వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట పెళుసు - మంచి మనసు

By Staff
|
Google Oneindia TeluguNews

''గుంటూరు అరండల్‌పేటలో ఇప్పుడున్న ఓవర్‌బ్రిడ్జి లేనప్పటిమాట. స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజుల్లో అరండల్‌పేట రైలు కట్టకు ఆనుకుని ఉన్న ఖాళీస్థలంలో గుంటూరులోని ఇంటిల్‌ జెంటిల్మెన్‌ అంతా వచ్చి చేరేవాళ్ళు. దాన్ని నా రెండో విశ్వవిద్యాలయంగా నేను పరిగణిస్తాను. చాగంటి వెంకటశేషశాస్త్రి - వెంచాశా అనే పేరుతో రాసేవాడు. ఆ సభకి మహారాజపోషకుడు. అప్పట్లో ఆయన ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్‌గా ఉండేవాడు. మంచి కథలు చాలా రాశాడు. మారుపేరుతో రేరాణి, అభిసారిక లాంటి ప్రతికలకు సైతం రాసేవాడని చెప్పుకునేవాళ్ళు. కృష్ణసోమయాజులని ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో పనిచేసే ఆయన ఒకతనుండేవాడు. ఆయన కూడా ప్రధానంగా సాహిత్యోపజీవే. అందరికన్నా ముందొచ్చి గేట్లు తీయించేవాడు. అటుతర్వాత నెమ్మదిగా పిల్లలమర్రి హనుమంతరావు, వావిలాల సోమయాజులు, ఓరుగంటి నీలకంఠశాస్త్రి, జమ్మలమడక మాధవరామశర్మ, వేదాలతిరు వెంగళాచార్యులు, తెలికిచర్ల వెంకటరత్నం, ధనకుధరం వెంకటాచార్యులు, ముదిగొండ వీరభద్రమూర్తి, శ్రీరామకవచం వెంకటేశ్వరశాస్త్రి లాంటి వాళ్లు వస్తుండేవాళ్ళు. త్రిశిరోమణి -తర్కవ్యాకరణ అలంకారాస్త్రాల్లో శిరోమణి - తాండవ కృష్ణమాచార్యులు కూడా వచ్చేవారు. ఒక్క మాటలో చెబితే మా గురువుగారయిన పల్లె పూర్ణప్రజ్ఞాచార్యులు గారు తప్ప ఆనాటి గుంటూరు పండిత జనమండలమంతా సాయంకాలానికి రైలు కట్ట దగ్గరికి చేరేవాళ్ళు. శనాదివారాల్లో జంధ్యాల పాపయ్యశాస్త్రి తప్పకుండా వచ్చేవారు. ఈ సమావేశాల్లో 'సూపర్‌స్టార్‌' గుర్రం జాషువా'' అని వివరించారు బూదరాజు. 'కుందుర్తి, పోలూరి ఆంజనేయప్రసాద్‌, నీలంరాజు లక్ష్మీప్రసాద్‌ (ప్రనీల్‌) లాంటి కుర్రకారుతో కలిసి ఉండేవాళ్లం మేం. అప్పుడప్పుడు అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు కూడా వస్తుండేవాళ్ళు. సుడిగాలిలా విరుచుకుపడుతుండేవాడు - శిష్‌ట్లా ఉమామహేశ. అతగాడు వచ్చినరోజు బూతుల పంచాంగమే. దాదాపు అందరితోనూ కలబడి కొట్టుకునేంతవరకూ వెళ్ళేది కథ'' అంటూ నెమరేసుకున్నారు బూదరాజు. ''నేను రాసిన 'గతస్మృతి', 'ఆటుపోట్లు' లాంటి పద్యాలు జాషువాకి బాగా నచ్చాయి. అంతకుమించి, అన్నం నీళ్ళు లెక్క చెయ్యకుండా కవిత్వం రాయడం ఆయనకి మరింత నచ్చింది. దాంతో ఒకనాడు తొక్కుడు హార్మనీ సహకారంతో ఈ పద్యాలు పబ్లిక్‌గా రెండర్‌ చేశాడు కూడా. చుట్టూ చేరిన జనానికి ఆ పద్యాలు తనవి కావనీ, నేను రాసినవనీ పదేపదే చెప్పాడాయన - ఎందుకోమరి!'' అంటూ బూదరాజు గారు ఆశ్చర్యం ప్రకటించారు. ''అటుతర్వాత నేను కడుపు కట్టుకుని మూడువందలు కూడబెట్టి ఈ పద్యాలన్నింటినీ 'అశ్రుధారలు' పుస్తకంగా వెయ్యడానికి నన్ను ప్రేరేపించి పుణ్యం కట్టుకున్నవాడు జాషువాయే!'' అంటారాయన. తనకి మూడేళ్ళపాటు చెళ్ళపిళ్ళ స్మారక పద్యరచన పోటీల్లో వరసగా బహుమతులొచ్చిన విషయాన్నాయన మర్చిపోలేదు. అయితే 1951లో కృష్ణాపత్రికలో 'తాటస్థ్యము' శీర్షికతో కొన్ని పద్యాలు అచ్చువేసిన కాటూరి వెంకటేశ్వరరావుగారు - నూటపదార్లు రెమ్యూనరేషన్‌గా పంపిస్తూ రాసిన ఉత్తరమే తనలోని పద్యరచనాసక్తిని సమాధి చేసిందని బూదరాజు ఆరోపించారు (!). ''ఈ రచనలో చూపించిన స్థాయికి తీసిపోని రీతిలో నీ మిగతారచనలు కూడా ఉండా''లని కాటూరి వారు నిర్దేశించారట. ఆ నిర్దేశమే తన రచనాసక్తికి కళ్లెం వేసిందని బూదరాజు భావిస్తున్నారు.

