వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటరి 'వన్నె'కాడు వ.పా!

By Staff
|
Google Oneindia TeluguNews

వడ్దాది పాపయ్య చిత్రకళ గురించీ, ఆయన వ్యక్తిత్వ విశేషాల గురించీ సుంకర చలపతిరావు ఓ పుస్తకం రాశారు. దానికి చలపతిరావు పెట్టిన పేరు ''రంగుల రారాజు'. నన్నడిగితే వ.పా.ను''రంగుల రేరాజు'' అనాలంటాను. ఆంధ్రజ్యోతి మాసపత్రికలో వేసిన ''రతీమన్మధ''తో మొదలయ్యి అర్ధ శతాబద్దంపైగా సాగిన వడ్డాది పాపయ్య వర్ణ చిత్ర సాధన ప్రధానంగా శృంగార రసాన్ని ఆశ్రయించుకుని ఉంది. ప్రబంధకవుల వర్ణనలకు మరి కొంత మసాలా జోడించిన ఆధునిక చిత్రకారుడైవరయినా ఉన్నారంటే అది వ.పాగారే. ఆయన వర్ణచిత్రాల్లో కనిపించే స్త్రీలు ''ఘనజఘన''లు, ''భూరిపయోధరభార''లు. తొలి ప్రబంధ కవి శ్రీనాధుడు మొదలుకొని మన కాలపు నవ్య ప్రబంధ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌ వరకు వందలాది రసికులు ఇలాంటి స్త్రీలను చవులూరే శ్రధ్ధాసక్తులతొ, ఉరకలు వేసే ఉత్సాహోద్రేకాలతో వర్ణిస్తూ పోయారు. ''పృథు వక్షోజ నితంబభార''లయిన ఈ ప్రాబంధిక సుందరాంగులకు రంగుల ప్రాణం పోసే ఏకైక లక్ష్యానికి జీవితాన్ని అంకితం చేసిన ''నిబద్ధ'' కళాకారుడు వడ్దాది పాపయ్య. వర్ణ సమ్మేళనంలోనూ, చిత్ర నేపథ్యంగా అమరే వాతావరణాన్ని కల్పించడంలోనూ వ.పా. ప్రదర్శించిన విచక్షణ అనుపమానమంటే అతిశయోక్తి కాదు. ఆ కర్ణాంత నేత్రలయిన అందగత్తెలను ఆయన చిత్రీకరించిన తీరు అద్వితీయం. ఈ రంగుల బొమ్మలు చూస్తేనే చాలు- వడ్దాది పాపయ్యగారెంత ''రంగీన్‌ ఆద్మీ''యో అర్ధమవుతుంది. అలాంటి వాళ్ళను లోకం నిందార్ధంలో రంగేళీలని పేర్కొనడం కద్దు. వ.పా. వర్ణచిత్రాలలో గిరజాలు పెంచుకుని దర్శనమిచ్చే పురుషులు, అక్షరాలా పుష్పశరులు, పరమ సుకుమారులు.

చీని చీనాంబరాలతోను, ఏడువారాల నగలతోను ఓపికగా స్త్రీ మూర్తులను అలంకరించే వడ్డాది పాపయ్య, పురుషుల విషయానికి వచ్చే సరికి మితిమీరిన పిసినారితనం వెళ్ళబోస్తారు. పంచె ఉత్తరీయంతోనే సరిపెడుతుంటారు. సుందరీమణుల కనుముక్కు తీరును ఉదాత్త విగ్రహ నిర్మాణ విశేషాలను కడు శ్రద్ధతో చిత్రించిన ఈ కళాకారుడు పురుషుల చిత్రీకరణను తేలిగ్గా తేల్చేసేవారు. దీని ఆధారంగా వ.పా సౌందర్య ధృక్పథం ఏమిటో అంచనా వేసుకోవచ్చు.

