వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2001- తెలుగు కథ

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగు కథ 2001లో పలు మార్పులను చూసింది. కథకు సంబంధించి ఈ ఏడాది కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ ప్రభావం తెలుగు కథపై గణనీయమైన ప్రభావం చూపింది. కథా సంకలనాల్లో తెలంగాణ కథా రచయితల కథలకు స్థానం లేకపోవడంపై పెద్ద యెత్తున చర్చ జరిగింది. ఈ చర్చ 'వార్త' దిన పత్రిక ఆదివారం అనుబంధంలో, 'సుప్రభాతం' వీక్లీలో, ఇండియా ఇన్ఫో డాట్‌ కామ్‌ తెలుగు ఛానెల్‌లో, 'ఆంధ్రభూమి' సాహిత్యం పేజీలో చోటు చేసుకుంది. చిన వీరభద్రుడు సంకలనం చేసిన కథల్లో తెలంగాణ కథకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంపై కె. శ్రీనివాస్‌ వ్యాసం రాశారు. తెలంగాణలోని కథ విషయంలో చిన వీరభద్రుడు చేసిన వ్యాఖ్యను ఆయన పూర్వపక్షం చేస్తూ 'ఆంధ్రభూమి'లో ఓ వ్యాసం రాశారు. నవీన్‌, పాపినేని శివశంకర్‌ల సంపాదకత్వంలో ఏటేటా పదేళ్లుగా వస్తున్న వార్షిక కథా సంకలనాల్లో తెలంగాణ కథకు తగిన స్థానం కల్పించకపోవడంపై విమర్శలు చేస్తూ బి.యస్‌. రాములు 'సుప్రభాతం'లోనూ, 'ఇండియా ఇన్ఫో డాట్‌ కామ్‌'లోనూ వ్యాసాలు రాశారు.

ఇదే సమయంలో తెలంగాణలో కథా రచయితలకు, కథకు కొదవ లేదని చెప్పే ఉద్దేశంతో ఇండియా ఇన్ఫో డాట్‌ కామ్‌లో 'ఇక్కడా కథ వుంది' శీర్షికన చిన్న వ్యాసం వచ్చింది. దీని ప్రేరణతో కాలువ మల్లయ్య తెలంగాణ కథా రచయితలపై, కథలపై ఒక పరిచయ వ్యాసం రాశారు. ఇది 'వార్త' ఆదివారం అనుబంధంలో అచ్చయింది. దీనికి కొన్ని చేర్పులు, మార్పులు సూచిస్తూ మిట్టపల్లి పాణిగ్రాహి మరో వ్యాసం రాశారు. కాలువ మల్లయ్య తన పేరును ప్రస్తావించకపోవడంపై మండిపడుతూ ఐతా చంద్రయ్య అనే కథా రచయిత 'ఆంధ్రభూమి' సాహిత్య పేజీలో ఒక చిన్న వ్యాసం రాశారు.

ఈ ఏడాది స్కైబాబ 'సుల్తానా' కథ ఒక దుమారం రేపింది. 'ప్రజాతంత్ర' సాహిత్య ప్రత్యేక సంచికలో అచ్చయిన ఈ కథపై, అంతకు ముందు స్కైబాబ సంపాదకత్వంలో వెలువడిన 'జల్‌జలా' కవితా సంకలనంపై తీవ్ర విమర్శలు చేస్తూ 'విజయ విహారం' అనే పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. ఈ విమర్శను ఎండగడుతూ కొంత మంది సాహిత్యకారుల వ్యాసాలతో 'హర్యాలి' అనే పుస్తకం వచ్చింది.

ఈ ఏడాది రెండు ప్రత్యేక సాహిత్య సంచికలు వెలువడ్డాయి. ఒకటి- ప్రజాశక్తివాళ్లు వేసిన 'గమనం' కాగా, రెండోది కె. శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వెలువడిన 'ప్రజాతంత్ర'. ఈ రెండు సంచికల్లోని కథలు చూస్తే ఈ ఏడాది వచ్చిన తెలుగు కథ తీరుతెన్నులు అర్థమవుతాయి. ఇక, కథలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన 'ఆంధ్రజ్యోతి' పత్రిక మూతపడడం రచయితలకు బెంగగానే వుంది. అయితే, ఈ మధ్య వెలువడిన 'పత్రిక' ఈ లోటును కొద్దిగా పూడ్చే అవకాశం లేకపోలేదు.

