• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాట ఆగిపోయింది!

By Staff
|

గ్యార యాదయ్య గొంతు నుంచి దళితుల పాట హోరెత్తేది. యుగాల దళితుల ఆవేదన, ఆర్తి, అణచివేతలోని బాధలు ఆ పాటలో కన్నీటి మంటలై ఎగిసి పడేది. నల్లగొండ జిల్లాలోని దళితుల వాడుక భాషలో ఆయన పాటలు రాష్ట్రంలోని దళితుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాయి. దళిత కవులకు గేయం ఒక వరంలాంటిది. దళితుల, శూద్రుల, శ్రామికుల కళారూపమైన పాట దళిత కవుల నుంచి నూతన వస్తువుతో జాలువారి తన వారికి భరోసా ఇస్తోంది. అలా భరోసా ఇచ్చిన పాటల్లో గ్యార యాదయ్య ముఖ్యమైనవి. మాదిగల జీవితాల్లో తాను ఒక్కడై ఆ భాషను, ఆ యాసను, ఆ జీవితాలను కవిత్వంలో, గేయాల్లో ఆయన ఆవిష్కరించారు. నిజానికి ఆయన ఇంకా ఎంతో చేసి ఉండేవాడు. కానీ ఆయనను గుండె పోటు రూపంలో అకాల మృత్యువు కాటేసింది.

తెలుగు సాహిత్యానికి దళిత కవుల అకాల మరణం ఒక శాపంలా చుట్టుకుంది. ఇంతకు ముందు నాగప్పగారి సుందరరాజు ఆత్మహత్య, మద్దెల శాంతయ్య అకాలమరణం ఒక తీరని నష్టమైతే, ఇప్పుడు గ్యార యాదయ్య మృతి మరో దెబ్బ. వీరి నుంచి నికార్సయిన దళిత కవిత్వం, దళిత సాహిత్య సౌందర్య శాస్త్రం, దళిత భాష తెలుగు సాహిత్యం రూపుదిద్దుకుంది. వీరి నుంచి దళితులే కాదు, తెలుగు సాహిత్యం కూడా చాలా ఆశించింది. ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ గ్యార యాదయ్య వెళ్లిపోయాడు.

నల్లగొండ జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన యాదయ్య చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్యాన్నే కాదు, సమాజ పరిణామాన్ని, ఆ పరిణామంలో దళితుల స్థానాన్ని ఆయన సీరియస్‌గా అధ్యయనం చేశాడు. దళిత తాత్విక దృక్పథాన్ని జీర్ణించుకున్న గ్యార యాదయ్య తన వాళ్ల కోసం పాటలు కట్టారు. ఆ పాటలను 'గూటం దెబ్బ' పేరుతో ఒక సంకలనంగా తెచ్చారు. అప్పటి నుంచి గ్యార యాదయ్య గూటం దెబ్బ యాదయ్య అయ్యాడు. మొదటి పుస్తకంతోనే ఒక ముద్ర వేయగలిగిన రచయితలు, కవులు చాలా అరుదు ఉంటారు. అలాంటి ముద్రను ఆయన వేసి తన స్థానమేమిటో, తన తాత్వికత ఏమిటో ప్రకటించుకున్నారు. సభల్లో పాటలు పాడుతూ, ప్రసంగాలు చేస్తూ ఉన్న సమయంలో తీవ్ర భావావేశంతో ఊగిపోయేవాడు. ఇంత చిన్నపిల్లవాడికి అంతటి ఆవేశం ఎందుకా అనిపించేది. అయితే తాను, తనవాళ్లు అనుభవించిన గాయాల నుంచి ఆ ఉద్వేగం రూపుదిద్దుకుందని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. "గాయాలను ఏరుకొచ్చి మన రచ్చబండ ఒళ్లో పోసిన'' కవి గ్యార యాదయ్య.

ఆ తర్వాత రంపెకోత అనే దళిత పాటల సంకలనాన్ని అచ్చేశాడు. అనంతరం తెలంగాణ ఉద్యమానికి దళిత దృక్పథాన్ని, భాషను అందించడానికి 'ఎర్కోషి' అనే దీర్ఘ కవితను వెలువరించారు గ్యార యాదయ్య. భావంలో, భాషలో, వ్యక్తీకరణలో' ఎర్కోషి'లో వినూత్నతను ప్రదర్శించారు. ఆయన దళిత వచన కవిత్వం అముద్రితంగానే ఉండిపోయింది. "సంపద సర్వం నాదైతే నేనే సృష్టికర్త. రాజ్యాధికారం కూడా నాదే అని రాజ్యాధికార నినాదంతో పాటై తన జాతి గుండెల్లో తుడుం నగారా దండోరా మోగిస్తున్న సామాజిక విప్లవకారుడు యాదన్న' అని గద్దర్‌ యాదయ్య గురించి అన్నారు. "ఈ కవి మొదటి గ్రంథమైన గూటం దెబ్బపై విశ్వ విద్యాలయాలలో ఇప్పటికే పిహెచ్‌డి పరిశోధనలు జరగడం, ఇతర రాష్ట్రాలలోని హిందీ, మరాఠా సాహిత్యంలో సైతం గూటం దెబ్బ తాత్వికతను వివిధ పరిశోధనల్లో విశ్లేషించడం ఆయన రచనల బలానికి ఉన్న నిదర్శనం' అని ప్రొఫెసర్‌ ననుమాస స్వామి అన్నారు. "ఉత్తర ప్రదేశ్‌లో జాతీయ స్థాయి దళిత సాంస్కృతిక ప్రదర్శనలిచ్చాడు. అనేక సాహిత్య పోటీలలో బహుమతులూ, వివిధ సందర్బాలలో సముచిత సత్కారాలందుకున్న చలనశీలి' అని యాదయ్య గురించి ప్రొఫెసర్‌ యస్వీ సత్యనారాయణ అన్నారు. గ్యార యాదయ్య అకాల మృతి తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా దళిత సాహిత్యానికి తీరని నష్టం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X