• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'ధర్మ' ఆగ్రహం-'అధర్మ'అసహనం

By Staff
|

డి.ఆర్‌.ఇంద్ర పెద్ద కథ 'రావణజోస్యం' మీద మరోసారి మన రాష్ట్రంలో చర్చ మొదలయింది. సీనియర్‌ సాహిత్యవేత్త సి.ధర్మారావు ఈ చర్చకు తెరతీశారు. విజయవాడనుంచి వచ్చే 'నడుస్తున్న చరిత్ర' అనే మాసపత్రికకు ఆయన గౌరవ సంపాదకులు. ఆ పత్రికలో ప్రతి నెలా 'రవ్వలూ-పువ్వులూ' పేరిట ఒక కాలమ్‌ కూడా రాస్తుంటారాయన. ఈ పత్రిక జూన్‌ సంచికలో ధర్మారావుగారు 'జాతి ఆత్మహత్యాయత్నాలు' శీర్షికన ఒక విమర్శ రాస్తూ ''రచయితల గొంతు నొక్కటం కంటె జాతికి మరొక ఆత్మహత్యా ప్రయత్నం అక్కర్లే''దని వ్యాఖ్యానించారు (పేజీ 12). రావణజోస్యం ప్రచురణను ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఆపు చేయించినవారిని ధర్మారావుగారు దౌర్జన్యకారులుగా గుర్తించారు. దుండగులుగా పేర్కొన్నారు. 'కల్లుతాగిన కోతుల'ని నిరసించారు. 'ఆంధ్రజ్యోతి' వారపత్రిక సంపాదకుడిమీద దాడి చేసి, పత్రికలు చించి, టెలిఫోన్‌ తీగలు తెంచిన యాభైమంది స్త్రీ పురుషులను ధర్మారావుగారు అరాచక 'తండా'గా పేర్కొని విమర్శించారు. వారి చర్య 'అనాగరిక'మైనదన్నారు. ఈ 'అవాంఛనీయ ధోరణు'ల ను అనుసరించి వారికి అధికార పక్షాలు గట్టిగా బుద్ధి చెప్పాలని కూడా పిలుపిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో 'చిక్కుకున్న సమస్య - పత్రికా స్వేచ్ఛ కంటె ఎక్కువగా రచనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ' అని ధర్మారావుగారు భావించారు.

అయితే ధర్మారావుగారి భావాలకు తీవ్రంగా ప్రతిస్పందించిన 'నడుస్తున్న చరిత్ర' పాఠకుల్లో ఒక్కరు కూడా వాటిని ఆమోదించకపోవడం గమనార్హం. ధర్మారావుగారితో పాటు 'నడుస్తున్న చరిత్ర' కాలమిస్టు కూడా అయిన డా. వడ్డి విజయసారధితో పాటు మొత్తం పధ్నాలుగుమంది తమ అభిప్రాయాలు తెలియచేశారు. ''అదృష్టమో దురదృష్టమో ఈరోజుల్లో హిందువుల్లో ఆత్మరక్షణ ధోరణులు పెరగడంతో వాళ్ళూ తిరగబడుతున్నా''రని రాసిన పి.రత్నకుమారి, 'రావణజోస్యం' పెద్ద కథను ''స్త్రీవాద ఉద్యమాలకు సహకరించని తిక్క రచనగా''గా పరిగణించారు. ''హేతువాదాన్ని, అభ్యుదయమార్గాన్ని హిందూ సమాజం ఎప్పుడూ స్వాగతిస్తూనే ఉంది. అయినా ప్రాచీనమైన ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఆరాధించుతున్న గ్రంధాల్ని, వ్యక్తుల్ని లేదా పాత్రల్ని చీల్చి చెండాడితే ఈ సమాజం సహించ''దని రత్నకుమారి హెచ్చరించారు. ఆవిడ దృష్టిలో హేతువాదం, అభ్యుదయమార్గం లాంటి భావాలకు అర్ధమేమిటో.