ఇదిలా వుంటే, ఈ ఏడాది తెలుగు కథ ప్రధానంగా మూడు ధోరణులను ప్రతిఫలించింది. ఒకటి- తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ అన్వేషణకు, సామాజిక, సాంస్కృతిక అసమానతలను తెలియజేసే ధోరణి. రెండోది- సరళీకరణ, ఉదార ఆర్థిక విధానాల, గ్లోబలైజేషన్‌ ప్రభావంతో ధ్వంసమవుతున్న ప్రజా జీవితాలకు అద్దం పట్టిన పాయ. మూడోది- ముస్లింలు తమ మూలాలను అన్వేషిస్తూ, తమ సమాజంలోని వెనుకబాటుతనాన్ని, ఆర్థిక ఇబ్బందులను చిత్రీకరించిన కథలు.

సరళీకరణ, ఉదార ఆర్థిక విధానాల అమలు వేగవంతం కావడం, గ్లోబలైజేషన్‌ ప్రభావంతో బతుకులు చితికిపోతున్న వైనాన్ని చిత్రీకరిస్తూ చాలా కథలు వచ్చాయి. శ్రీధర్‌ దేశ్‌పాండే 'మరే కిసాన్‌', బోధనం నర్సిరెడ్డి 'పేగుబంధం' రైతుల జీవితాలు ధ్వంసం అవుతున్న తీరును కళ్లకు కట్టినట్టు చిత్రీకరించాయి. గీతాంజలి, ముదిగంటి సుజాతా రెడ్డి పల్లె స్త్రీలు పట్నం చేరుకుని భారమైన బతుకులీడుస్తున్న తీరును తమ కథల్లో చిత్రించారు. వి. చంద్రశేఖర్‌ రావు 'కేకలు', సురేష్‌ 'టైటానిక్‌' గ్లోబలైజేషన్‌ తీరును వ్యతిరేకించే కథలు. వలస జీవితాలను, గ్రామాల్లో ధ్వంసమవుతున్న జీవితాలను పెద్దింటి అశోక్‌ కుమార్‌ తన కథల్లో చిత్రించారు. తెలంగాణలో దూసుకొస్తున్న కథా రచయిత పెద్దింటి అశోక్‌ కుమార్‌.

కోస్తా, తెలంగాణ ప్రాంతాల మధ్య చోటు చేసుకున్న అసమానతల దృష్ట్యా స్త్రీవాదాన్ని విమర్శనాత్మక దృక్కోణం నుంచి చూసే కొత్త ధోరణి ఈ ఏడాది వచ్చిన కథల్లో కనిపిస్తుంది. పులుగు శ్రీనివాస్‌ 'చుడీదార్‌ పిల్ల' స్త్రీవాదంపై చురక పెట్టే కథ. అలాగే, కాసుల ప్రతాప్‌ రెడ్డి 'లవ్‌ 2020', 'దగ్ధం' కథలు కోస్తా స్త్రీల కన్నా తెలంగాణ పురుషుడు ఎలా వెనుకబడి వున్నాడో తెలిపేవి.

ముస్లిం కథ రచయితల్లో చాలా వేగంగా రాస్తున్నవాడు స్కైబాబ. కవిత్వం రాసే స్కైబాబ తన దృష్టిని కథల వైపు మళ్లించాడు. ముస్లింల జీవితాలకు అద్దం పట్టే 'దస్తర్‌', తదితర కథలు ఆయన రాశాడు. ఖదీర్‌ బాబు కూడా ముస్లింల జీవితాలను చిత్రీకరించే కథలు రాశాడు. రోడ్ల వెడల్పు వల్ల ఫుట్‌పాత్‌ వ్యాపారుల బతుకులు ఛిద్రం కావడంపై ఖాదర్‌ బాబు 'ఖాదర్‌ లేడు' అనే పెద్ద కథ రాశాడు. పాత్ర పేరు మాత్రమే ముస్లింది. ఇది ముస్లిం జీవితాలను చిత్రించిన కథ కాదు. కవిత్వం రాసే యాకూబ్‌ ఒక కథ రాయడం విశేషం. తన చిన్ననాటి జ్ఞాపకాలతో ముస్లింల జీవితాలకు ఆయన తన కథలో అద్దం పట్టాడు.

