• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాఠకులు- రచయితలు

By Staff
|

చూసే వాళ్లు లేని నాటాక ప్రదర్శనాన్ని ఊహించుకోలేనట్లే, పాఠకులు లేని రచయితను ఊహించలేము. ఆనందమో, ఉద్వేగమో కలిగినప్పుడు రచయిత మనస్సు స్పందిస్తుంది. ఆ స్పందనమే అతణ్ని రచనకు పురికొల్పుతుంది. ఆ స్పందన గుణమే ఆది కాలం నుంచి మానవునికి బ్రతుకు మీద, బ్రతుకులోని కమ్మదనం మీద ఆసక్తిని, విశ్వాసాన్ని కలిగిస్తూన్నది. ఈ స్పందనానికి దేశంతో కాని, కాలంతో కాని, ఒక ప్రత్యేక సిద్ధాంతంతో కాని సంబంధం అంతగా వుండదు. ఆకాశంలో మేఘాలు అనేక రూపాలతో మనకు కన్పిస్తూంటాయి. ఏ పక్షంలో ఏ మేఘం ఏ రూపం దాలుస్తుందో మనం చెప్పలేము. ఆ విధంగానే మనిషి ఊహా స్వరూపాన్ని అది బహిర్గతమయ్యే వరకు కనగొనలేము. దేశకాల పరిస్థితుల ప్రభావం మనిషిపై ఉంటుందన్న మాట వాస్తవమే అయినా అతని ఊహలెల్లప్పుడూ వీటికి అతీతంగానే ఉంటాయి. అలా ఉన్నప్పుడే అవి ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తాయి.

పాఠకులు అందుకోలేని ఆనందాన్ని రచయిత సృష్టిస్తే అది రచనా పరిధిలోనికి రాదు. పాఠకులందరూ ఆ రచనా స్థాయికి సరిపోయిన సంస్కారం కలిగి ఉన్నప్పుడే అది సాధ్యం. మరి ఈ సంస్కారం వివిధంగా ఉంటుంది- కనుక ఒక రకమైన రచయిత పాఠకులందరికీ సమానమైన అనుభూతిని కలిగించలేడు. రచయితకు కూడా కొన్ని ఆటంకాలున్నాయి. అతడు జన సామాన్యంలోనికి తన రచనల ద్వారా చొచ్చుకొని పోవటానికి వాళ్ల ఆలోచనా పరిధులను, మనస్తత్వాలను, దైనందిన జీవిత వృత్తాంతాలను అర్థం చేసుకోవలసి వుంటుంది. ఈ మాత్రపు సంస్కారం కలం పట్టినవానికి ఉండి తీరవలసిందే. ఆ పైన తాను చెప్పదలచుకొన్నది చెప్పినప్పుడు అతణ్ని అనుసరించటానికి పాఠకులకు క్లేశం ఉండదు.

నాటికీ నేటికీ ప్రాయకంగా అక్షరాస్యులే పాఠకులు. చదువుతుండగా విని, లేక చెప్పుతుండగా విని విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునే వారినీ, రసాస్వాదనం చేసేవారిని మనము పాఠకుల కోవలోనికి చేర్చుకొనవచ్చును. ప్రాచీన కాలం నుంచి నిన్న మొన్నటి దాకా మన దేశంలో అక్షరాస్యుల సంఖ్య తక్కువ. ఆనాడు హరికథా పురాణ కాలక్షేపాల మూలంగా, బొమ్మలాటల మూలంగా, పెద్దల వల్ల అనేక విషయాలు తెలుసుకునేవారు. ఆనందం పొందేవారు. మరి పుస్తకాలను ఉపయోగించుకొనేవారికి పాండిత్యం, సంస్కారం ఉండేవి. తమకు కావలసిన పుస్తకాలను తిరిగి వ్రాసుకొని, చదువుకొనేవారు. అంతేకాని జన బాహుళ్యానికి పుస్తకాలు అందుబాటులో వుండేవి కావు. కులవృత్తికి సంబంధించిన అనేక విషయాలు పరంపరాగతంగా పైతృకంగా లభించేవి. కనుక ఆయా విషయాలను చదువుకోవలసిన అవసరం వుండేది కాదు. పుస్తకాల అవసరం లేకుండానే అనేక విషయాలను తెల్సుకునే అవకాశం సహజంగా, దైనందిన జీవనంలో, సామూహికంగా జీవనంలో ఆయాచితంగా లభిస్తుండేవి.