అందాన్ని ఆనందం సమకూర్చే వనరు (సోర్సు ఆఫ్‌ జాయ్‌)గా పరిగణించి ప్రతిపాదించడం ప్రాచ్య పాశ్చాత్య దేశాలన్నిటా ఉన్నదే కీట్స్‌ మహాకవి ఏ బలవన్ముహూర్తంలో అన్నాడోయేమో కానీ "A THING OF BEAUTY IS A JOY FOR EVER'' అన్న భావన తాత్విక స్థాయి సంపాదించుకుని ప్రపంచమంతా పాకిపోయిన మాట నిజమే. ఆ పాపం ఆయన ఒక్కడి నెత్తినే రుద్దాలనుకోవడం కన్నా మహాపాపం మరొకటి లేదు. ఎందుకంటే కీట్స్‌ కన్నా అనేక శతాబ్దాలకు పూర్వమే ప్రాచ్యదేశాల అలంకారికులు మొదలుకొని నిన్న మొన్నటి ప్రేమతత్వజ్ఞుల వరకూ ఎంతో మంది ఈ తరహా భావాలు ప్రకటించి ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే అన్ని దేశాల్లోను కనిపించే మరో చిత్రమయిన ప్రేరణ ఒకటుంది. కళల్లో సెన్స్యువాలిటీ- అనుభవతత్వం కన్నా ,సెన్సువస్‌నెస్‌కి - అనుభూతి తత్వానికి పెద్ద పీట వెయ్యడం దాదాపు ప్రతి దేశంలోనూ ఉంది. అలాంటి ధోరణికి మన సంప్రదాయంలో ఆదరణ లేకపోవడం గమనార్హం, మనం రినైజాన్స్‌గా పిల్చే చారిత్రక ఘట్టంలో పుట్టుకొచ్చిన ఆధునిక ధృక్పథం మాత్రమే ఇందుకు భిన్నంగా అనుభవాన్ని తక్కువ చేసి అనుభూతిని ఎక్కువ చేసే నైతిక దృష్టిని ప్రదర్శించింది. కానీ, వడ్దాది పాపయ్య మీద ఈ నైతికత ప్రభావం దాదాపు శూన్యం. ఆయన భైతిక సంబంధమైన అనంతవాదాన్ని -హైడోనిజాన్ని నిర్భయంగా తన వర్ణచిత్రాల ద్వారా ప్రచారం చేశారు. ఆనందవాదుల కళాసేవలో నిర్భీతి ఎక్కువగాను, ప్రచారం తక్కువగాను ఉంటుంది. వ.పా సీనియర్‌, సమకాలీకుడైన చలం రచనలు ఇందుకు ఉదాహరణ (ఇంత మాత్రం చేతనే వడ్డాది పాపయ్యను, చలాన్ని ఒకే గాట కట్టేశారని అనుకోకండి) ''చిత్రకారుడు ఎప్పుడూ సమాజాన్ని దృష్టిలో ఉంచుకోకూడదు. ఎటువంటి కళ అయినా సామాజిక దృష్టితో ఉండకూడదు. వుంటే అది వ్యాపారం అవుతుంది. లేదంటే రాజకీయం అవుతుంది'' అన్నది వ.పా అభిప్రాయం. ఈ అభిప్రాయం ఆధారంగా చిత్రాకారుడిగా అయన ధృక్పథం- తాత్వికత ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

'తాత్వికంగానయినా మానసికంగా అశాంతిని తెమ్మతీర్చగలిగింది మాత్రమే - అది ఎలాంటిదయినా, బూతు అయినా - అదే అర్ధమున్న కళ. అది ప్రజలకు టానిక్కులా ఉండా''లంటారు వడ్డాది పాపయ్య.''కఠోర శాసనాలు తొలగినప్పుడే కళ కట్టుబొట్టు దిద్దుకుంటుందని' ఆయన సూత్రీకరించారు. దీన్ని బట్టి వ.పా. వర్ణచిత్ర కళ మౌలికంగా వ్యక్తి ఆశ్రయమయిందని రుజువవుతోంది. అలాంటి కళాకారుడు యాధాలాపంగా అలవోకగా వేసిన కార్టూన్లలో అభ్యుదయ భావాలను సామాజిక స్పృహను వెతికి చూపించాలనుకోవడం బాల్యం అనిపించుకుంటుంది.

వడ్డాది పాపయ్య బొమ్మల్లో కనిపించే స్త్రీపురుషులకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమయినది ఆ స్త్రీపురుషుల జీవన లక్షణం. స్థూలంగా వీళ్ళందరూ భారతీయ కవళికలు- ఇండియన్‌ ఫీచర్స్‌ - కలిగి ఉండేమాట నిజమే. అయితే వస్త్రాధారణ విషయంలో కానీ ఒడ్డు పొడుగుల విషయంలో గానీ, కనుముక్కు తీరు విషయంలోగానీ ఫలానా ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పలేని విధంగా ఉండే మాట కూడా అంతే వాస్తవం.ఇది వ.పాపయ్య ప్రత్యేకత. ఆయన స్వయంగా గురుస్థానంలో కూర్చోబెట్టిన రాజా రవివర్మ బొమ్మలు తీసుకోండి. అందులో దక్షిణాది అరిస్టోక్రాట్‌ కుటుంబాల పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.