''నేను 1950లో థర్డ్‌ ఆనర్స్‌ చదవడానికి విశాఖపట్నం వెళ్ళాను. లైబ్రరీ బలహీనత నన్ను తిన్నగా విశ్వవిద్యాలయ గ్రంథాలయం వైపు నడిపించింది. ఇంకా క్లాసులు మొదలుకాలేదు. లైబ్రరీలోని తెలుగు పుస్తకాలు ఒకసారి తిరగేశాను. సంస్కృత గ్రంథాల వైపు మళ్ళాను. జగన్నాథ పండితరాయలు 'రసగంగాధరం' కనిపించింది. అది తీసుకోబోతుండగా మా సీనియర్‌ నాయని కృష్ణకుమారి వచ్చి తనక్కూడా అదే పుస్తకం కావాలన్నారు. అక్కడితో ఆగక రస గంగాధరం నాకు అర్ధం కాదన్నట్టు మాట్టాడారు. దాంతో నాకు చిర్రెత్తి గొంతు పెంచి మాట్లాడాను. అదుగో అప్పుడే అబ్బూరి రామకృష్ణారావుగారి దృష్టిలో పడ్డాను. అదే అబ్బూరి మేష్టారిని తొలిసారి కలవడం'' అంటూ తన మూడో యూనివర్శిటీ జీవిత వివరాలు తెలిపారు బూదరాజు. ''లైబ్రరీ టైమ్‌ అయిపోయాక అబ్బూరి మేష్టారు నన్ను వెంటపెట్టుకుని చినవాల్తేరు వైపు తీసుకెళ్ళారు. పోలీసు స్టేషను పక్కన తడికలు పెట్టిన చిన్న ఇల్లులాంటిదేదో ఉంది. అక్కడ కాసేపు కూచోబెట్టి మాట్లాడారు. నా ఆసక్తి, అభినివేశం లాంటి వాటిని విచారించారు. అప్పట్లో భారతిలో 'విపరిణామం' అనే శీర్షికతోనూ పద్యాలు కొన్ని అచ్చయ్యాయి. పాపయ్యశాస్త్రి పద్యాలకు ప్రతిధ్వనులవి. భారతివాళ్ళు అర్ధనూటపదార్లు పారితోషికం కూడా పంపారు. అబ్బూరి మేష్టారు ఆ పద్యాలు చూశారు. చదివి వినిపించమన్నారు. ఆ తర్వాత ''అబ్బాయి - నువ్వు అవధానాలకి పనికిరావు. ఆశుకవిత్వం చెప్పగలవే తప్ప రాగచ్ఛాయల్లో పద్యం పాడి వినిపించే కళ నీకు అబ్బలేదు. నీలాంటివాడికి అవధానం అచ్చిరాదు'' అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు ''చూడు నాయనా! ఇవేళ ఆంధ్రదేశంలో వేలాదిమంది కవులున్నారు. నీలా ప్రామాణిక కవిత్వం చెబుతున్నవాళ్ళు వందలాదిమందున్నారు. వాళ్ళలో మొదటి పదిమందిలోనయినా నువ్వుంటావని గ్యారంటీ లేదు. నా మాట విని విమర్శవైపు మళ్ళించు నీ శక్తిసామర్ధ్యాలు. మరీ ముఖ్యంగా భాషా పరిశోధన దిశగా కృషి ప్రారంభించు. అప్పుడే నీ శక్తియుక్తులు ప్రయోజనకరంగా ఉపయోగపడగల''వని అబ్బూరి మేష్టారు హితవు చెప్పారు. నా జీవితాన్ని ఆయన అలా మలుపు తిప్పారు'' అంటారు బూదరాజు.