నాటి సమాజంలోని ప్రతి ఆలోచనకు మతం, ధర్మం ప్రాతిపదిక అయ్యేవి. ప్రతి విషయాన్ని ధర్మ దృష్టితో పరిశీలించే గుణం రచయితలకు సంప్రదాయం వల్ల అబ్బేది. కనుకనే నాటి రచయిత ఏది వ్రాసినా ధర్మ దృక్పథాన్ని దృష్టిలో వుంచుకొని వ్రాసేవాడు. అందు చేతే నాటి కాలంలో రచన ఒక ఆరాధాన విశేషంగా పరిగణింపబడింది. వారి రచనల్లో కళాదృష్టి గౌణమే గాని ప్రధానం కాదు. తమకు ఒక వేళ నాటి ప్రజల ఆలోచనలకు అతీతమైన భావం కలిగినా దాన్ని కుదించి సంప్రదాయపు మూసలలో పోసి బయలుపరిచేవారు. ఎందుకంటే రచనకు ఉద్దేశ్యం ఉదేశమే. విశ్వ శ్రేయస్సు కావ్యానికి లక్ష్యమని వాళ్ల ఉద్దేశ్యం. నాటికీ నేటికీ ఇంచు మించు ఇదే దృష్టి రచయితకు వుండి తీరాలని ప్రాచీన లాక్షణికులు, నేటి విమర్శకులు పేర్కొంటున్నారు. మతం ప్రభావం ఉన్నన్నాళ్లు శ్రేయస్సు స్వరూపం అదే నిర్ణయించేది. కాని ఇప్పుడు దాని ప్రాబల్యం తగ్గిపోవడం వల్ల శ్రేయస్సుకు రాజకీయ సిద్ధాంతాలే అప్పటికప్పుడు రూపకల్పన చేస్తున్నయి. ఈ రాజకీయ సిద్ధాంతాలలో వైవిధ్యమే కాదు, పరస్పర వైరుధ్యం కూడా ఉన్నది. వైజ్ఞానిక, సాంకేతిక శాస్త్రాభివృద్ధి వల్ల నేటి ప్రపంచంలోని దేశాలు పొరుగిండ్లుగాను, మహాసాగరాలు చిన్న చిన్న సరస్సుల్లాగా కన్పిస్తున్నాయి. ప్రపంచాన్నంతా తమ గుప్పిట్లో వుంచుకోగలమనే అహంకారంతో ఈనాడు కొన్ని శక్తులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాయి. కాని మరో ప్రక్క ప్రపంచమంతా ఒక్కటేనని, మానవులంతా ఒక్కటేనని, మానవుని కష్టసుఖాల స్వరూపం ఒక్కటేననే భావాలు కూడా శక్తిని పుంజుకుంటున్నాయి. మానవాత్మ ఎప్పుడూ లేనంత వ్యాప్తంగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నది. నేటి రచయితలు ఈ మార్పును గమనించాలి. గడిచిన కాలం, దాని విలువలు చాలా గొప్పవని ఇప్పుడవి నశిస్తున్నాయని వాపోవడం కంటె మేదావియైన రచయిత నేటి పరిస్థితులను పరిశీలించాలి. ఇది స్థూలంగా రచయితల బాధ్యత. కాని హృదయమున్న రచయిత పొట్టకూటి కోసం వ్రాయని రచయిత అన్ని కాలాల్లోనూ ఉన్నాడు. అతనికి అన్యాయమని తోచిన విషయాన్ని గొంతెత్తి చాటాడు. అతని గొంతు నొక్కటానికి ప్రయత్నాలు జరిగాయి. కాని వాడు చచ్చి బ్రతుకుతున్నాడు. దీనికి కారణం అతని హృదయం. ఏ రాజకీయ సిద్ధాంతాలకు లొంగని మనస్సు స్పందించి కళాసృష్టికి పూనుకుంటుంది. శత్రువు రక్తాన్ని చూచినా, మిత్రుని రక్తాన్ని చూచినా గాయపడే హృదయం ఉన్నప్పుడే రచయిత కళాసృష్టిగా మనగలడు. లోకం పోకడను బట్టి తన రచనలను మలచుకొనేవాడు అతి సామాన్యుడైన రచయిత. పోకడలు మారగానే ఆ రచనకు విలువ నశిస్తుంది.

సూక్ష్మంగా పరిశీలిస్తే రచయిత బాధ్యతలు అనే మాట అచ్చమైన కళాసృష్టికి గొడ్డలిపెట్టు వంటిది. తనకు తోచిన, తన మనస్సును కదిపిన, తన మెదడును ఊహాధీనం చేసిన సంఘటనను నిర్భయంగా చాటగలిగినప్పుడే రచయిత సత్యాన్ని ప్రకటించగలుగుతాడు. మరి ఆ సత్యాలు కటువుగాను తోచవచ్చు. తీయగాను తోచవచ్చు. కాలానికి విరుద్ధంగాను తోచవచ్చు. అనుకూలంగాను తోచవచ్చు. ఆ మాత్రం స్వేచ్ఛ రచయితకు వుండాలి. అది లేనప్పుడు రచనలు వార్తాపత్రికలుగా, పంచాంగాలుగా, దస్తావేజులుగా మారే ప్రమాదముంది. ప్రజాస్వామ్యం మీద నమ్మకమున్న సమాజంలో రచయితలకున్న ఈ స్వేచ్ఛను గుర్తించాలి, రక్షించాలి.