వాటికి మెజారిటీ ప్రజల ఆరాధనతో సంబంధమేమిటో తెలిస్తే తప్ప రత్నకుమారి గారి అభిప్రాయం స్పష్టంగా బోధపడే అవకాశం లేదు. ''ఈ దేశపు పూర్వుల్ని, పురాణపాత్రల్ని అడ్డగోలుగా విమర్శిస్తే సహించేరోజులు పోయాయని రావణజోస్యం రచయిత, ఆయనను సమర్ధిస్తున్న వారూ గ్రహించా''ల్సిందిగా కె.వెంకటరామయ్య హెచ్చరించారు. ఈ హెచ్చరిక చెయ్యడానికి ముందు, ''మూర్ఖపు మతధోరణుల్ని కాక, స్వేచ్ఛాయుత మతభావాల వ్యాప్తిని ఆమోదించిన దేశం ఇది'' అని భారతదేశం గురించి (లేదా హిందూదేశం గురించి) వెంకటరామయ్యగారు అభివర్ణించారు. స్వేచ్ఛాయుత భావాల వ్యాప్తిని ఆమోదించడానికీ, 'నామిని'పై దాడి చేసి, రావణజోస్యం ప్రచురణను ఆపించడానికీ పొత్తెలా కుదురుతుందో వెంకటరామయ్యగారే వివరించాలి.

నడుస్తున్న చరిత్ర పత్రికలో పూర్తి పేజీ సైజులో ఉత్తరాలు రాసిన వాళ్ళు అయిదుగురున్నారు. వీళ్లు వాడిన భాష, పరిభాష - ఆశ్రయించిన తర్కం - చేసిన ఉటంకింపులు చూస్తే వీళ్లు సంఘపరివార ప్రచార కార్యకలాపాల్లో తగినంత అనుభవం ఉన్న యోధులేనని స్పష్టమవుతోంది. '' ఆంధ్రప్రభ పత్రిక కమ్యూనిస్టు వ్యతిరేక పంథాలో పేజీలు నింపేస్తున్నప్పుడు విజయవాడలో కమ్యూనిస్టులనేవారు ప్రెస్‌ను నడవనీయకుండా చేసినప్పుడు'', మరో ప్రెస్‌లో ఆంధ్రప్రభను ముద్రించడానికి చేసిన ప్రయత్నాలను సాయుధంగా అడ్డుకున్నప్పుడు 'ప్రచురణ స్వేచ్ఛ గురించి, రచనాస్వేచ్ఛ గురించి సెర్మన్స్‌ ఇవ్వ'నందుకు ఎం.సాయిరాం, ధర్మారావుగారి లాంటి ఉదార స్వభావులను తప్పెన్నుతున్నారు. ఈ సంఘటన జరిగి ఏ యాభయ్యేళ్ళయిందో మరి. ఇప్పుడు వాదానికి ఉపయోగపడింది. అలాగే అప్పుడెప్పుడో ఆంధ్రపత్రికలో మహమ్మద్‌ ప్రవక్త బొమ్మ వేసినందుకు, 'స్వాతి'లో సెటానిక్‌ వర్సెస్‌ అనువాదం ప్రచురించినందుకు, ఎన్టీఆర్‌ను మహ్మద్‌గా ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్‌ చిత్రీకరించినందుకు నిరసనగా 'వందలాదిమంది ముస్లింలు దాడి చెయ్యడం' గురించి సాయిరాంగారు ఓపికగా ప్రస్తావించారు. అప్పుడేం మాట్లాడని ధర్మారావుగారిలాంటి మౌనులంతా ఇప్పుడు ధర్మబోధలు చేయడాన్ని ఆయన తీవ్రస్వరంతో ఖండించారు. అంతా చేసిన తర్వాత, '' రావణజోస్యం కథను నిలిపి వేయించిన సందర్భంగా తెలుగు నాట రచయితలు, మేధావులు రచనాస్వాతంత్ర్యం గురించి ముక్తకంఠంతో ఉద్యమించడం స్వాగతించదగినదే''నని సాయిరాం వ్యాఖ్యానించడం విడ్డూరంగా వుంది. అయితే, తెలుగు రచయితలు మేధావులు ఒక కమిటీగా ఏర్పడి, 'ఏ రచయితా, ఏ పత్రికా

క్షమాపణలు చెప్పాల్సిన అవసరం' రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఉచిత సలహా ఒకటి ఇచ్చారు. అలాంటి అవసరం రాకుండా 'చర్యలు' తీసుకోవలసింది అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో వున్న పాలకులు. సాయిరాంగారు తమ అభిప్రాయాలను వారికి తెలియచేస్తే కొంత ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. పొరపాటు ధోరణిని వేలెత్తిచూపించిన పాపానికి ధర్మారావుగారి లాంటి పెద్ద మనుషుల మీద తమ వ్యంగ్య విభవాన్ని వృధా చెయ్యడం వల్ల లాభమేమిటి?

