తులేమీ లేవు. ఇక నుంచి ఇతరులు సహకరిస్తే¬నే ముందుకు పోవడం సాధ్యం. పుస్తకాలు వేయడం సాధ్యం. ఇప్పటికి రాసింది చాలా తక్కువ, రాయాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఒక ప్రేమ్‌చంద్‌లా, ఠాగూర్‌లా తెలుగు సమాజాన్ని దాని సమస్త పరిణామాలను కథలుగా, నవలలుగా చిత్రించాలని ఉంది. అందుకోసం జీవితంలోని పూర్తి కాలాన్ని అంకితం చేయాలని సంకల్పం. రెండేళ్లుగా విరివిగా రాయడం ఇందువల్లే సాధ్యపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X