ఇప్పుడు మహారచయితలుగా, క్రాంతదర్శులుగా, వైతాళికులుగా ఆరాధింపబడుతున్న రచయితలందరూ, ఒక కాలంలో కాలానికి, సంఘానికి, కరడుగట్టిన సంప్రదాయాలకు ఎదురు తిరిగినవారే.

ముద్రణా సౌకర్యాలు అధికంగా పెరిగిన ఈ రోజుల్లో రచయితలకు స్వేచ్ఛ వుంటే వాళ్ల భావాలు, పుస్తకాల ద్వారా బహుళ వ్యాప్తి కావచ్చు. మరి ఆ స్వేచ్ఛను రచయితలు దుర్వినియోగపర్చుకొనే ప్రమాదం కూడా లేకపోలేదని కొందరి విమర్శకుల అభిప్రాయం. కాని పాఠకులు లేనిదే రచయిత బ్రతకడు. తన రచనలకు చలామణి ఉన్నందుకే అతడు వ్రాయగలుగుతున్నాడు. అశ్లీలమైన, జుగుప్సాకరమైన సాహిత్యం సృష్టి అవుతున్నదే అని మనం భయపడనవసరం లేదు. మానవాత్మ సహజంగా అభ్యుదయాన్నే కాంక్షిస్తుంది. రచనా స్వేచ్ఛ గల దేశాలలో కూడా కొందరు మాత్రమే విశ్వజనీనమైన సాహిత్యాన్ని సృష్టించగలుగుతున్నారు. కనుక రచయితలకేవో బాధ్యతలుండటం అవసరమని అనుకోవటం పొరపాటు. ఆలోచనలను అరికట్టలేము. అరికట్టటం బర్బరత్వం. మానవత్వం మీద నమ్మకం వున్నవాడు స్వేచ్ఛ కోసం పోరాడుతాడు. స్వేచ్ఛ కోసం పోరాడే వాళ్లలో రచయితలే కాదు రకరకాల మానవులుంటారు. స్వేచ్ఛ కోసం పోరాటం సల్పడం రచయిత బాధ్యత కాకపోవచ్చు. కాని అది అతని లక్షణం. అందుకే మన భారత రాజ్యాంగం ఆలోచనా స్వేచ్ఛను ప్రసాదించింది. రాజ్యాంగం చూపిన వెలుగుబాటలో మనం పయనిస్తున్నాం.

రచయితలకు బాధ్యతలున్నా, లేకపోయినా వాళ్లు మానవునికి బ్రతుకు మీద ఆశను, మమతను కలిగిస్తారు. ఆదర్శ శిఖరాలకు చేరువగా తీసుకొని పోతారు. చెప్పినట్లు వ్రాస్తే చెప్పినవాని మాటే చెప్పినట్లువుతుంది గాని తన మాట కాదు. రాచరికాలు, మూఢ విశ్వాసాలు నశిస్తున్నాయి. విజ్ఞానం పద్మంలాగా విచ్చుకుంటోంది. పొడుస్తున్న సూర్యుని లాగా అనుక్షణం అధికాధిక ప్రకాశంతో వెల్గును ప్రసరిస్తున్నది. తర్కానికి హృదయానికి అంటే మేధకు హృదయానికి జరుగుతున్న సంఘర్షణలో హృదయమే జయించి తీరుతుందని రచయితకు నమ్మకముంటే చాలు. మరే బాధ్యతా నిర్దేశం అక్కర్లేదనే విశ్వాసం ఉన్న వాళ్లు మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. ఇటీవల వెలువడుతున్న విశ్వ సాహిత్యం ఈ యధార్థ్యానికి ప్రమాణం. సదసద్వివేక పరిజ్ఞానాన్ని, దారిద్ర్య నిర్మూలనా మార్గాలను సూచించే రచనలు సాహిత్య పరిధిలోకి రావు. ఆయా విషయాల రచయితలు తాత్వికులు, శౄస్త్రజ్ఞులు, తార్కికులు. వారికి బాధ్యతలున్నవి. అది వేరే విషయం. కాని హృదయ సంబంధి అయిన సాహిత్య సృష్టి చేసే రచయితలకు బాధ్యతలుండవు. వారి రచనల్లో సందేశం సూచింపబడవచ్చును. అంతేకాని సందేశమే రచనోద్దేశం అయినప్పుడు మరి ఆ సందేశం దేశ కాల పరిస్థితుల చట్టాల్లో బంధింపబడే ప్రమాదం వుంటుంది. అప్పుడు స్వేచ్ఛను కోల్పోయిన రచయిత వ్రాసిన వ్రాయకపోయినా ఒరిగేది ఏమీ వుండదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more