• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కైఫీ లేరు- ఆయన కవిత్వం వుంది

By Staff
|

జీవితానికి, కవిత్వానికి మధ్య వైరుధ్యాలను చెరిపేసిన కవి కైఫి ఆజ్మీ. అభ్యుదయ సాహత్యంతో అతని జీవితం పెనవేసుకుపోయింది. ఆచరణకు, ఆలోచనకు మధ్య హద్దులను చెరిపేసిన కైఫి మనకిక లేరు. తానెప్పుడు పుట్టానో కచ్చితంగా తెలియదని కైఫి తన ఆత్మకథలో అంటూ ''నా గురించి చెప్పాలంటే నేను కచ్చితంగా పరాధీన భారతదేశంలో జన్మించాను. స్వతంత్ర దేశంలో ముసలివాడినయ్యాను. సోషలిస్టు ఇండియాలో మరణిస్తాను'' అని అన్నారు. ఆయన కలలు గన్న సోషలిస్టు సమాజంలో భారతదేశంలో రాలేదు గానీ సమాజంలోని అంతరాలను రూపుమాపాలనే ఆయన తపనతో రాసిన వెల లేని సాహిత్యాన్ని మన ముందుంచి ఆయన వెళ్లిపోయారు. దోపిడీ సమాజంలో ప్రతి కవీ సామాజిక చట్రాన్ని మార్చడానికి రచనలు చేయాలని ఆయన చెప్పుతుండేవారు. అప్పుడే ఆ కవిత్వానికి సార్థకత చేకూరుతుందని ఆయన గట్టిగా నమ్మారు. ఆ స్పృహతోనే ఆయన కవిత్వం రాశారు. మార్క్సిస్టు కవిగా ఆయన అర శతాబ్ది పాటు రచనలు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌ఘర్‌ జిల్లతా మిజ్వాన్‌ అనే చిన్న పల్లెలో జన్మించిన కైఫికి తిరుగుబాటు తత్వం చిన్ననాడే అలవడింది. ఆయన తండ్రి సయ్యద్‌ ఫతే హుసేన్‌ రిజ్వీ భూస్వామి. మొదట రిజ్వీ బల్హరా అనే చిన్న పట్టణంలో తాహిస్‌ల్దార్‌గా పని చేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆయన పని చేయాల్సి వచ్చింది. తన బంధువులను ధిక్కరించి ఆయన తన ముగ్గురు కుమారులకు ఇంగ్లీష్‌తో పాటు ఆధునిక విద్యలో శిక్షణ ఇప్పించాడు. ఈ ముగ్గురి తర్వాత పుట్టినవాడు కైఫి ఆజ్మీ. మిగతా ముగ్గురికి మాదిరిగా కాకుండా కైఫికి మత విద్యలో శిక్షణ ఇప్పించాలని ప్రయత్నించారు. అతడ్ని లక్నోలోని సుల్తాన్‌-ఉల్‌-మదరసీలో చేర్పించారు. అక్కడతను ఒక ఉప్పెనే సృష్టించాడు. విద్యార్థులందర్నీ కూడగట్టి సమ్మె చేయించాడు. ఈ సమ్మె ఏడాదిన్నర పాటు సాగింది. ఈ సమయంలో ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ అతడ్ని గుర్తించారు. అతనిలోని కవిని గుర్తించి ప్రోత్సహించారు. ఈ సమ్మె కారణంగా మదరసీ నుంచి బహిష్కరణకు గురైన కైఫీకి ఆధునిక విద్య అభ్యసించే అవకాశం రాలేదు. అయితే ఆయన అరబిక్‌, పర్షియన్‌, ఉర్దూ భాషల్లో లక్నో, అలహాబాద్‌ విశ్వవిద్యాలయాల పరీక్షలు పాసయ్యారు.

నిజానికి కైఫి ముగ్గురు అన్నలు కూడా కవులే. తండ్రి కవి కాకపోయినప్పటికీ అతనిలో సాహిత్యాభిరుచి వుండేది. ఒకసారి ఒక ముషాయిరాకు కైఫీకి ఆహ్వానం వచ్చింది. ఆ ముషాయిరాలో కైఫీ చదివిన కవితను సభాధ్యక్షుడు ఎంతో మెచ్చుకున్నారు. అయితే కైఫీ ఆ కవిత రాశాడంటే అతని తండ్రికి నమ్మకం కుదరలేదు. అతని కవితాభినివేశానికి పరీక్ష పెట్టాడు. అతనికి రెండు పాదాల వాక్యాలు ఇచ్చి అదే ఛందస్సులో ఘజల్‌ రాయమన్నారు. వెంటనే ఆ ఘజల్‌ రాసి ఇచ్చేశాడు కైఫీ. అప్పుడాయనకు కేవలం 11 ఏళ్ల వయస్సు.

