• search

పార్ట్-32

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    టీ తాగేసి వెళ్లి ప్రెస్‌ గ్యాలరీలో కూర్చున్నారు రాంరెడ్డి, కృష్ణ. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరే వస్తున్నారు. స్పీకర్‌ అడుగు పెట్టగానే అందరూ లేచి నించున్నారు. స్పీకర్‌ కూర్చోగానే అందరూ కూర్చున్నారు. ప్రతిపక్షాలు ఒకవైపు, మంత్రులు, అధికార పార్టీవారు మరో వైపు.

    ప్రెస్‌ గ్యాలరీ క్రిక్కిరిసిపోయింది. అంతటా ఉత్కంఠ. ప్రధాన ప్రతిపక్షం మహా ఉత్సాహంగా ఉంది. అందరి చేతుల్లో ఆనాటి దినపత్రిక ఉంది. అది ప్రతిపక్షానికి అనువుగా వార్తలు రాస్తుందనే ప్రచారం ఉంది. అయితే ప్రతిపక్ష నాయకుడి సీటు ఖాళీగా ఉంది. మంత్రుల చేతుల్లో మరో దినపత్రిక ఉంది. మంత్రుల చేతుల్లో ఉన్న దినపత్రికలోనే రాంరెడ్డి పొలిటికల్‌ రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు.

    అసెంబ్లీ సమావేశం కాగానే సంప్రదాయం ప్రకారం క్వొశ్చన్‌ అవర్‌ ప్రారంభం కావాలి. క్వొశ్చన్‌ అవర్‌ ప్రారంభించడానికి తగిన ప్రకటన చేయగానే ప్రతిపక్ష శాసనసభ్యుడొకరు లేచి తాము ఇచ్చిన వాయిదా తీర్మానం ఏమైందని అడిగారు. దాన్ని త్రోసిపుచ్చినట్లు స్పీకర్‌ ప్రకటించారు. దానికి ఒక్కసారి ప్రతిపక్ష సభ్యుల నుంచి నిరసన వ్యక్తమైంది.

    ''అధ్యక్షా! మద్యపాన నిషేధం విధించాలని ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు అమానుషంగా దాడి చేస్తున్నారు. ఈ మంత్రుల్లో కొంత మందికి మద్యం వ్యాపారంతో సంబంధాలున్నాయి. ఈ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమంపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు'' అంటూ ఇద్దరు ముగ్గురు మంత్రుల పేర్లు కూడా చెప్పాడు ప్రతిపక్ష శాసనసభ్యుడొకరు.

    శాసనసభా వ్యవహారాల, ఆర్థిక శాఖల మంత్రి వెంటనే లేచి- ''అధ్యక్షా! వాయిదా తీర్మానాన్ని త్రోసిపుచ్చిన తర్వాత ఆ అంశంపై చర్చ చేస్తున్నారు. సభా మర్యాద కాదు. ప్రజలపై వారి నాయకుడికి ఎంత చిత్తశుద్ధి ఉందో చూడండి'' అంటూ పత్రికలోని రాంరెడ్డి రాసిన వార్త ప్రధానంగా కనిపించేలా ప్రదర్శించారు. ''ఇక్కడ సభ ప్రజా సమస్యలను చర్చిస్తుంటే వాళ్ల నాయకుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు'' అంటూ ప్రతిపక్షాల వైపు పత్రికను చూపుతూ అన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యుల నుంచి నిరసన వ్యక్తమైంది. అందరూ లేచి నిలబడ్డారు. స్పీకర్‌ పోడియం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో మొదలైన ఆరోపణలు, ప్రత్యారోపణలు 11 గంటల వరకు కొనసాగాయి. స్పీకర్‌ టీ విరామం ఇస్తూ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా అదే విషయమై తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో సభను స్పీకర్‌ రేపటి వాయిదా వేశారు.

    ప్రెస్‌ గ్యాలరీ నుంచి బయటకు వస్తుంటే- ''అదరగొట్టేశావు గురూ!'' అన్నాడు ఒక దిన పత్రిక రిపోర్టర్‌, రాంరెడ్డి ఫ్రెండ్‌.

    ''దాంట్లో ఏముంది? ప్రభుత్వానికి అనుకూలంగా రాయడమే కదా చేసింది'' అన్నాడు మరో పత్రికలో పనిచేసే సీనియర్‌ రిపోర్టర్‌ ఒకతను. అతను, అతను పని చేసే పత్రికా యాజమాన్యం ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వార్తలు రాస్తుందనేది ప్రజలెరిగిన సత్యం. తాను రిపోర్టింగ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి తన వార్తల విషయంలో ఆ పత్రిక రిపోర్టర్లు అదే విధమైన ధోరణి ప్రదర్శిస్తూ వస్తున్నారు. వారిని ఎదిరించి, నిలదొక్కుకోవడం కొంత కష్టమే. ఏవో ముద్రలు వేసి ప్రచారం చేసే విద్య వాళ్లకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఒక రకంగా పత్రికారంగంలో వారిది ఆధిపత్య ధోరణి. వాస్తవాలు ఏమి రాసినా ఆ ఆధిపత్యాన్ని ఎదిరించడమే అవుతుంది.

    బయటకు వచ్చేసరికి ఎండ చురుక్కుమంది. ఎండ ఏమంత తీవ్రంగా లేనప్పటికీ ఎయిర్‌ కండీషన్డ్‌ హాల్‌లోంచి ఒక్కసారిగా బయటకు రావడంతో సూర్యకిరణాలు దుస్తులను చీల్చుకుని ఒంటిని గాయపరచసాగాయి. కడుపు నకనకలాడుతోంది. ఏమైనా తిందామంటే జేబులో సరిపోయేంత డబ్బు లేదు. తెల్లారి లేస్తే మంత్రులతో, రాజకీయవేత్తలతో, వాణిజ్యవేత్తలతో, మేధావులతో సరిసమానంగా, ఒక్కోసారి వారి కన్నా పైన ఉంటూ మాట్లాడే తెలుగు దినపత్రికల్లో పని చేసే కొందరు రిపోర్టర్లకు అది మామూలే.

    ''ఆకలవుతోంది'' చెప్పాడు కృష్ణతో.

    ''ఎక్కడైనా తిందామా?'' అడిగాడు కృష్ణ.

    ''డబ్బులు లేవు''

    ''నా దగ్గరున్నాయి. ఇక్కడే ఏదైనా కాస్తా తిని వెళ్దాం'' అని చెప్పాడు కృష్ణ. వీరిద్దరి మధ్య ఆ సాన్నిహత్యం ఉంది. ఇద్దరూ అసెంబ్లీ లాంజ్‌లోని క్యాంటిన్‌కు బయల్దేరారు. గేట్‌ వద్ద హోమ్‌ మినిస్టర్‌ రాయపరెడ్డి కనిపించాడు. వీళ్లను చూసి ముఖం తిప్పుకున్నాడు.

    రసూల్‌ ఎన్‌కౌంటర్‌ సమయంలో కూడా హోమ్‌ మినిస్టర్‌గా ఉన్నది అతనే. రసూల్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా వెల్లువెత్తిన ఉద్యమానికి అతని పదవి ఊడాల్సిందే. కానీ బయటపడ్డాడు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more