వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథలుప్రాంతీయ జీవనాడి: యన్‌. గోపి

By Staff
|
Google Oneindia TeluguNews

కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. గోపిని ప్రముఖ కథారచయిత కాలువ మల్లయ్య ఇంటర్వ్యూ చేశారు. 'తంగెడుపూలు'తో మొదలైన గోపి కవితా రచన నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. వేమనపై గోపి విశేష పరిశోధన చేశారు. ఈ పరిశోధనతో ఆయనపేరు 'వేమన' గోపిగా ప్రసిద్ధికెక్కింది.

ఇతర ప్రాంతాల విమర్శకులు తెలంగాణ కథకు చేసినదైమైనా ఉందా? వుంటే అది ఏ మేరకు?
ఇతర ప్రాంతాల విమర్శకులు మాత్రమే కాదు, ఏ ప్రాంత విమర్శకులేనా కథను పెద్దగా పట్టించుకోలేదు. కవిత్వంపై వచ్చిన విమర్శ కథలపై రాలేదు. తెలంగాణ కథ అనే భావం (కాన్సెప్ట్‌) ఇటీవలిది. తెలంగాణ కథలనే అభిప్రాయంతో ఆంధ్ర ప్రాంత విమర్శకులు వివక్షకు గురిచేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు.

తెలంగాణ దళిత కథ గురించి మీరేమంటారు?
దళిత సాహిత్యం కూడా ఇటీవలిదే. అఖిలాంధ్ర సన్నివేశంలో దళిత కథలు రావడం సంతోషం. తెలంగాణ సన్నివేశంలో అయితే ఇంకా సంతోషం. తెలంగాణ దళిత సాహిత్యం మరీ ప్రత్యేకమైనది. ఇతర ప్రాంతాలవాళ్లు ఊహించలేనంత దుర్భరమైనది తెలంగాణ దళితుల జీవితం. తెలంగాణ ప్రాంతంలో అట్టడుగు దళితులంటే మాదిగలే. ఆంధ్రప్రాంతంలో అత్యధిక శాతం మాలలు. కాబట్టి ఇద్దరి చైతన్యస్థాయిని ఒకే గాటన కట్టలేం. వారు బ్రిటిష్‌ పాలన కింద చైతన్యం పొందినవారు. వీరు ఫ్యూడల్‌ ఉక్కుపాదాల కింద నలిగిపోయినవారు. కాబట్టి ఏ ప్రాంత దళిత చైతన్యాన్నయినా ఈ దృష్టితో చూడాల్సి వుంటుంది. కాబట్టి దళిత కాన్సెప్ట్‌తో కథలు ఇంకా బహుళంగా రావాలి. బోయ జంగయ్య, కాలువ మల్లయ్య, బి.యస్‌. రాములు వంటి ప్రముఖ రచయితలు ఈ ఉద్యమం కన్నా ముందే రాసినా యువరచయితలు ఇంకా లోతుల్లోకి వెళ్లి మరిన్ని వాస్తవాలను బయట పెట్టవలసి వుంది.

తెలుగు కథాసాహిత్యంలో తెలంగాణ కథకుల పాత్ర ఏమిటి?
ఇక్కడ తెలంగాణ అనగానే ఇతర ప్రాంతాలవాళ్లు ఉలిక్కిపడనవసరం లేదు. పందొమ్మిది వందల యాభైలో అభ్యుదయ రచయితల సంఘం సమావేశంలో శ్రీశ్రీ తెలంగాణ రచయితలు తెలంగాణ జీవితాలను ప్రతిబింబించడం లేదని బాధపడ్డారు. ఆనాటి బాధకు ఫలితం ఇప్పటికి కానీ విస్తృత రూపంలో లభించలేదు. దాశరథి రంగాచార్య ఉద్యమాన్ని గురించి ఉద్యమానంతర కాలంలో రచనలు చేశాడు. వట్టికోట ఆళ్వారుస్వామి కూడా అంతే..అయితే వీళ్ల సాహిత్యంలో మాండలికం పాత్రోచిత భాష వరకే పరిమితమైంది. పూర్తి స్థాయి తెలంగాణ మాండలికాన్ని కోస్తా పత్రికలు ఆదరించలేదు. కళింగాంధ్ర రచయితలను ప్రోత్సహించడానికి మాండలికం అడ్డు రాలేదు. దీనికి కారణం ఏమిటంటే కోస్తా జిల్లాల వాళ్లు తెలంగాణ మాండలికంలో ప్రవేశించే ప్రయత్నం చేయలేదు. కారణాలు అన్వేషించాలి. ఇప్పటి యువరచయితల పాత్ర ఏమిటంటే ఇతర ప్రాంతాల కన్నా ప్రత్యేకంగా ఉండి తెలంగాణా ప్రాంతానికే పరిమితమైన పరిస్థితులను చిత్రించారు. తెలంగాణ సాంస్కృతిక ముద్రను, భావ విధానాన్ని విశాల ప్రపంచానికి చాటి చెప్పారు.