''మా గురువుగారు దువ్వూరి వెంకటరమణశాస్త్రి. ఆయన గురువు వజ్ఝల చిన సీతారామస్వామిశాస్త్రి. ''ద్రావిడ భాషాసామ్యములు''లాంటి ప్రామాణిక గ్రంథాలెన్నో రాశారు. నేను రీసెర్చ్‌ చేస్తున్న రోజులవి. ఆయన హఠాత్తుగా కోమాలోకి వెళ్ళిపోయారు. కెజిహెచ్‌లో చేర్చారు. కండిషన్‌ చాలా క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. స్పృహ వచ్చి ఇరవయినాలుగు గంటలు ఉంటే ప్రమాదం తప్పినట్లేనన్నారు డాక్టర్లు. అంతలో వజ్ఝలవారికి స్మారకం వచ్చింది. మా గురువుగారు వెళ్ళి దగ్గిరగా కూర్చుని 'మేష్టారూ! నన్ను గుర్తు పట్టారా?'' అంటూ పలకరించారు. ''రమణా!'' అన్నారు శాస్త్రిగారు. మేమందరం ఊపిరిపీల్చుకున్నాం. ''ఈ అహోబల పండితుడున్నాడే...'' అంటూ ఏదో చెప్పబోయి ఠక్కున కన్ను మూశారు వజ్ఝలవారు. అదే ఆయన జీవితానికి ఆఖరు. చిట్టచివరి నిమిషంవరకూ ఆయనకి ఒకటే యావ. అదీ ఒక పరిశోధకుడికి ఉండాల్సిన టెనాసిటీ - డెడికేషన్‌. నాకు నిస్పృహ కలిగినా, నీరసం వచ్చినా ఒక్కసారి ఈ ఘట్టం జ్ఞాపకం చేసుకుంటాను. జవజీవాలు పుంజుకుంటాయి వాటంతటవే! వాళ్ళు మహానుభావులు - మనమెంతవాళ్ళ ముందు?!'' అంటూ వినయం ప్రకటించారు బూదరాజు రాధాకృష్ణ.

అయిదారు దశాబ్దాల కాలంగా తెలుగు సామాజిక జీవనంలో వచ్చిన మార్పుల గురించి ప్రత్యక్ష సాక్షి కథనం లాంటి రచన ఒకటి చెయ్యాలని ఉందన్నారు బూదరాజు. ''నేను పెద్దల దగ్గరనుంచి ముఖ్యంగా మా తాతయ్య నుంచి ఎన్నో విషయాలు విని తెలుసుకున్నాను. అనేక విషయాలు కళ్ళారా చూశాను. అన్నీ కలిపి ''విన్నంత - కన్నంత'' అనే శీర్షికన అక్షరబద్ధం చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇది పాఠకులకు అందించే మార్గం గురించి ఆలోచిస్తున్నా''నన్నారు బూదరాజు రాధాకృష్ణ. చదవడం - రాయడం అంటే ఆయనకి మోజు ఏమాత్రం తగ్గలేదు. గిడుగు రామ్మూర్తి రచనలకు ప్రామాణికమైన రెండు అనువాదాలు అందించిన బూదరాజు ఆ దిశగా ఇంకా ఎంతో కృషి మిగిలే ఉందని హెచ్చరిస్తున్నారు. నిఘంటు నిర్మాణం రంగంలో తెలుగువాడు వెనకబడి వుండడం రాధాకృష్ణగారికి హృదయశల్యంగా వుంది. మనవాళ్ళ భాషాశాస్త్ర పరిశోధన కూడా దారిద్ర్యరేఖకి దిగువన కొట్టుమిట్టాడడం ఆయనకు ఆవేదన కలిగిస్తుంది. ఆ దిశగా యువతరం ఏదైనా కృషి చేస్తే బాగుండునని బూదరాజు కోరుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X