''సృజన, ప్రజాసాహితి, అరుణతార' వంటి 'నస్మరంతి పత్రికలు లేదా ముద్రాంకితాలు వేసుకున్న పత్రికల''లో రావణజోస్యం కథ వచ్చి ఉంటే 'ఈ గొడవే వచ్చి ఉండేది కాదేమో!' అంటున్నారు తులసి సూర్యప్రకాష్‌. ఈయన లెక్కప్రకారం రచయిత స్వేచ్ఛ, రచనాస్వేచ్ఛ, ప్రచురణ స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ లాంటివి ఆ రచనను అచ్చువేస్తున్నది పాప్యులర్‌ పత్రికా, లేక జాగృతి, ఆర్గనైజర్‌ లాటి నస్మరంతి పత్రికా అనే విషయంతో ముడిపడి ఉంటుంది. రెండో తరహా పత్రికలయితే పట్టించుకోనక్కర్లేదని కూడా ఆయన అభిప్రాయమేమో - స్పష్టంగా లేదు! సూర్యప్రకాష్‌ ఒక చిత్రమయిన వాదం కూడా మన ముందుంచారు. స్వేచ్ఛ ఒక్క ఇంద్రకేనా? వాల్మీకికి లేదా? అన్నది ఆయన ప్రశ్న. ''వాల్మీకి మన మధ్య లేడు గాబట్టి, రామాయణానికి - వాల్మీకికి రచనాస్వేచ్ఛ లుప్తమై పోతుందా?'' అని ఆయన నిలదీస్తున్నారు.అయితే, ఆయనే 'రామాయణంలో వేళ్ళూనుకున్న ప్రస్తుత సామాజిక వ్యవస్థలోని దోషాలను పరిహరించడానికి కోటి వ్యూహాలు పన్నవచ్చు'నని లైసెన్స్‌ ఇవ్వడం గమనార్హం. వాల్మీకి రామాయణాన్ని విమర్శించకుండా, అందులో వేళ్ళూనుకుని ఉన్న సామాజిక వ్యవస్థను మెరుగుపర్చుకోవడం ఎలా సాధ్యమో అర్ధం కావడం లేదు. నిజంగానే రామాయణం ఒక కావ్యమనే స్పృహ మనకి ఉన్నట్లయితే ఇంతగా హర్ట్‌ కావలసిన అవసరం లేదు. అలా కాకుండా దానికి పవిత్రత, ప్రశ్నాతీతత్వం ఆపాదించినప్పుడే ఇలాంటి ప్రతిస్పందనలు - వైల్డ్‌ అండ్‌ వయొలెంట్‌ రియాక్షన్స్‌ వస్తుంటాయి. పూర్తి పేజీ లేఖ రాసేందుకు ఓపికగా నడుంకట్టిన సూర్యప్రకాష్‌ ఇంత చిన్న - సంస్కార సంబంధమయిన విషయంలో ఓర్పు ప్రదర్శించలేకపోవడం దురదృష్టం.

''ఆలయాల విధ్వంసం, విగ్రహాలను ముక్కలు చెయ్యడం, స్త్రీలను చెరబట్టడం, విద్యాలయాలు, గ్రంధాలు తగులబెట్టడం - ఇవన్నీ రాజ్యవిస్తరణ కోసం కాదు, హిందువుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టడం కోసం చేసా''రని శృంగవరపు వెంకటరావు ఆరోపించారు.