'ఇత్నా తో జిందగి మే కిసికి ఖలాల్‌ పడే హన్స్‌నే సే హో సుకూన్‌ నా రోనే సే కల్‌ పడే' అని ప్రారంభమయ్యే ఆ ఘజల్‌ను బేగమ్‌ ఆక్తర్‌ పాడారు. అది అప్పుడు భారతదేశాన్ని ఉర్రూతలూగించింది.

పదకొండేళ్లకే కవిగా పేరు ప్రతిష్టలు పొందిన కైఫీ ఆ తర్వాత అభ్యుదయ రచయితల ఉద్యమంతో మమేకమయ్యారు. 1943 ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. పార్టీ ఆదేశం మేరకు ముంబాయిలోని కార్మికుల మధ్య పని చేశారు. అదే సమయంలో దేశంలో ఎక్కడ ముషాయిరా జరిగినా ఆయన హాజరవుతూ వచ్చారు. ఒక ముషాయిరాలో పాల్గొనడానికి 1947లో ఆయన హైదరాబాద్‌ వచ్చారు. అక్కడ ఆయనకు షౌకత్‌తో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కైఫీ భార్య షౌకత్‌ మంచి నటి కూడా. ఆమె సినిమాల్లో, నాటకాల్లో వేషాలు వేశారు.

చాలా మంది ఉర్దూ కవుల మాదిరిగానే కైఫీ ఆజ్మీ మొదట్లో ప్రేమ కవిత్వమే రాశాడు. అభ్యుదయ రచయితల పరిచయం ఆయన కవితా మార్గాన్ని మార్చేసింది. తన కవిత్వానికి సామాజిక స్పృహను జోడించారు. అయితే, దీని వల్ల కైఫీ కవిత్వం పేలవమై పోలేదు. భావోద్వేగ సాంద్రతతో విశిష్టతను సంతరించుకుంది. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రతినిధిగా ఆయన కవిత్వం నిలబడింది.

కైఫీ సినిమాలకు కూడా పని చేశారు. హీర్‌ రంఝా అనే సినిమాకు స్క్రిప్టు రాశారు. ఇక్కడ ఆయన చేసిన ప్రయోగం ఎందరి మన్ననలో అందుకుంది. సినిమా కూడా హిట్టయింది. కైఫీ సినిమాలకు ఎన్నో పాటలు రాశారు. కాగజ్‌ కె ఫూల్‌, హీఖీఖత్‌, హీర్‌ రంఝా, హస్తే జక్మే వంటి సినిమాలకు రాసిన ఆయన పాటలు శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.

కైఫీ అజ్మీకి ఎన్నో సాహిత్య అవార్డులు అందుకున్నారు. 'ఆవారే సజ్దే'కు ఉత్తర ప్రదేశ్‌ ఉర్దూ అకాడమీ అవార్డు, సోవియట్‌ ల్యాండ్‌ నెహ్రూ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. ఉర్దూ సాహిత్యానికి చేసిన సేవలకు గాను మహారాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రత్యేక అవార్డు ఇచ్చి ఆయనను సత్కరించింది. ఆయనకు ఆఫ్రో- ఆసియన్‌ రైటర్స్‌ కమిటీ లోటస్‌ అవార్డు కూడా వచ్చింది.

ఆయన రచనలు- ఝంకార్‌, ఆఖిర్‌-ఓ-షాబ్‌, ఆవారా సజ్దే, ఇబ్లీస్‌ కి మజ్లీస్‌-ఎ- షూరా (దూస్రా ఇజ్లాస్‌)పవన్‌ కె. వర్మ అనే రచయిత ఆయన కవితలను ఎంపిక చేసుకుని ఆంగ్లంలోకి అనువాదం చేశారు. ప్రముఖ సినీ నటి షబనా ఆజ్మీ కైఫి ఆజ్మీ కూతురు. ఆమెకు తన తండ్రి రాసిన 'మకాన్‌' అనే కవిత అంటే చాలా ఇష్టం. పవన్‌ కె. వర్మ ఆంగ్లంలోకి అనువదించిన కైఫీ పుస్తకావిష్కరణ సభలో ఆమె ఈ కవితను చదివి వినిపించారు. కైఫీ మన ముందు లేకపోయినప్పటికీ ఆయన సృష్టించిన సాహిత్యం వుంటుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more