• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిద్ధార్థ 'బుద్ధ' కాడు

By Staff
|

'దీపశిల' కవి సిద్ధార్థ మాటలు ఒక దిన పత్రికలో వ్యాస రూపంలో అచ్చయ్యాయి. ఇది ఇంటర్వ్యూకు, వ్యాసానికి మధ్యస్థంగా వుంది. ఆయన తన వ్యాసంలో లేదా ఇంటర్వ్యూలో కొన్ని 'విలువైన' అభిప్రాయాలు వెల్లడించారు. కొందరు కొన్ని పనులు ముందు చూపుతో చేస్తారు. కొందరు కవులు చాలా వేగంగా సాహిత్యంలో మెట్లెక్కేందుకు కవితలు రాస్తారు. ఇలా రాయడానికి, పుస్తకాల మీద పుస్తకాలు అచ్చేయడానికి గతంలో 'చేరాతలు' బాగా ఉపయోగపడ్డాయి. ఆ 'చేరాతల' పని చేద్దామని సిద్ధార్థ ఒక రాయి విసిరాడు కూడా. విసిరిన రాయి ఏమైనా ఫలాలు ఇచ్చిందో లేదో గానీ, చేరాకు వచ్చిన పేరు సిద్ధార్థకు రాలేదు. 'చేరాతలు' రాసే సమయంలో చాలా మంది చేరాకు చేరువయ్యారు; అంతే మంది ఆయనపై విమర్శలు చేశారు లేదంటే ఆయనపై అలిగారు, లేదంటే లోలోన తిట్టుకున్నారు. ఇలా సిద్ధార్థ ఒక టాపిక్‌ కాలేకపోయాడు. ఇక లాభం లేదనుకున్నాడేమో ఎలాగైనా తాను సాహిత్య ఎజెండాలో అగ్రభాగాన వుండాలనుకున్నాడు కాబోలు లేకుంటే అతి ప్రాథమికమైన అభిప్రాయాలను వెల్లడించి ఆభాసుపాలు కాడు.

ఆయన అమూల్యాభిప్రాయాల్లో ఒకటి శ్రీశ్రీ కవిత్వం మీద చేసింది- ''శ్రీశ్రీ కవిత్వం తెలంగాణాలో ఎవరికీ అర్థం కాదు. తెలంగాణా ప్రజలను ఉద్యమ మార్గంలో ప్రభావితం చేయలేదు''. ఇది అమాయకత్వమో, అజ్ఞానమో తెలియదు. వచన కవిత్వానికి పాఠకులే పిడికెడు మంది. అందులో ఎక్కవ మందికి దాదాపు రెండు దశాబ్దాలు శ్రీశ్రీ 'మహాప్రస్థానం' (మరో ప్రస్థానం కాదు) నిత్య పారాయణ గ్రంథం. శ్రీశ్రీ కవిత్వం మాయాజాలంలో తెలంగాణా చాలా మంది తన సొంత గడ్డ మీది ప్రజాకవులను మరిచిపోయింది. తెలంగాణా వచన కవులకు, విప్లవ కవులకు మహాప్రస్థానం 'అక్షరాల మాయల గూడు'పై మోజును పెంచింది. శ్రీశ్రీ కవిత్వం తెలంగాణా ప్రజలను ప్రభావితం చేయలేదంటున్న సిద్ధార్థ కవిత్వం ఆ మేరకు తెలంగాణా ప్రజలను ప్రభావితం చేయగలితే ఎంత బాగుండు!

నిజానికి, శ్రీశ్రీ కవిత్వం ప్రభావితం చేసినంతగా ఏ కవీ తెలంగాణా వచన కవులను ప్రభావితం చేయలేదు కాబట్టే ఇప్పుడు సిద్ధార్థకు గొంతు పెంచడానికి అవకాశం చిక్కింది. సిద్ధార్థ కవిత్వం ఉద్యమ కవిత్వానికి భిన్నమైంది కాబట్టి ఆయన గుర్తించకుండానే తెలంగాణా వాసన సిద్ధార్థ కవిత్వానికి అంటింది. ఈ తెలంగాణా ప్రాంతీయ పరీమళాన్ని కవిత్వీకరించి సాహిత్యాన్ని ప్రభావితం చేసిన కవులు నీలిగిరి, గోసంగి కవులు. వీరి నుంచి వెలువడ్డవే-'బహువచనం', 'మేమే', 'మొగి', 'జల్‌జలా' కవితా సంకలనాలు. ఈ కవులు కవిత్వాన్ని శాసిస్తుంటే 'మో' కవిత్వ జిగిలో కొట్టుకుపోతున్న సిద్ధార్థకు తెలంగాణా స్పృహ వచ్చింది.

సిద్ధార్థ ఇంకో కామెంట్‌ కూడా చేశాడు. ''తన అఖరి కవిత 'మృత్యువు హాస్య ప్రియత్వం'తో అజంతా ఒక్కడే ప్రత్యామ్నాయ కవిత్వ ప్రవాహాన్ని తెలంగాణా వైపునకు దారి మళ్లించాడు. అతడి ప్రభావంతోనే ఇప్పుడు తెలంగాణా కవులు శక్తిమంతమైన కవిత్వం రాస్తున్నారు'' అని సిద్ధార్థ మరో విలువైన మాట అన్నాడు. ఇది తెలంగాణాలో కొత్తగా పుట్టుకొచ్చిన కవులను అవమానించడమే. నిజానికి అజంతాకు ఈ చూపునిచ్చింది 'బహువచనం', 'మేమే', 'మొగి' కవులు. వారితో మమేకం కావడానికి ఇష్టపడుతూ తన అంతరంగాన్ని విప్పిన కవిత అజంతా 'మృత్యువు హాస్యప్రియత్వం'.