బౌద్ధుల, జైనుల మతస్థలాలనూ, రచనలనూ, ఆలయాలనూ, మతాలనూ ధ్వంసం చేశారు కదా 'హిందువులు' - అవి ఏ ప్రయోజనం కోసం జరిగాయంటారు? నాగార్జున సాగర్‌లోని, అమరావతిలోని శిధిలాలను చూస్తే తెలుస్తుంది - బొటనవేలు పరిమాణంలో కూడా బుద్ధుడి తలకాయని అభయహస్తముద్రను వదలకుండా చెక్కి పారేసిన 'మతాభినివేశం' ఏ మతస్థులదో!! గురివిందగింజ చందంగా రెచ్చిపోవడం ఎవరికీ శోభించదు. కమ్యూనిజాన్ని 'ట్వెంటీ ఫస్ట్‌ సెంచురీస్‌ ఇస్లామ్‌'గా అభివర్ణించారు పాశ్చాత్య సామాజిక శాస్త్రవేత్తలు. నిజానికి వాళ్ళను ఇప్పటికీ 'భల్లూక స్వప్నం' తరిమి కొడుతూనే ఉంది. ఆ భయంలోంచి పుట్టుకువచ్చిందే ఈ సూత్రీకరణ కూడా. వెంకటరావుగారికి పశ్చిమ దేశాల పండితులు ప్రచారం చేసిన ఆర్యద్రావిడ భావన పనికి రాలేదు. ''ఈ దేశం ఒక ధర్మ సత్రం'' అన్న ప్రచారమూ నచ్చలేదు. కానీ, కమ్యూనిస్టుల మీద విసిరిన అస్త్రాలు మాత్రం పనికొచ్చాయి!! రావణజోస్యం కథను 'హిందూ సంస్కృతి పట్ల విద్వేషం నిలువెల్లా నిండిన వ్యక్తి ఉగ్గబట్టలేక చేసిన విష వమనం'గా అభివర్ణించడాన్ని చూస్తే ఆయన అసహనం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.

''దేశంలో బ్రాహ్మలు, రెడ్లు, యాదవులు, జాట్‌లు, కుర్మీలు ఉన్నారు. ఇంకా తెలుగువాళ్ళు, తమిళులు, కన్నడిగులు, మరాఠీలు ఉన్నారు. ఇంకా కేరళీయులు, గుజరాతీలు, పంజాబీలు, బెంగాలీలు వున్నారు. ఇంకా కాంగ్రెస్‌ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, భాజపా, బసపాలు వున్నారు. ఇంకా క్రిస్టియన్లు, ముస్లింలు, సాయిబాబా భక్తులు, శైవులు, వైష్ణవులున్నారు. కానీ హిందువులు అనబడే శాల్తీలు ఎక్కడైనా వున్నారా అసలు?'' అని ప్రశ్నిస్తున్నారు సి.హెచ్‌.ప్రవీణ్‌కుమార్‌. కంచె ఐలయ్యని అడగాల్సిన ప్రశ్న ధర్మారావుగారినడిగితే ఆయనేం చెబుతారు? 'ఏకపక్ష సూక్తిముక్తావళు'ల మీద విరుచుకుపడిన ప్రవీణ్‌కుమార్‌, 'హిందువునని చెప్పుకోడానికే సిగ్గుపడే పరిస్థితు'లున్నాయనీ, అందుకే హిందువులు మౌనం వహిస్తున్నారనీ వాదించారు. నిజానికి, ధర్మారావు గారిలాంటి ఉదారవాదుల్ని బజారుకీడ్చి, ఓపరాని ఓపిక లేనితనం ప్రదర్శించినట్లయితేనే అది హిందువులకు సిగ్గుచేటుగా పరిణమిస్తుంది తప్ప సహనం, విశాల దృష్టి ప్రదర్శిస్తే కాదు.