ఇదిలా వుంటే, చాలా కాలం అజ్ఞాతంలో వుండిపోయిన డాక్టర్‌ దేవరాజు మహారాజు ఈ ఏడాది చివరలో రెండు కథలు రాశాడు. 1970 దశకంలో ఈయన ఉధృతంగా కథలు రాశాడు. కథల పోటీలకు పెద్ద పెద్ద రచయితలు కూడా ఎగబడి కథలు రాయడాన్ని తప్పు పడుతూ బమ్మిడి జగదీశ్వరరావు 'పందెపు పోతులు' అనే మంచి కథ రాశాడు. భూపాల్‌ మంచి కథలు రాశాడు. రాయలసీమ నుంచి సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి, చిలుకూరి దేవపుత్ర, మహమూద్‌ ఈ ఏడాది కూడా కథలు రాశారు. యథావిధిగా స్త్రీవాద దృక్కోణంతో కుప్పిలి పద్మ 'సాలభంజిక', తదితర కథలు రాశారు.

ఇద్దరు ప్రవాసాంధ్రులు రాసిన కథలు ఇండియా ఇన్ఫో డాట్‌ కామ్‌ తెలుగు చానెల్‌లో వచ్చాయి. ఒకటి- అక్కిరాజు భట్టిప్రోలు రాసిన 'మూడు బీర్ల తర్వాత', రెండోది అల్లాడి మల్లేషయ్య రాసిన కథ 'కొత్త తరం'. అక్కిరాజు భట్టిప్రోలు రాసిన కథ వస్తు రీత్యానే కాకుండా శిల్పపరంగా కూడా ఉత్తమమైన కథ. అమెరికాలోని భారతీయుల హిపోక్రసీపై వ్యంగ్యాస్త్రం ఆ కథ. అల్లాడి మల్లేషయ్య 'కొత్త తరం' అమెరికాలోని తెలుగువాళ్లు ఇప్పటికీ కులాన్ని పట్టుకుని వేళ్లాడడంపై యువతరం తిరుగుబాటు చేసే కథ.

ప్రధానంగా తెలంగాణలో మరో ధోరణి కూడా ఈ ఏడాది కొత్తగా కనిపిస్తుంది. గతంలో ఉధృతంగా విప్లవ కథలు రాసిన అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ఈ ఏడాది రాయకపోవడం గమనార్హం. ఇదే సమయంలో, విప్లవోద్యమాన్ని విమర్శనాత్మక దృక్పథంతో చూస్తూ, దానికి దూరమవుతూ కొంత మంది కథలు రాశారు. కె.వి. నరేందర్‌ 'దొరుంచుకున్న దేవక్క', పెద్దింటి అశోక్‌ కుమార్‌ 'గోస', కాసుల ప్రతాప్‌ రెడ్డి 'యాక్సిడెంట్‌', 'ఆఫ్టర్‌ ట్వంటీ ఇయర్స్‌ అను మంచి మిత్రుల కథ' ఇలాంటివే. కాగా, కాలువ మల్లయ్య తెలంగాణలోని ఫ్యూడల్‌ సమాజంలోని సంబంధాలను ఉన్నతీకరిస్తూ కథలు రాశారు.

ఈ ఏడాది ఓల్గా 'భిన్న సందర్భాలు', పులుగు శ్రీనివాస్‌ 'సంకర విత్తులు', చైతన్య ప్రకాశ్‌ 'రేణ', కుప్పిలి పద్మ 'సాలభంజిక', తదితర రచయితల కథా సంకలనాలు వెలువడ్డాయి. మొత్తం మీద, తెలుగు కథ వస్తు రీత్యా ఒక మలుపు తీసుకోవడం ఈ ఏడాదిలో చూస్తాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X