'అజంతా, మో, వజీర్‌ రెహమాన్‌, నారాయణబాబు, శిష్‌ట్లా, బైరాగి, ఇస్మాయిల్‌, దిగంబర కవులలో ముగ్గురు ఎప్పటికీ ప్రత్యామ్నాయ కవులే' అంటున్నాడు సిద్ధార్థ. ఈయన కవిగా ఈ ప్రత్యామ్నాయ మార్గంలో నడుస్తున్న కవి. ఈ ప్రత్యామ్నాయ కవులకు మార్గనిర్దేశం చేసింది బహువచనం, మేమే కవులు. సిద్ధార్థకు తెలంగాణా ప్రాంతీయ చూపునిచ్చింది కూడా ఈ కవులే. వీరు మీడియాకు దూరం కాబట్టి సిద్ధార్థ ఎన్ని అబద్ధాలైనా మాట్లాడడానికి అవకాశం వుండబట్టి సిద్ధార్థ దుస్సాహసం చేశాడు.

'నిష్పూచిగా వుండే తీరిక కథల్లోకి మేధోచలనానికి పనికొచ్చే వ్యాసంగాలలోకి కవి ఉడాయించాడు' అనే కామెంట్‌ చేశాడు సిద్ధార్థ. ఈయన కొంత కాలం క్రితం ఈ 'మేధోచలనానికి పనికి వచ్చే వ్యాసంగంలోకి ఉడాయించే' ప్రయత్నం చేశాడు. అదెంత బరువైన పనో, ఎంత సమయం తీసుకునే పనో, ఎంత బుర్ర తినో పనో ఆయనకు అర్థమై పోయి వుంటుంది. కథల గురించి కూడా సిద్ధార్థ చాలా అమెచ్యూర్‌ కామెంట్స్‌ చేశాడు. ఆయన పరిజ్ఞానం, బుద్ధి వచన సాహిత్యాన్ని, ముఖ్యంగా కథను అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేదని అనుకుంటే ఏ పేచీ లేదు. కథ గురించి, కథ నిర్వర్తించే ప్రయోజనం గురించి, కథకు వుండే పాఠకుల గురించి ఆయనకు చెప్పి కూడా అనవసరం. సిద్ధార్థ కవిత్వాన్ని ఓరకంటితో కూడా చూడని పాఠకులు కథను చదివి ప్రభావితమైన సందర్భాలే ఎక్కువ. ఈ లెక్కన చలం, గురజాడ, పాలగుమ్మి పద్మరాజు, చాసో, త్రిపుర, ఒక్కరేమిటి ఉత్తమ సాహిత్య కారులందరినీ ఒక్క మాటతో తీసేసిన సిద్ధార్థ 'జ్ఞానాన్ని' అభినందించకుండా వుండలేం. తన కవిత్వం గొప్పదని చెప్పుకోవడానికి సవాలక్ష మార్గాలున్నాయి, ఇది మాత్రం మార్గం కాదు.

సిద్ధార్థ అంతటితో ఆగకుండా ఒక నాయకుడి పాత్రను తనంత తాను భుజాన వేసుకున్నాడు. ఇందులో భాగంగా ఆయన ప్రాంతీయ వేదనకు అద్దం పడుతున్న కవుల జాబితా ఒకటి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన జాబితాలో కొందరి 'ప్రాంతీయ వేదన'ను అనుమానించాల్సిందే. దీంతో పేచీ ఎందుకనుకంటే ఒక ప్రశ్న మాత్రం వేయక తప్పదు. తానిచ్చిన జాబితాలో ఒకటి రెండు కవితలు కూడా అచ్చు కాని, అంటే పాఠకులకు చేర్చని కవులున్నప్పుడు అయిల సైదాచారి ఎందుకు లేడనేది ఆ ప్రశ్న. సైదాచారి కవిత్వంలో సిద్ధార్థ కవిత్వానికి పేచీ వుంది. డిక్షన్‌ విషయంలో ఏ అజంతా, మో కవిత్వ మూలాల నుంచయితే సిద్ధార్థ వచ్చాడో, అవే మూలాల నుంచి సైదాచారి వచ్చాడు. వస్తువు విషయంలో, సిద్ధార్థ ఈ ప్రత్యామ్రాయ ప్రాంతీయ ప్రవాహం గురించి మాట్లాడుతున్నాడో ఆ మార్గంలో సైదాచారి కవిత్వం ముందున్నది. సిద్ధార్థ సైదాచారి కవిత్వానికి భయపడుతున్నాడనుకోవాల్సి వస్తుంది. తెలుగు సాహిత్యంలో ఉన్న సాహిత్య ముఠాలు కొన్ని కొందరిని తమ సౌకర్యం కొద్ది మరిచిపోతుండడం ఒక అలవాటు. ఈ అలవాటు సిద్ధార్థకు లేదని అనుకోలేం. ఎందుకంటే అవాకులు, చెవాకులు ఇష్టమొచ్చినట్లు ఒక ప్రవక్తల మాట్లాడగలిగినవాడికి అది అసాధ్యమేమీ కాదు.

సిద్ధార్థ వ్యాఖ్యానాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అయితే, మాట్లాడకపోవడమనే ఆయుధాన్ని తెలుగు సాహిత్యంలో మాట్లాడాల్సిన అంశాల విషయంలో ప్రయోగిస్తున్నారు కాబట్టి సిద్ధార్థ గురించి మాట్లాడాల్సి వస్తోంది. కవిత్వమేదో రాసుకోండి గానీ వచనంలోకి వచ్చి మాట్లాడొద్దని, వచనం సౌందర్యాన్ని, వాక్య సౌందర్యాన్ని దెబ్బ తీయొద్దని సిద్ధార్థకు చిన్న సలహా.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more