''భారత రామాయణాలను తిట్టి పోస్తే, హిందూ సంస్కృతీ సంప్రదాయాలను దెబ్బతీస్తే, హిందువుల హృదయాంతరంగాలను శూన్యం చేస్తే ఆ శూన్యాన్ని ఆక్రమించుకునేదెవరు? కమ్యూనిస్టులు మాత్రం కాదు! ఆ లాభం పొందుతున్నది క్రైస్తవ మిషనరీలే!'' అన్నారు జి.శ్రీనివాసరెడ్డి. ఈ మొత్తం వివాదాన్ని మత మార్పిడులు అనే అంశానికి పరిమితం చేసి చర్చించడం శ్రీనివాసరెడ్డిగారి ప్రత్యేకత. 'త్రిపురలో మతం మారని తెగలవారిని తరిమికొడుతున్నట్టుగా ఇక్కడకూడా కొందరిని తన్ని తరిమేయనంతవరకే ఈ జిజ్ఞాసువులు, విముక్తికారులకు గౌరవాదరాలు దక్కేది'' అన్న హెచ్చరిక చూస్తే రెడ్డిగారి ఆలోచన తీరుతెన్నులు అర్ధమవుతాయి. ఇంతా చేసి 'రావణజోస్యం కథ ఒక్కటే గొప్ప చెరుపు చేసేంతటి ఎఫెక్టివ్‌ కథ' కాదంటున్నారు శ్రీనివాసరెడ్డి. ''అది తీగయితే, ఇది డొంక!'' అని ఓ విడ్డూరమయిన వాదన లేవదీసి ఊరుకున్నారు.

ఈ మొత్తం లేఖల్లో ముఖ్యమైనవిగా చెప్పాల్సినవి రెండున్నాయి. మొదటిది యం.శివరామకృష్ణ రాసిన 'స్వేచ్ఛా, చట్టుబండలా... దమ్మున్నవాడిదే రాజ్యం' అనే లేఖ; రెండోది పి.మాణిక్యాలరావు రాసిన 'రావణజోస్యంపై దాడి చేసిన వారి తెలివితేటలు' అనే లేఖ. ఈ రెండూ కాకుండా మరో అయిదు చిన్నలేఖలు కూడా ప్రచురితమయ్యాయి.

''డి.ఆర్‌.ఇంద్రకు దమ్ముంది కాబట్టి రామాయణాన్ని అడ్డంగా ఏకుతూ కథ రాసి పారేశారు. నామినికి దమ్ముంది కాబట్టి తన చేతిలో ఉన్న పత్రికలో ఆ కథను నిరభ్యంతరంగా అచ్చుగుద్ది పారేశాడు. అది నచ్చనివాళ్ళకు కూడా దమ్ముంది కాబట్టి ఆంధ్రజ్యోతి పత్రిక మీదకు దూసుకుపోయి నరఘోష పెట్టారు'' అంటున్నారు శివరామకృష్ణ. ''కాస్తంత కరసేవ చేసే ఉంటా''రనే విశ్వాసం కూడా ప్రదర్శించారు. ఈ దమ్మున్న లేఖకుడికి ప్రపంచంలో ఎవడు ఏం చేసినా తప్పులేదు, వాడికి దమ్ముంటే! ''నామినిది పిరికి గుండె కాయ! కాకపోతే ఈ పిచ్చికథ ఎలా వేశావయ్యా అని మంది నిలదీయగానే , గుండె లబ్బు-డబ్బు స్పీడు పెరిగి, 'సారీ! నేను చూడకుండా వేసేశాను' అనేవాడు కాదు'' అన్నది ఓ విచిత్ర తర్కం. ''నేను రామభక్తుణ్ణేనని బుడిబుడి ఏడుపులు ఏడ్చా''డని శివరామకృష్ణ నామినిని నిరసించడం విడ్డూరంగా ఉంది. ''రావణజోస్యం ఆపేయడం వలన మతోన్మాదం ముంచుకొస్తోందని, తాలిబాన్‌ రాజ్యం వచ్చేస్తుందని ఏడ్పులూ పెడబొబ్బలూ పెడుతున్నవాళ్ళు దమ్ముంటే ఆ తాలిబాన్లను పట్టుకొని ఆర్‌టిసి క్రాస్‌రోడ్‌లో నిలబెట్టి వీరబాదుడు బాది...''ఉండాల్సిందని ఈ లేఖకుడు సూచించారు. సాహిత్య, సంస్కార వివాదాల పరిష్కారానికి 'దమ్మున్న' మార్గం సూచించినందుకు ఆయన్ను అభినందించాల్సిందే. మన పాఠకుల సంస్కార ప్రమాణాలు ఏ స్థాయికి చేరుకున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి ఇలాంటి లేఖలు ఉపయోగపడతాయి.