తెలంగాణ కథకు పత్రికలు ఇస్తున్న ప్రోత్సాహం ఏమిటి?
దీన్ని గురించి మీరే బాగా చెప్పగలరు. మీకు అనుభవం బాగానే వున్నట్టుంది. తెలంగాణ కథను ఒక కోటా కింద ప్రోత్సహించే కథలుగా కాకుండా ఒక ప్రాంతం జీవనాడిని ధ్వనింపజేసే కథలుగా ప్రచురించాలి.

వివిధ సాహిత్యోద్యమాలు కథపై చూపిన ప్రభావం ఏమిటి?
తెలంగాణలో ఉద్యమాలకు పోరాటాలకు వేరువేరు అర్థాలున్నాయి. నాకు మొదట్నుంచీ ఒక అభిప్రాయం ఉంది. తెలంగాణ రచయితలు తెలంగాణ పోరాటాన్ని చిత్రించినంతగా తెలంగాణ జీవితాన్ని చిత్రించలేదని.... బి.యస్‌. రాములు, సాహు, అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య, రఘోత్తమరెడ్డి బాగా చిత్రించారు. విస్తృతమైన అర్థంలో తెలంగాణ రైతాంగ పోరాటమే ఒక ఉద్యమం.. ఆ ఉద్యమం అనంతరం ఆచరణ రూపాలు వివిధ పోరాటాలు.

కథల్లో మాండలిక భాషా ప్రయోగం గురించి మీరేమంటారు?
అందరూ తమ తమ మాండలికాలను రాస్తే అది ఒక సామాన్య తెలుగుగా ఆవిర్భవిస్తుంది. అప్పుడే మూడు ప్రాంతాలవారికి ఒక భావానుబంధం ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయవాదులు ప్రాంతాలను చీలుస్తారు. రచయితలు కలుపుతారు. మాండలికం సజీవమైంది. శిష్ట వ్యవహారికం అనే మాట కోస్తా జిల్లాల ఆధిపత్యాన్ని సూచించేది. అందరూ రాస్తున్నది ఒక రకంగా వారివారి మాండలికమే. మాది ఎక్కువ ప్రామాణికమని దబాయిస్తారు. ఈ దబాయింపులో ఇతర మాండలికాల అణచివేత ఉంది. అన్ని మాండలికాలను కలిపి ఒక కొత్త పానీయాన్ని తయారు చేద్దాం రండి. అది తేనెలా వుంటుదో, వగరుగా వుంటుందో కాలమే చెబుతుంది.

తొలి, మలి, తర్వాతి తరంలో తెలంగాణ కథపై విశేష ప్రభావం చూపిన కథకుల గురించి వివరిస్తారా?

తొలితరంలో సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావులాంటి వాళ్లు ప్రభావం చూపారు. మళ్లీ మలితరంలో కొంత గ్యాప్‌ ఏర్పడింది. డైబ్బైల వరకు దాదాపు శూన్యమే. తర్వాత సరికొత్త అనుభవాలతో, వినూత్న దృష్టితో, వాస్తవికతా లోతులతో ప్రాంతీయ స్పృహతో కథలు వచ్చాయి. ఈ తరం రచయితల జాబితా ఇవ్వనక్కర్లేదనుకుంటాను. డెబ్బైలలో మొదలు పెట్టి ఇప్పటికీ నిరంతరం రాస్తున్నవాళ్లే వీళ్లంతా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X