'పాంచాలి' అనీ 'ద్రౌపది' అనీ పంచమవేదం ఘోషించిన పాండవ పత్ని కృష్ణ, మారువేషంలో మత్స్యదేశంలో ఉండగా ఎదుర్కొన్న సంక్లిష్ట సందర్భాన్ని అద్భుతంగా 'సైరంధ్రి' చిత్రంలో రవివర్మ చిత్రీకరించారు, అందులోని స్త్రీమూర్తికి పాంచాల, ద్రుపద జాతుల (స్థూలంగా నేటి పంజాబ్‌) లక్షణాలు కనిపించవు. ఆమె దక్షిణ భారతదేశంలోని కొన్ని అగ్రకులాలకు చెందిన స్త్రీ పోలికలు కలిగి ఉంటుంది. అలాగే హంస రాయబారం ఘట్టంలో కనిపించే దమయంతి కూడా కుచ్చీ పోసి కట్టిన జరీ అంచు పట్టుచీరతో ఆపాదమస్తకం ద్రావిడం ఒలకపోస్తుంటుంది. ఈ లక్షణాల కారణంగా రవివర్మ చిత్రాల ప్రాశస్త్యం అణుమాత్రం తగ్గకపోవడం గమనార్హం.

విషయమేమిటంటే, రవివర్మగాని, మరే ప్రముఖ చిత్రకారుడు గానీ తమ చిత్రంలోని మూర్తులకు ఒకానొక జాతి లక్షణం ఆపాదించడానికి వెనుకాడలేదు. అలా చేసిన కారణంగా వాళ్ళ చిత్రకళకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదు కూడా. కానీ వ.పా మాత్రం తను చిత్రీకరించిన మూర్తులకు విశిష్ట జాతిలక్షణం కల్పించేందుకు ప్రయత్నించలేదు.

'మన దేశం విషయానికి వస్తే, రాజసం ఎక్కవగా రాజస్థాన్‌- పంజాబ్‌ రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది. ప్రాచీన పౌరాణిక భామ బెంగాలీలదే! అందమయిన వ్యక్తులు బెంగాలీలే. కానీ పౌరాణిక పాత్రల్లో తెలుగువారికి సాటి లేర'ని వ.పా పేర్కొనేవారట. బహుశా ఈ అవగాహనతోనే ఆయన చిత్రాల్లోని మూర్తులకు నిర్దిష్ట జాతిలక్షణం అంటూ ఏర్పడకుండా పోయిందేమో. అయితే వడ్డాది పాపయ్య చిత్రాల కోసం తెలుగు నటీనటులైన ఎన్‌.టి.ఆర్‌, జమున, రాజశ్రీ, కృష్ణకుమారి, సావిత్రి, శ్రీదేవి, వాణిశ్రీ తదితరులను మోడల్స్‌గా ఊహించుకుని చిత్రాలు గీసేవారని చెబుతారు. చాలా చిత్రాల్లో ఆయా నటీనటుల పోలికలు స్పష్టంగా కనిపించేమాట కూడా నిజమే. ఇది ఎలా సాధ్యమయిందో మరి ! రేరాణి, మంజూష, అభిసారిక, అవినీతి, నవ్వులు-పువ్వులు, ఆంధ్రప్రతిక, భారతి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వడ్డాది పాపయ్య వర్ణచిత్రాలు సుప్రసిద్ధాలు. హిందుస్థానీ, కర్నాటక రాగాల సారాంశం ఇతివృత్తంగా తీసుకుని వ.పా వేసిన పెయింటింగ్స్‌ గొప్పగా ఉంటాయి. జయజయవంతి, అహిర భైరవి, కన్నడ శహాన, హిందోళ వంటి రాగాల తత్వాలకు ప్రాతినిధ్యం వహించే చిత్రాలనాయన- విభిన్నంగా చిత్రీకరించారు. నిజానికి ఆయన అయిదో ఏట వేసిన హనుమంతుడి వర్ణ చిత్రం మొదలుకొని డెబ్భయి ఏడో ఏట వేసిన చరమ చిత్రం వరకు ప్రతి ఒక్కదాన్ని గురించి, పేజీలకు పేజీలు వివరిస్తూ పోవచ్చు. వడ్డాది పాపయ్య లాంటి చిత్రకారుడు అంతకు ముందుకానీ , ఆయన తర్వాత కానీ మరొకరు కూడా లేకపోవడం ఒక్కటి చాలదా - ఆయన విశిష్టత గురించి చెప్పడానికి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X