ఇక ''రావణజోస్యం పైకి వీరావేశంతో దూసుకుపోయి, కథ ప్రచురణ ఆపుచేయించిన వాళ్ళు'' తగినంత హోమ్‌వర్క్‌ చెయ్యనందుకు, మధ్యలోనే ఆవేశం తగ్గించుకున్నందుకూ మాణిక్యాలరావుగారు అభ్యంతరం తెలియచేస్తున్నారు. ఆ కథను 'లెఫ్ట్‌-రైట్‌ బ్రెయిన్లు మిక్సయి పోయిన ఓ గందరగోళపు రచయిత చేసుకున్న వాంతి''గా అభివర్ణించారు రావుగారు. ''దానికి అవసరమైన ప్రచారం తెచ్చిపెట్టిన పాపం, దాని ప్రచురణను ఆపించిన''వారికే అంటగడుతున్నారాయన! రావుగారి ఆవేదనంతా ఒక్కటే - రావణజోస్యం నిరసన 'క్లాసికల్‌ మెథడ్‌'లో జరగలేదన్నదే. అయితే ఆయన మరీ అంతగా నిరుత్సాహపడిపోవడం లేదు. ''దీనితో మునిగిపోయిందేమీ లేదు. భవిష్యత్‌లో ఇట్లాంటి సందర్భాలనేకం వస్తా''యని ఆయన తనను తాను ఓదార్చుకుని ఇతరులనూ ఓదారుస్తున్నారు. అయితే అందుకు ఆయన చెబుతున్న కారణమే చిత్రంగా ఉంది. ''చరిత్ర గతిని ఎవ్వరూ ఆపజాలరు. వైవిధ్యాలను ఎవ్వరైనా చక్కగా బ్లెండ్‌ చెయ్యవచ్చు. కానీ వైరుధ్యాలున్నప్పుడు క్లాష్‌ తప్పదు. ఎక్కడో ఒకచోట ఢీ కొనకా తప్పదు. ఇందుకు సిద్ధంగా ఉండండి మరి'' అని పిలుపిస్తున్నారాయన. 'రావణజోస్యం' కథ మీద వచ్చిన విచిత్రమయిన జోస్యం ఈ లేఖ. ఈ ఒక్క లేఖ చదివితే చాలు - ధర్మారావుగారు ఎందుకంత ఆవేదన చెందవలసి వచ్చిందో అర్ధమవుతుంది. ''అసహనం మరింత అసహనానికే జన్మనిస్తుం''దన్నాడో మహానుభావుడు. 'రావణజోస్యం' పట్ల అసహనం ఏ విషప్పురుగును పుట్టించనుందోనన్న భయాందోళనలు సవ్యంగా ఆలోచించే తెలుగువాళ్ళందరినీ ఆవహించడం సహజమే. అందుకే కె.ఎన్‌.వై.పతంజలి లాంటి పరిణత మేధావి ''ఒకటో నంబరు ప్రమాదసూచిక'' ఎగరేసి తెలుగు రచయితలనూ, పాఠకులనూ,మొత్తంతెలుగుజాతినీ, హెచ్చరించారు. ఈ హెచ్చరిక ఏ గంగలోనో గోదాట్లోనో కలిసిపోకుండా జాగ్రత్త తీసుకోవడం, స్పృహ ఉన్న ప్రతి తెలుగు వాడి కర్తవ్యం. సి.ధర్మారావు గారి లాంటి పెద్దలు జాతి అభ్యున్నతికి సూచన చేసి, పశ్చాత్తాపపడాల్సిన దుర్గతి రాకుండా చూసుకోవడం - పరివార ప్రచారయోధులతో సహా ప్రతి ఒక్కరి బాధ్యత. అన్నిటికీ మించి 'రావణజోస్యం' రాసిన డి.ఆర్‌.ఇంద్ర, దాన్ని ప్రచురించిన రామభక్త హనుమాన్‌ నామినినాయుడు బిట్టర్‌నెస్‌ పెంచుకోకుండా చూడడం సాహిత్యప్రియుల కనీస కర్తవ్యం. 'నడుస్తున్న చరిత్ర' పత్రిక మన రాష్ట్రలో నెలకొని ఉన్న ఈ అత్యవసర పరిస్థితిని అందరి దృష్టికీ తీసుకొచ్చి చరిత్రాత్మక పాత్ర నిర్వర్తించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more